ArticlesNews

సనాతన ధార్మిక వైభవ పునరుద్ధరణే స్వాత్రంత్ర్య దినోత్సవ లక్ష్యం

7views

(ఆగస్టు 15 – భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవం )

స్వాతంత్ర్య దినం మనదేశానికి పరమపవిత్రమైన పర్వదినం. శతాబ్దాల అవమానాల తరవాత వలసపాలన సంకెళ్ళను తెంచుకుని, సార్వభౌమత్వాన్ని పునఃప్రతిష్ఠించుకున్న రోజు. వినువీధిలో రెపరెపలాడే మువ్వన్నెల జెండా ప్రతీ భారతీయుడి గుండె చప్పుడు. అది కేవలం జెండా కాదు, మన పూర్వీకుల త్యాగాలకు నిదర్శనం, మన మాతృభూమిని బలోపేతం చేసుకుని రక్షించుకోవాలి అనే శాశ్వత సందేశం. స్వతంత్ర దినం అంటే రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, సాంస్కృతిక ఆత్మగౌరవం కూడా అని గుర్తుచేసే దిక్సూచి.

స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి మన నాయకులకు స్వతంత్రం అంటే తెల్లదొరల నుంచి నల్లదొరల చేతికి అధికార మార్పిడి కాదు. మహాత్మాగాంధీ కలగన్న రామరాజ్యం… నిజాయితీ, న్యాయం, ధర్మాల మార్గదర్శకత్వంలో పాలన కొనసాగే నైతిక రాజ్యానికి ప్రతీక. ఆయన ప్రజాస్వామ్యాన్ని పాశ్చాత్య పద్ధతుల గుడ్డి అనుసరణగా చూడలేదు, భారతదేశపు స్వీయ సాంస్కృతిక నైతిక విలువగా పరిగణించారు. ‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో’ అని సాగే రవీంద్రనాథ్ టాగోర్ అజరామర కవిత కుత్సిత విభజనలతో ముక్కలు కాకుండా హేతుబద్ధంగా కొనసాగే సమాజం దిశగా ప్రయాణించాలన్న ఆశయాన్ని ప్రతిబింబిస్తుంది.

భారతదేశపు ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ దేశ ప్రజలను ఐకమత్యంగా ఉండాలనీ, ధర్మాన్ని నిలబెట్టి తీరాలనీ, ఐకమత్యమే మహాబలమనీ చాటిచెప్పారు. ఆగస్టు 15నే జయంతి ఉన్న అరవింద యోగి స్వాతంత్ర్య దినం దైవ వరప్రసాదమని వ్యాఖ్యానించారు. ప్రపంచానికి ఆధ్యాత్మిక గురువు పాత్రను పోషిస్తుందని భావించారు. నెహ్రూ సైతం తన స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో చరిత్ర ప్రారంభకాలం నుంచీ భారతదేశపు అనంతమైన తాత్వికతను గుర్తించారు. భవిష్యత్ సవాళ్ళను ఎదుర్కొనేందుకు తగిన ధైర్యసాహసాలు దేశానికి ఉన్నాయా అని ప్రశ్నించారు. అయితే తాను ప్రబోధించిన ఆశయాలనే ఆయన విడిచిపెట్టేయడం విషాదం. దేశీయ తాత్వికతను వెనుకబాటుగా భావించి పాశ్చాత్య పద్ధతును టోకున దిగుమతి చేసారాయన. ఐరోపీయ సామ్యవాదం, కేంద్రీకృత ప్రణాళికలు అనే సంకెళ్ళతో భారతీయ సాంస్కృతిక జాతీయతావాదాన్ని బంధించారు. నెహ్రూ పాశ్చాత్య పరిపాలనా విధానం గాంధీని పార్లమెంటు బైట బొమ్మగా మిగిల్చింది.

