
శ్రీనగర్: దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌లో కనిపించిన ఓ దృశ్యం ప్రత్యేకంగా నిలిచింది. లష్కర్-ఎ-తైబా కమాండర్‌గా భద్రతా సంస్థలు పేర్కొంటున్న అబిద్ రంజాన్ షేక్ తల్లిదండ్రులు తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండాను చేతిలో పట్టుకుని ఊపుతూ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు.
ఒకవైపు కుమారుడు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తిగా భద్రతా సంస్థల జాబితాలో ఉండగా.. మరోవైపు అతని తల్లిదండ్రులు భారత జాతీయ జెండాను ఎగురవేయడం చర్చనీయాంశంగా మారింది.
అబిద్ రంజాన్ షేక్ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. కశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రవాద ఘటనలతో అతనికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానికేతర కార్మికులను లక్ష్యంగా చేసుకున్న దాడుల వెనుక కూడా అతని పాత్ర ఉన్నట్లు భద్రతా సంస్థలు ఆరోపిస్తున్నాయి. అలాంటి వ్యక్తి తల్లిదండ్రులు మాత్రం తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, భారత్‌పై తమ అనుబంధాన్ని చాటడం ఆసక్తికర పరిణామంగా నిలిచింది.
షోపియాన్‌లోని ఈ దృశ్యం 2021లో జరిగిన మరో ఘటనను కూడా గుర్తు చేసింది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీ తండ్రి ముజఫర్ వానీ అప్పట్లో ఓ ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాదం, వేర్పాటువాదం వంటి సవాళ్ల మధ్య కూడా సాధారణ ప్రజల్లో జాతీయ జెండాపై గౌరవం కొనసాగుతున్నదనే చర్చకు ఇలాంటి ఘటనలు దారితీస్తున్నాయి.
ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా లోక్ భవన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, సమ్మిళిత సమాజ నిర్మాణం కోసం ప్రజలంతా ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.





