
విశాఖ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ సమన్వయ్ బైఠక్ ఈ సారి ఆంధ్రప్రదేశ్ లోని గుడిలోవలో జరగనుంది. ఈ నెల 19 నుంచి 21 వ తేదీ వరకూ మూడ రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. గత యేడాది ఈ సమన్వయ్ బైఠక్ జోధ్ పూర్ వేదికగా జరిగింది. సెప్టెంబర్ 5,6,7 తారీఖుల్లో జరిగింది.
మరోవైపు ఈ యేడాది విశాఖపట్నంలోని గుడిలోవా కేంద్రంగా జరిగే ఈ బైఠక్ లో సంఘ్ స్ఫూర్తితో పనిచేస్తున్న మొత్తం 32 సంస్థలు ఈ సమావేశంలో పాల్గొంటాయి. ఈ సంస్థలకు చెందిన అఖిల భారత స్థాయి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంఘటనా కార్యదర్శులు మరియు ఎంపిక చేసిన ఇతర ముఖ్య బాధ్యులు ఈ బైఠక్ కి హాజరవుతారు. ఈ సంస్థలన్నీ గత అనేక సంవత్సరాలుగా సామాజిక రంగంలో నిరంతరం క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ప్రజా జీవితంలోని వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రజల్లో అవగాహన కల్పించడం మరియు వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు, మార్పులను తీసుకురావడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో ఈ సంస్థలు చురుకుగా నిమగ్నమై ఉన్నాయి.
మరో వైపు ఈ సమన్వయ్ బైఠక్ లో ఆయా సంస్థలు తమ కార్యకలాపాల గురించి సమాచారాన్ని అందిస్తాయి. అలాగే వివిధ అంశాలపై తమ పరిశీలనలు, సూచనలను కూడా తెలియజేస్తాయి. అన్ని సంస్థల మధ్య పరస్పర సమన్వయం, సహకారాన్ని మరింత పెంపొందించడంపై అలాగే ప్రజా సంక్షేమం మరియు విధానపరమైన అంశాలపై చర్చలు జరుగుతాయి. జనాభా అసమతౌల్యత, యువతలో వున్న వ్యసనాలపై విముక్తి, పంచ పరివర్తన అమలు వంటి అంశాలతో పాటు ప్రస్తుత పరిస్థితులపై కూడా చర్చించనున్నారు.
ఈ సమావేశానికి సర సంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే, సహ సర్ కార్యవాహలు, అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, సక్షం మరియు రాష్ట్ర సేవికా సమితి సహా 32 సంస్థల ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొంటారు.





