
న్యూఢిల్లీ : ఆందోళన కూడా ఓ రకమైన సంభాషణే అని ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన కూడా ఏకాభిప్రాయం సాధించడానికి ఓ పద్ధతి అని అన్నారు.ఓ దగ్గరికి రావడం ద్వారా చాలా లాభాలున్నాయని అన్నారు. అయితే చర్చల తర్వాత కూడా సమస్యకు పరిష్కారం దొరకని పక్షంలో నిరసన మార్గాల వైపు వెళ్లొచ్చన్నారు.కానీ అది విభజన పద్ధతులకు దారి తీయవద్దన్నారు.
ముంబై వేదికగా GEN Zతో మోహన్ భాగవత్ సంవాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయితే.. చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుందని, విభజన పద్ధతులను అవలంబిస్తే కుదరదన్నారు. అయితే జెన్ జీ లేవనెత్తిన సమస్యలు మాత్రం సరైనవేనన్నారు. భారత దేశ విద్యా వ్యవస్థలో చాలా సంస్కరణలు తేవాల్సిన అవసరం వుందన్నారు. అయితే అలా జరగడం లేదన్నారు. అందుకే చర్చలు జరగాలన్నారు. అయితే చర్చల తర్వాత కూడా పరిష్కారం దొరకని పక్షంలో ఏం చేయాలన్నది ఆ తర్వాతి సమస్య అని తెలిపారు. ఏదైనా విభేదాలు తలెత్తినప్పుడు చర్చలే ప్రథమ కర్తవ్యంగా వుండాలన్నారు.
అయితే.. తాము యవ్వన దశలో వున్న సమయంలో తమ పెద్దలు ఏది చెబితే, దానిని వినేవారమని, అప్పట్లో తమ తరం యువకులు అలా వుండేవారని భాగవత్ గుర్తు చేశారు.వారు చెప్పిందే వినేవారం తప్పించి, ఎదురు ప్రశ్నలు వేసేవారమే కాదన్నారు.అయితే.. ఇది అప్పటి పరిస్థితి అని, కానీ.. ఇప్పటి జెన్ జీ ప్రశ్నలు అడుగుతారని, తార్కిక విధానంలో వారికి సమాధానాలు చెప్పాల్సి వుంటుందన్నారు. అలాగే దీనితో పాటు ప్రేమ కూడా దానికి తోడైతే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
అయితే.. చర్చ అనే విషయంలో ఆంగ్లంలో డిబేట్ అని పిలుస్తారని, కానీ.. మన విధానంలో ‘‘శాస్త్రార్థం’’ (పాండిత్య చర్చ) అని అంటారన్నారు. ఇందులో వాద, ప్రతివాదాలు అన్న పద్ధతి వుండదని, పూర్వ పక్షం, ఉత్తర పక్షం అనే విధానం వుంటుందన్నారు.ఈ శాస్త్రార్థంలో అందరి వాదనలు వింటారని, దీని ద్వారా ఓ కొత్త కోణం స్ఫురిస్తుందన్నారు.అయితే.. రకరకాల వాదనలు ఇందులో బయటికి వస్తాయని, అప్పుడప్పుడు కౌంటర్లు కూడా వస్తాయని, అయితే.. చివరకు మాత్రం సత్యానికి సంబంధించిన అసలైన కోణం ఆవిష్కృతమవుతుందన్నారు.
అయితే జెన్ జీ ఆందోళనలు చేయవద్దని మాత్రం తాను అనడం లేదని భాగవత్ తేల్చి చెప్పారు. అయితే.. ఎలా చేయాలి? ఏం చేయాలి? అన్నది రాజ్యాంగంలో కూడా పొందుపరిచారన్నారు. రాజ్యాంగ నిర్మాణ బాబా సాహేబ్ అంబేద్కర్ కి సంబంధించిన రెండు ఉపన్యాసాల్లో కూడా ఈ పద్ధతి వుందన్నారు.ఈ సందర్భంగా అంబేద్కర్ సూచించిన మార్గదర్శకాన్ని కూడా ఉటంకించారు.
జెన్ జెడ్ ఆకాంక్షలను సమాజం, సంస్థలు అర్థం చేసుకోవాలని భాగవత్ పిలుపునిచ్చారు. చర్చల ద్వారా, బాధ్యతాయుత పాలన ద్వారా నిజమైన ఆందోళనలను పరిష్కరించాలని కోరారు. ఏ నిరసన అయినా సరే దాని ఉద్దేశం, విధానం, ప్రవర్తన సముచితంగా, గౌరవ ప్రదంగా వుండాలన్నారు. ‘జెన్-జెడ్’ (Gen-Z) తమ గళాన్ని వినిపిస్తున్నప్పుడు, దానిని కేవలం వ్యతిరేకతగా మాత్రమే చూడొద్దని, వారి సవాళ్లను సానుభూతితో అర్థం చేసుకోవాలన్నారు. వీటిని పరిష్కరించడం సమాజం, వ్యవస్థ బాధ్యత అని తెలిపారు.
ఏ ఉద్యమమూ ఏ వ్యక్తికి, వర్గానికి లేదా సమూహానికి వ్యతిరేకంగా ఉండకూడదని, అయితే వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకురావడమే దాని లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.
జెన్ జీ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుందంటే, వారికేదో సమస్య వుందని అర్థం చేసుకోవాలని ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ఆ సమస్యను సరిచేయాలన్నారు. అయితే ఆందోళన అనేది వ్యవస్థను సరిచేయడానికి వుండాలన్నారు.జెన్ జీ ఆందోళన చేసినంత మాత్రాన దేశ వ్యతిరేకులు కారన్నారు.వారు కూడా మనవారేనని, వచ్చే తరం వారని అన్నారు. అయితే.. దీనికో వారధి అంటూ వుండాలని,దీని ద్వారా ఒకరి విషయాన్ని ఒకరు సావధానంగా వినే అవకాశం వుంటుందన్నారు.
అయితే జెన్ జీ.. ప్రస్తుత వున్న తరం కంటే చాలా నిజాయితీపరులని భాగవత్ ప్రకటించారు.అయితే.. యాంకర్ నిరసనకారులపై పెల్లెట్ గన్స్ వాడకం, లాఠీ ఛార్జి చేయడం కూడా జరుగుతుంది కదా? అని అడగ్గా… అసలు ఏం జరిగింది? ఎందుకు జరిగింది? అన్న మూలాల్లోకి వెళ్లాల్సి వుంటుందని భాగవత్ స్పష్టం చేశారు.అయితే పెల్లెట్ గన్స్ వినియోగం, లాఠీఛార్జి ఎందుకు జరిగిందన్న సమాచారం తనవద్ద పూర్తిగా లేదని, మీ వద్ద (యాంకర్) వద్ద కూడా పూర్తిగా వుందని తాను అనుకోవడం లేదన్నారు. మనమందరమూ వార్తలను చదివి మాత్రమే మాట్లాడుతున్నామని, నిజంగా ఏం జరిగిందో తెలియదన్నారు. అయితే.. దీని విషయంలో కొన్ని వార్తలు చదివానని, అయితే దీని వాస్తవాలు తనకు తెలియదన్నారు. అయితే.. తాను మాత్రం కళ్లు మూసుకొని జెన్ జీ పైనే పూర్తి విశ్వాసంతో వుంటానని ప్రకటించారు.



