గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని విద్యార్థుల్లో ఏకాగ్రత, మానసిక ఉల్లాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించి భవిష్యత్ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు.
కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు కుమార్ నాయక్, కుమార్ నాయుడు, ప్రవీణ్ కుమార్‌లతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం మేరకు గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని విద్యార్థులకు ఏడాది పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు ప్రతిభలో ఎవరికి తీసిపోరని అన్నారు. విద్యతో పాటు మానసిక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, ఒత్తిడి నిర్వహణ, నాయకత్వ నైపుణ్యాల పెంపొందింపులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షణ కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ శిక్షణ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అధికారి మోహన్ నాయక్, బీసీ సంక్షేమశాఖ అధికారి రాజేంద్రకుమార్ రెడ్డి, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి శ్రీరాములు నాయక్, గురుకుల పాఠశాలల సిబ్బంది, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.





