
విజయనగరం మండలంలోని దుప్పాడ గ్రామంలో ఉన్న 4 ఎకరాల 62 సెంట్ల భూమి దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినదేనని ఆ శాఖ సహాయ కమిషనర్ శిరీష స్పష్టం చేశారు. భూమిని కొందరు కంచె వేసి ఆక్రమించుకున్నారనే ఫిర్యాదు నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు వన్‌టౌన్ పోలీసుల సహకారంతో స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు.
ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అందిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు భూమి వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించినట్లు ఆమె వెల్లడించారు. సంబంధిత రికార్డుల ప్రకారం ఈ భూమి దేవాదాయ శాఖ పరిధిలోనే ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ, ఈ స్థలం దుప్పాడ గ్రామ ప్రజల సంక్షేమం కోసం ఉద్దేశించినదని చెప్పారు. గ్రామస్తులు కాకుండా ఇతరులు ఎవరైనా భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆక్రమణలను తొలగించి ఆ స్థలంలో రామాలయాన్ని నిర్మించాలని దుప్పాడ గ్రామస్థులు నిర్ణయించారని, వారి నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని సహాయ కమిషనర్ తెలిపారు.




