News

ఆపరేషన్ త్రిశూల్: విదేశాల్లోని 274 మంది నేరస్థులను పట్టుకొచ్చిన కేంద్రం

0views

దేశ సరిహద్దులు దాటి పరారైన క్రిమినల్స్, ఆర్థిక నేరగాళ్లపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. 2019 నుంచి 2026 జులై వరకు గత ఏడేళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల నుంచి ఏకంగా 274 మంది పరారీలో ఉన్న నిందితులను భారత్‌కు రప్పించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ జాబితాలో ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్ స్మగ్లర్లు, హత్యలు, అత్యాచారాలు మరియు పోక్సో కేసులలో నిందితులుగా ఉన్న ప్రధాన క్రిమినల్స్ ఉన్నారు.

నేరస్థులను రప్పించడంతో పాటు వారి ఆర్థిక ముప్పును తొలగించేందుకు కేంద్ర ఏజెన్సీలు కఠిన చర్యలు తీసుకున్నాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) ద్వారా పరారీలో ఉన్న క్రిమినల్స్‌కు చెందిన రూ. 17,874 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయగా, ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో మరో రూ. 18,762 కోట్లను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది.

హోం శాఖ గణాంకాల ప్రకారం విదేశాల నుంచి నేరస్థుల అప్పగింతలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. అత్యధికంగా 2025లో 70 మంది నేరస్థులను భారత్‌కు తీసుకొచ్చారు. ఇక 2026 జులై నాటికే 45 మంది అప్పగింత పూర్తయింది. అంతకుముందు 2024లో 43 మంది, 2023లో 37 మంది, 2022లో 40 మంది, 2021లో 23 మంది, 2020లో ఏడుగురు మరియు 2019లో తొమ్మిది మందిని భారత్‌కు రప్పించారు.

భారత్‌కు తిరిగికొచ్చిన 274 మంది నేరస్థులు వివిధ రకాల తీవ్రమైన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరిలో 62 మంది హత్యలు, దోపిడీలు, హింసాత్మక ఘటనలకు పాల్పడినవారు కాగా, 53 మంది అత్యాచారాలు మరియు పోక్సో కేసులలో నిందితులుగా ఉన్నారు. అలాగే 42 మంది గ్యాంగ్‌స్టర్ కార్యకలాపాల్లో, 18 మంది కిడ్నాప్ మరియు మానవ అక్రమ రవాణాలో, 17 మంది ఉగ్రవాదం, దేశద్రోహం మరియు నార్కో టెర్రరిజం కేసుల్లో ఉన్నారు. వీరితో పాటు 16 మంది డ్రగ్స్ రవాణాలో, 12 మంది సైబర్ నేరాలు, స్మగ్లింగ్ మరియు నకిలీ కరెన్సీ వ్యవహారాల్లో, మరో తొమ్మిది మంది ఆర్థిక మోసాల కేసుల్లో నిందితులుగా ఉన్నారు.

విదేశాలలో పేర్లు, గుర్తింపులు మార్చుకుని తలదాచుకుంటున్న క్రిమినల్స్‌ను కనిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ త్రిశూల్’ చేపట్టింది. శాటిలైట్ లొకేషన్ వివరాలు, డిజిటల్ ఫుట్‌ప్రింట్లు, అత్యాధునిక నిఘా సాంకేతికతను ఉపయోగించి నిందితులను పసిగట్టారు. ఈ ఆపరేషన్‌లో CBI, IB, R&AW, NIA, ED, MEA, NCB, DGGI మరియు రాష్ట్రాల పోలీస్ వ్యవస్థలు సమన్వయంతో ‘హోల్ ఆఫ్ గవర్నమెంట్’ విధానంలో పనిచేసి ఈ విజయం సాధించాయి.

గత మూడేళ్లలో ఇంటర్‌పోల్ ద్వారా 501 కంటే ఎక్కువ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయగా, ఒక్క 2026లోనే 182 నోటీసులు ఇచ్చారు. దేశంలోని 1,400 కంటే ఎక్కువ పోలీస్ ఏజెన్సీలను ఇంటర్‌పోల్‌తో అనుసంధానిస్తూ ప్రవేశపెట్టిన ‘భారత్‌పోల్’ ప్లాట్‌ఫామ్ ద్వారా అంతర్జాతీయ సమాచార మార్పిడి వ్యవస్థ మరింత వేగవంతమైంది.

26/11 ముంబయి ఉగ్రదాడి నిందితుడు తహవ్వూర్ హుస్సేన్ రాణా‌ను అమెరికా నుంచి భారత్‌కు తీసుకురావడం దౌత్యపరంగా, న్యాయపరంగా దేశం సాధించిన అతిపెద్ద విజయమని హోం శాఖ పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పారిపోయిన నేరస్థులను పట్టుకోవడాన్ని జాతీయ ప్రాధాన్య అంశంగా భావిస్తున్నామని, ఇందుకోసమే 2018లో ప్రత్యేకంగా ‘ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ ఆక్ట్’ తీసుకొచ్చామని వెల్లడించింది.