డాక్టర్ కేశవ బలీరాం హెడ్గేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాత్రం, సాంస్కృతిక పునరుత్థానం లేని స్వాతంత్ర్యం ఉత్త కీలుబొమ్మ అని అర్ధం చేసుకుంది. బలమైన, ఐకమత్యమైన హిందూ సమాజం అనే ప్రేరణ కలిగిన హెడ్గేవార్, నిజమైన స్వాతంత్ర్యమంటే రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, భారతదేశపు ధార్మిక అస్తిత్వ పునరుద్ధరణే అని విశ్వసించారు. ఆయన వారసుడు మాధవ సదాశివ గోళ్వాల్కర్, దేశమంటే కేవలం భూభాగం కాదనీ, సనాతన నాగరికతలో మూలాలున్న సజీవ సాంస్కృతిక అస్తిత్వమని పదేపదే చెప్పారు. స్వాతంత్ర్య పోరాట సమయంలోనూ, ఆ తరువాతా అదే జాతీయవాద స్ఫూర్తిని ఆర్ఎస్ఎస్ పెంచిపోషించింది. స్వతంత్రం అంతిమలక్ష్యం కాదనీ, అంతకు మించిన సుదీర్ఘ ప్రయాణానికి ప్రారంభం అనీ గుర్తుచేస్తూవస్తోంది.

ఆ ఎరుక వల్లనే, దశాబ్దాల తరబడి నెహ్రూమార్కు సామ్యవాదం తర్వాత కూడా భారతీయ ఆత్మ మరణించలేదు. సాంస్కృతిక జాతీయవాదం దేవాలయాల్లోనూ, గ్రామాల్లోనూ, క్షేత్రస్థాయి ఉద్యమాల్లోనూ కొనసాగింది. 60వ దశకంలో దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మతా మానవవాదం, అభివృద్ధికి అసలుసిసలైన భారతీయ విధానంగా నిలిచింది. దాని మూలాలు మార్క్సిస్టు లేదా పెట్టుబడిదారీ విధానాల్లో కాక ధర్మం, సమరసతల్లో ఉన్నాయి. కానీ అలాంటి దార్శనిక ఆలోచనా విధానాలను కాంగ్రెస్ పాలకులు విస్మరించారు, పాశ్చాత్య ప్రపంచానికి వికారమైన నమూనాలనే అనుసరించారు. అయినప్పటికీ భారతదేశం నిలదొక్కుకోగలిగింది. దశాబ్దాలు గడిచే కొద్దీ నెహ్రూ విధానాల వైఫల్యాలు స్పష్టమయ్యాయి. లైసెన్స్‌-పర్మిట్ విధానం సంస్థలను నాశనం చేసింది, సామ్యవాదం అసమర్ధతను పెంచిపోషించింది, దిగుమతి చేసుకున్న నమూనాలు ప్రజలను తమ సాంస్కృతిక మూలాలకు దూరం చేసాయి.

వాజపేయీ, నరేంద్రమోదీల జాతీయవాద ప్రభుత్వాల పాలనలోనే స్వాతంత్ర్యానికి నిజమైన రాజకీయ అర్ధం అమల్లోకి వచ్చింది. ఆత్మనిర్భర భారతం అనేది కేవలం ఆర్థిక నినాదం కాదు, నాగరికతకు మేలుకొలుపు. భారతీయులకు తమ సొంత సామర్థ్యాలపై, తమ సంప్రదాయాలూ విజ్ఞాన విధానాలపై విశ్వాసం ఉండాలనే పిలుపు. జాతీయవాద ప్రభుత్వాల హయాంలోనే చరిత్రలో మూలనపడిన స్వాతంత్ర్య సమరయోధుల గాధలు మళ్ళీ సంస్మరణకు నోచుకుంటున్నాయి.

ఈ సైద్ధాంతిక మార్పు కీలకమైనది. స్వతంత్ర దినాన్ని పాలకులు మారిన రోజుగా మాత్రమే గుర్తుంచుకోకూడదు. భారతదేశం తన నాగరికతా పునరుజ్జీవాన్ని ప్రారంభించిన రోజుగా గుర్తుంచుకోవాలి. గాంధీ రామరాజ్యం, టాగోర్ నిర్భయ మనస్సు, పటేల్ ఐక్యత, అరవిందయోగి ఆధ్యాత్మికత, దీనదయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మతా మానవవాదం అన్నీ ఒకే ఒక సత్యంలో కలిసిపోతాయి. అదే… ఆత్మవిశ్వాసం కలిగిన, ఆత్మనిర్భరతతో కూడిన, ధార్మిక దేశంగా తలెత్తుకు నిలబడడమే భారతదేశపు విధి. మన దేశం ఇంకెంతమాత్రం ఇతరులను అనుకరిస్తూ ఉండిపోదు, ప్రపంచానికి సనాతన జ్ఞానాన్ని పంచిపెట్టే మార్గదర్శిగా నిలుస్తుంది అని ధ్రువీకరించే చారిత్రక ఘట్టమే స్వాతంత్ర్య దినోత్సవం. జైహింద్.