
రాజమహేంద్రవరం : గ్రామాభివృద్ధియే దేశాభివృద్ధికి పునాది అనే లక్ష్యంతో గ్రామాల సర్వాంగీణ అభివృద్ధి, ఆదర్శ గ్రామాల నిర్మాణం కోసం గ్రామ వికాస్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని గ్రామ వికాస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత సంయోజక్ శ్రీ తిరుపతయ్య తెలిపారు.

రాజమహేంద్రవరంలోని శ్రీ సత్యసాయి ధ్యాన మందిరంలో ఆదివారం గోదావరి విభాగ్ ఆధ్వర్యంలో గ్రామ వికాస్‌పై అవగాహన కల్పించేందుకు విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముందు భూ సుపోషణ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సమావేశంలో గ్రామ వికాస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత పర్యావరణ ప్రముఖ్ శ్రీ చదరం నరసింగరావు, ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ్ కార్యవాహ శ్రీ వీరభద్రరాజు, విభాగ్ ప్రచారక్ శ్రీ సోము పాల్గొని గ్రామ వికాస్ లక్ష్యాలు, గ్రామాభివృద్ధిలో కార్యకర్తల పాత్రపై మార్గదర్శనం చేశారు.
ముఖ్య అతిథులుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ శ్రీ విరాట్ బంగార్రాజు, విశ్వ మానవ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ మల్లుల సురేష్ హాజరై గ్రామాభివృద్ధికి సంబంధించి తమ అనుభవాలను పంచుకున్నారు.

సమావేశంలో గోదావరి విభాగ్ సంయోజక్ చింతాకుల గోపాలకృష్ణ, నక్కా శ్రీను, బి. లక్ష్మీనారాయణ, సాధనాల శ్రీనివాసు, కలగ సతీష్, కుక్కడపు రత్నాజీ, నారాయణరెడ్డి తదితరులతో పాటు 38 గ్రామాల నుంచి 65 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
గ్రామ వికాస్ చేపడుతున్న ఏడు ఆయామాల అభివృద్ధి కార్యక్రమాలను ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించడం సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.





