
31views
జర్మనీ,జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాతో ప్రపంచంలోని ఇతర దేశాల వారికి తమ వారసత్వం, తమ పూర్వీకుల చరిత్ర బాగా తెలుసని, అందుకే వారు సరైన మార్గాల్లో పయనిస్తున్నారని ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు మన్మోహన్ వైద్య అన్నారు. అయితే.. ఈ విషయంలో భారత్ లోని ప్రజలకు ఈ విషయాలపై ఏకాభిప్రాయం లేదన్నారు.
ఈ నెల 4 న ‘‘దేశ పునర్నిర్మాణంలో యువత పాత్ర’’ అనే అంశంపై యువ వైద్యులతో అజ్మీర్ లో ఓ కార్యక్రమం జరిగింది. భారత మాత చిత్రపటానికి పుష్పార్చన చేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది.నెహ్రూ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ అనిల్ సమారియా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఆర్ఎస్ఎస్ విభాగ సంఘచాలక్ ముకేష్ అగర్వాల్, మహానగర సంఘచాలక్ ఖాజూలాల్ చౌహాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రపంచంలో ఏ ఇతర దేశానికీ రెండు పేర్లు లేవని, కానీ భారత రాజ్యాంగం “ఇండియా, దట్ ఈజ్ భారత్” (India, that is Bharat) అని పేర్కొందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దేశం ఇండియా నా లేదా భారత్ నా అనేది ఇంకా తేల్చుకోవాల్సి ఉందన్నారు. ‘భారత్’ అనేది ఈ దేశ సాంస్కృతిక గుర్తింపునకు ప్రతీక అని చెప్పారు. భారతదేశ పొరుగు దేశాన్ని ప్రస్తావిస్తూ, బర్మా ప్రాచీన పేరు ‘బ్రహ్మ దేశ్’ అని, బ్రిటిష్ వారు దానిని ‘బర్మా’గా మార్చారని, అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ దేశం తన పేరును మళ్లీ ‘మ్యాన్మార్’గా పునరుద్ధరించుకుందని గుర్తుచేశారు.
స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో స్వరాజ్, స్వతంత్రత, స్వదేశీలలో ఉన్న ‘స్వ’ అనేది భారత్ యొక్క సొంత గుర్తింపును సూచిస్తుందని, ఈ ‘స్వ’కి పునాది భారత్ యొక్క ఆధ్యాత్మికతేనని, అది అందరినీ ఏకం చేస్తుందని ఆయన అన్నారు. ఈ ఆధ్యాత్మికతే స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని తెలిపారు.
వందేమాతరం గేయాన్ని ఇప్పుడు పూర్తి రూపంలో పాడుతున్నామని, అది భారత్ యొక్క సమగ్ర వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని డాక్టర్ వైద్య అన్నారు. 1905 నాటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ, బ్రిటిష్ వారు బెంగాల్ విభజనను ప్రతిపాదించినప్పుడు, ఆ ప్రాంతమంతా ఏకమై వ్యతిరేకించిందని, హిందువులు మరియు ముస్లింలు ఇద్దరూ వందేమాతరం నినాదాలు చేశారని చెప్పారు. సాధారణంగా శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధన్ జరుపుకున్నప్పటికీ, బెంగాల్ విభజనకు నిరసనగా ఏకత్వానికి ప్రతీకగా 1905 అక్టోబర్ 16న దానిని పాటించారని పేర్కొన్నారు.
ప్రజలు వందేమాతరం గీతాన్ని ఆలపిస్తూ ఒకరికొకరు రాఖీలు కట్టుకుని, విభజనను జరగనివ్వకూడదని సంకల్పించారు. పెరిగిపోతున్న ఈ ఉద్యమాన్ని చూసి భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం, వందేమాతరం బహిరంగంగా పాడటంపై నిషేధం విధించిందని ఆయన చెప్పారు. చివరకు 1911లో బ్రిటిష్ వారు బెంగాల్ విభజన ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత వందేమాతరం విప్లవకారుల నినాదంగా మారింది, ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు వందేమాతరం అని స్మరిస్తూ ఉరికంబాలను కూడా ఎక్కారన్నారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులపై ఎక్కువ దృష్టి సారిస్తున్నప్పటికీ, బాధ్యతలపై చాలా తక్కువ శ్రద్ధ చూపుతున్నారని డాక్టర్ మన్మోహన్ వైద్య అన్నారు. శతాబ్ది ఉత్సవాల వేళ, ‘పంచ్ పరివర్తన్’ (ఐదు మార్పులు) ద్వారా సామాజిక మార్పును తీసుకురావడానికి ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని, పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు.
డాక్టర్ అనిల్ సమారియా మాట్లాడుతూ, నేడు ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచిందన్నారు. యువతకు సరైన దిశ, విలువలు, మార్గదర్శకత్వం లభిస్తే, భారతదేశం ‘విశ్వగురువు’గా మారకుండా ప్రపంచంలో ఏ శక్తి నిరోధించలేదన్నారు. ఒక దేశ పురోగతి కేవలం ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధి ద్వారా మాత్రమే సాధ్యం కాదని, ఆ దేశ యువత యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వం, బాధ్యతా రాహిత్య రాహిత్యం లేని ప్రవర్తన, దేశభక్తి, సేవాభావం మరియు నూతన ఆవిష్కరణల ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. నేటి యువత ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించేవారిగా (జాబ్ క్రియేటర్స్) మారి సమస్యలకు పరిష్కారాలు చూపుతూ సమాజానికి కొత్త దిశానిర్దేశం చేయాలని పిలుపునిచ్చారు.




