
ఆగ్రా (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఓ హిందూ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తనను వేధింపులకు గురిచేసి, బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ బాధితురాలి కుటుంబం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
షంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఫైజాన్ అనే యువకుడిపై ఆరోపణలు నమోదయ్యాయి. బాధితురాలిని పరిచయం చేసుకునే సమయంలో తనను ‘రాహుల్’గా చెప్పుకున్నాడని, అనంతరం అతని అసలు గుర్తింపు తెలిసిన తర్వాత ఆమెను బెదిరించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
పరిచయం నుంచి వేధింపుల వరకు..
పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం, బాధిత విద్యార్థిని తన సహాధ్యాయి ద్వారా నిందితుడిని పరిచయం చేసుకుంది. పరీక్షా కేంద్రాలకు వెళ్లే సమయంలో అతను సహాయం చేసేవాడని, ఆ పరిచయం క్రమంగా ఫోన్ సంభాషణలకు దారితీసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సమయంలో బాధితురాలికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలను నిందితుడు సేకరించాడని, ఆ తర్వాత వాటిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కుటుంబానికి విషయం చెప్పిన బాధితురాలు
నిందితుడి అసలు వివరాలు తెలిసిన తర్వాత బాధితురాలు అతనికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించిందని, అయితే అతను కలవాలని ఒత్తిడి చేశాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సుమారు వారం రోజుల క్రితం జరిగిన విషయాలను బాధితురాలు తన కుటుంబ సభ్యులకు వివరించినట్లు సమాచారం. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులు భరోసా ఇచ్చినప్పటికీ, ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఆగస్టు 2న బాధితురాలు ఇంట్లో ఉన్న పురుగుమందు సేవించింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆగస్టు 3 ఉదయం ఆమె మృతి చెందింది.
నిందితుడి కోసం పోలీసుల గాలింపు
మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ, నిందితుడి కోసం ప్రత్యేక బృందాన్ని ఫిరోజాబాద్‌కు పంపినట్లు తెలిపారు. త్వరలోనే అతన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడిపై వచ్చిన ఆరోపణలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది.




