ArticlesNews

స్వతంత్ర భారతికి రక్తపాతంతో స్వాగతం

13views

(ఆగస్టు 14 – విభజన ఘాతుకాల సంస్మరణ దినం )

బ్రిటిష్ వారి పాలన నుంచి భారతదేశానికి రాజకీయ స్వాతంత్ర్యం వచ్చిన రోజు 1947 ఆగస్టు 15. దానికి ఒకరోజు ముందే తెల్లదొరతనం అఖండ భారతదేశం నుంచి మరో రెండు ముక్కలు విరగ్గొట్టి, పాకిస్తాన్ పేరిట భారత్‌కు శాశ్వత శత్రువును సృష్టించింది. దేశం తూర్పు, పశ్చిమ భాగాల్లో జరిగిన ఆ విభజన, ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన అధ్యాయంగా మిగిలిపోయింది. వేలాది కుటుంబాల రక్తంతో తడిసి ముద్దవుతూ భారతావని స్వతంత్ర జీవితంలోకి అడుగుపెట్టింది. స్వాతంత్ర్యాన్ని పండుగలా జరుపుకోవలసిన సమయంలో చోటుచేసుకున్న ఘాతుకాల గురించి వలసపాలకుల వారసులు చాలాకాలం దాచిపెట్టారు. స్వతంత్రం వచ్చిన 74ఏళ్ళ తర్వాత, జాతీయవాద ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే, ఆ ఘాతుకాల చరిత్ర సామాన్య భారతీయుడికి తెలుస్తోంది. ఇవాళ మనం సుఖంగా జీవిస్తున్నామంటే దానికి కారణం ఆనాడు వారు చేసిన త్యాగాలే. అందుకే దేశ విభజనవేళ జరిగిన ఘాతుకాలను తెలుసుకోవాలి.

1947లో జరిగిన భారతదేశ విభజన, ప్రపంచ మానవాళి చరిత్రలోనే అత్యంత భయానకమైన ఘట్టం. ఆగస్టు 15 తెల్లవారేసరికి, లక్షలాది ప్రజలు తమ పూర్వీకుల భూముల నుంచి వెళ్ళగొట్టబడ్డారు. రాత్రికి రాత్రి నిరాశ్రయులుగా మారిపోయిన వారు, కొత్తగా ఏర్పడిన దేశాలకు అత్యంత ప్రమాదకరమైన ప్రయాణాలు చేయవలసి వచ్చింది. రైళ్ళు, గుర్రాలు, గాడిదల మీదనే కాదు చివరికి కాలినడకన కూడా లక్షల కుటుంబాలు తరలిపోయాయి. ప్రపంచ చరిత్రలో నమోదైన అతిపెద్ద వలసల ఘట్టమది. ఆనాడు జరిగిన రక్తపాతానికి అంతేలేదు. ఆ హింసాకాండలో దాదాపు ఇరవై లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, కోటిన్నర మంది తమ ఇళ్ళను వదిలి శరణార్థులుగా తరలిపోవలసి వచ్చింది. ఆ సంఘటన భారత ఉపఖండపు జనాభా స్వరూపాన్ని, రాజకీయ, సామాజిక వ్యవస్థలనూ మార్చివేసింది. మతపరమైన హింస, బలవంతపు వలసలూ చేసిన గాయాలు నేటికీ భారతదేశపు సామాజిక రాజకీయ ముఖచిత్రం మీద మచ్చలుగా నేటికీ దుష్ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి.

దేశ విభజన వల్ల తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతం సాంస్కృతికంగా, మతపరంగా విస్తార వైవిధ్యం ఉన్న పంజాబ్. హిందువులు, ముస్లిములు, సిఖ్ఖులకు నివాసమైన ఆ ప్రాంతంలో… తూర్పు పంజాబ్ భారత దేశానికీ, పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్‌కూ ముక్కలుగా పంచబడ్డాయి. పంజాబ్ విభజన ఆ ప్రాంతానికి కీలకమైన జలవనరుల మీద కూడా ప్రభావం చూపించింది. సట్లెజ్, రావి, బియాస్ నదులు భారత్‌కు చీనాబ్, జీలం నదులు పాకిస్తాన్‌కూ కేటాయించబడ్డాయి. ఆ నదుల విభజన సామాన్య ప్రజల కడగండ్లను పరాకాష్టకు చేర్చింది. మరోవైపు బెంగాల్‌ను రెండు ముక్కలు చేసి తూర్పుప్రాంతాన్ని పాకిస్తాన్‌కూ, పశ్చిమప్రాంతాన్ని భారతదేశానికీ పంచారు. ఆనాడు చెలరేగిన హింసతో కలకత్తా రోడ్లు రక్తమయమయ్యాయి.

ఇన్నాళ్ళూ విభజన ఘాతుకాల గురించి ప్రజాబాహుళ్యంలో పెద్దగా చర్చించలేదు. ఆ బాధాకరమైన గతాన్ని గుర్తు చేసుకోవడం సమాజంలో ఉద్రిక్తతలకు దారితీస్తుందేమో, పాతగాయాలను మళ్ళీ రేపుతుందేమో అనే సాకులతో గత ప్రభుత్వాలు విభజన అరాచకాలను విస్మరించాయి. ఆ విస్మరణకు నిజమైన కారణం మైనారిటీలను బుజ్జగించే ధోరణి, మెజారిటీ ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరి మాత్రమే. అయితే ఆ నిర్లక్ష్యం వల్ల వేర్పాటువాద, అతివాద శక్తులు వివిధ రూపాల్లో కొనసాగుతూనే వచ్చాయి. కశ్మీర్‌ నుంచి హిందువుల తరిమివేత, పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకత వంటి పరిణామాలకు కారణమైన మతపరమైన, సైద్ధాంతికమైన ఉద్రిక్తతలకు మూలాలు దేశవిభజనలోనే ఉన్నాయి. నిజానికి, వేదనాభరితమైన గతాన్ని తెలుసుకుని ఎదుర్కొంటేనే దేశం కోలుకొంటుంది. విభజన వల్ల ప్రభావితులైన లక్షలాది మంది ప్రజల బాదలను గుర్తించడం చరిత్రకు ప్రతిబింబం మాత్రమే కాదు, అటువంటి విషాదాలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోడానికి ఉపయోగపడుతుంది. విభజన వేళ జరిగిన ఘాతుకాలు, పోయిన ప్రాణాలను గుర్తుచేసుకోవడం ద్వారా గతాన్ని మరింత సమగ్రంగా తెలుసుకోవడం, ప్రజల్లో మరింత ఐక్యతను పెంచగలదు.

భరతమాత నుదుటన సిందూరం అద్దవలసిన వేళ లక్షల మంది ప్రజల రక్తమోడిన సందర్భం దేశ విభజన. ఆనాటి ఘాతుకాలను తెలుసుకోవాలి, భవిష్యత్తులో అలాంటి ఘోరాలు జరగకుండా కాపాడుకోవాలి. దానికోసమే మనం దేశ విభజన ఘాతుకాల సంస్మరణ దినాన్ని జరుపుకోవాలి.