
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో 123 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్న భారీ కార్తికేయ స్వామి విగ్రహం భక్తులను, సందర్శకులను ఆకట్టుకుంటోంది.
మంగళగిరి నుంచి నవులూరు మీదుగా రాజధాని ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఈ భారీ విగ్రహ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే విగ్రహ రూపురేఖలు స్పష్టంగా కనిపిస్తుండటంతో పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ప్రముఖ ఆలయాలకు సమీపంలో నిర్మాణం
నవులూరులో నిర్మిస్తున్న ఈ కార్తికేయ విగ్రహం ప్రసిద్ధ మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది.
స్థానికులు, భక్తులు, దాతల సహకారంతో సుమారు పది సెంట్ల స్థలంలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. గుంటూరుకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారి అందించిన ఆర్థిక సహకారంతో నిర్మాణ పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
విగ్రహంతో పాటు ఆలయ నిర్మాణం
కేవలం విగ్రహ నిర్మాణానికే పరిమితం కాకుండా, దాని చుట్టూ నాలుగు అంతస్తుల ప్రాకార నిర్మాణాన్ని కూడా చేపట్టారు. విగ్రహం ముందు భాగంలో అందమైన ఆలయ నిర్మాణ పనులు సైతం కొనసాగుతున్నాయి. త్వరలోనే విగ్రహంతో పాటు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తుల దర్శనార్థం అందుబాటులోకి తీసుకురావాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
రాజధాని మార్గానికి సమీపంలో ప్రత్యేక ఆకర్షణ
ఈ కార్తికేయ స్వామి విగ్రహానికి సమీపంగానే రాజధాని అమరావతిని జాతీయ రహదారితో అనుసంధానించే ఈ-13 ప్రధాన రహదారి మార్గం ఉంది. దీంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని భావిస్తున్నారు.



