News

తమిళనాడులో 1,200 ఏళ్ల నాటి దేవత విగ్రహాలు- పల్లవుల కాలం నాటివిగా గుర్తింపు

35views

తమిళనాడులో సుమారు 1200 ఏళ్ల నాటి రెండు అరుదైన విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి. విల్లుపురం జిల్లాలో నిర్వహించిన పరిశోధనల్లో బయటపడిన వాటిల్లో ఒకటి గ్రామదేవత రూపంలోని శిల్పం కాగా, మరొకటి యుద్ధదేవతగా భావించే కొట్రవై శిల్పం. శిల్పాలు క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందినవిగా ప్రాథమిక పరిశీలనలో తేలినట్లు చరిత్రకారులు తెలిపారు.

విల్లుపురం జిల్లా తిండివనం పరిసర ప్రాంతాల్లో కే. సెంగుట్టువన్ చేపట్టిన ఫీల్డ్‌ సర్వే నిర్వహించారు. కొల్లార్‌, పేళకుప్పం ప్రాంతాల్లో ఈ శిల్పాలు గుర్తించారు. కొల్లార్ గ్రామంలోని చెరువులో సగానికపైగా మట్టిలో కూరుకుపోయిన ఒక శిల్పాన్ని స్థానికులు చాలా కాలంగా దుర్గమ్మగా భావించి పూజిస్తున్నారు. గ్రామస్థులు ఇటీవల ఆ శిల్పాన్ని పూర్తిగా బయటకు తీశారు. దానిని పరిశీలించిన సెంగుట్టువన్, అది సాధారణ దుర్గ విగ్రహం కాదని, పల్లవుల కాలానికి చెందిన గ్రామదేవత శిల్పం అని గుర్తించినట్లు తెలిపారు.

సుమారు ఐదు అడుగుల ఎత్తైన రాతి పలకపై చెక్కిన ఈ శిల్పంలో దేవతను అత్యంత శిల్పకళా నైపుణ్యంతో రూపొందించారు. తలపై అందమైన కిరీటం, పెద్ద చెవిపొగులు, మెడలో హారం, నడుము వద్ద వస్త్రధారణ వంటి అలంకరణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవత రెండు కాళ్లను కిందకు వేలాడదీసి ఉండగా, చేతుల వేళ్లను కూడా ఎంతో సహజంగా తీర్చిదిద్దారు. ఆమె రెండు కాళ్లను కిందకు వేలాడదీసి ఆసనంపై కూర్చున్న భంగిమలో ఉంటుంది. కుడివైపు కుమారుడు మాంతన్, ఎడమవైపు కుమార్తె మంతి కూర్చున్నట్లు చిత్రీకరించారు. శిల్పం కుడి పైభాగంలో దేవి ఆయుధమైన చీపురు ఆకృతి కూడా కనిపించింది. సాధారణంగా ఇలాంటి గ్రామదేవత శిల్పాల్లో కనిపించే కాకి జెండా ఈ విగ్రహంలో లేకపోవడం ప్రత్యేకతగా భావిస్తున్నారు. ఈ లక్షణాలన్నీ పల్లవుల కాలం నాటి శిల్పకళను ప్రతిబింబిస్తున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.

ఎనిమిది చేతులతో కొట్రవై శిల్పం
అదే సమయంలో తిండివనం సమీపంలోని పేళకుప్పం ప్రాంతంలో సిప్​కాట్ కాంప్లెక్స్ సమీపంలోని ఒక తోటలో కొట్రవై దేవత శిల్పం కూడా గుర్తించారు. తమిళ సంస్కృతిలో యుద్ధవిజయానికి ప్రతీకగా భావించే కొట్రవై దేవతను ఈ శిల్పంలో ఎనిమిది చేతులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. దున్నపోతు తలపై నిలబడి ఉన్నట్లు చెక్కారు. ముందుభాగంలోని రెండు చేతులను తొడలపై ఉంచిన భంగిమ ఈ శిల్పానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దేవత వాహనంగా భావించే జింకను కుడి పాదం సమీపంలో పొందుపరిచారు. సాధారణ కొట్రవై శిల్పాల్లో కనిపించే వీరబలి, భక్తుల ప్రతిరూపాలు ఇందులో లేకోవడం విశేషమని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఈ శిల్పాన్ని స్థానికులు వనదుర్గగా ఆరాధిస్తున్నారు.

పల్లవుల కళా వైభవానికి నిదర్శనం
ఈ రెండు శిల్పాల రూపకల్పన, అలంకరణ, భంగిమలు, శిల్ప శైలి ఆధారంగా ఇవి క్రీ.శ. 8వ శతాబ్దంలో పల్లవుల పాలనా కాలంలో చెందినవేనని చరిత్రకారుడు కే. సెంగుట్టువన్ పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామదేవత, కొట్రవై ఆరాధన ఆనాటి సమాజంలో ఎంత ప్రాధాన్యం కలిగి ఉండేదో ఈ శిల్పాలు తెలియజేస్తున్నాయని ఆయన వివరించారు. తిండివనం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పలు చారిత్రక ఆనవాళ్లు లభించిన నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ రెండు శిల్పాలు ఆ ప్రాంత చరిత్రను మరింత బలపరుస్తున్నాయని చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. పల్లవుల కాలంలో గ్రామదేవతల ఆరాధన, శిల్పకళా సంప్రదాయం, స్థానిక సాంస్కృతిక విశ్వాసాలకు ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం స్థానికుల ఆరాధనలో కొనసాగుతున్న ఈ శిల్పాలు, పల్లవుల కళా వైభవానికి మాత్రమే కాకుండా తిండివనం ప్రాంత చారిత్రక ప్రాధాన్యానికి కూడా నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.