News

నల్లమలలో వెలుగుచూస్తున్న చారిత్రక ఆనవాళ్లు..

7views

మార్కాపురం: దట్టమైన నల్లమల అడవులు ప్రకృతి అందాలకు మాత్రమే కాదు, శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న వారసత్వానికి కూడా నిలయంగా నిలుస్తున్నాయి. ఇటీవల పురావస్తు నిపుణులు నిర్వహించిన సర్వేలో పురాతన శాసనాలు, దేవాలయాల శిథిలాలు, శ్రీశైలం వెళ్లే కాలిబాటలు, పాత వాణిజ్య మార్గాలు, యాత్రికుల విశ్రాంతి కేంద్రాల ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. ఈ చారిత్రక సంపదను నల్లమల సహజ సౌందర్యంతో మేళవించి ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.

చారిత్రక కట్టడాల పరిరక్షణ, వాటి చరిత్రను ప్రజలకు చేరవేయడం, ట్రెక్కింగ్ మార్గాల అభివృద్ధి, చెంచు గిరిజనుల సంస్కృతిని పర్యాటకులకు పరిచయం చేయడం ద్వారా నల్లమలను దేశంలోనే ప్రత్యేక ఎకో టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు.

సర్వేలో 25 శాసనాల గుర్తింపు
నల్లమల అటవీ ప్రాంతంలో పురాతన ఆనవాళ్ల వెలికితీత కోసం పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం ప్రభుత్వ అనుమతితో జూన్ 11 నుంచి 13 వరకు సర్వే నిర్వహించింది. అభయారణ్యంలోని వన్యప్రాణులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలతో చేపట్టిన ఈ పరిశోధనలో సుమారు 20 నుంచి 25 శాసనాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

పాలుట్లలో లభించిన శాసనాలు
పాలుట్ల గ్రామం సమీపంలో మూడు ముఖ్యమైన తెలుగు శాసనాలు లభించాయి. ఇవి క్రీ.శ. 15–16వ శతాబ్దాలకు చెందినవిగా నిపుణులు గుర్తించారు.మొదటి శాసనంలో గురజాలకు చెందిన లింగబట్టు కుమారుడు జంగం పోలేరమ్మకు ఉయ్యాల కంబాలు నిర్మించినట్లు పేర్కొన్నారు. రెండో శాసనంలో బేపిక అనే వీరుడు పులితో పోరాడుతున్న దృశ్యం చెక్కబడి ఉంది. మూడో శాసనం ప్రకారం శ్రీకరుడు తన మామిడి తోటలోని కనుమదేవుని ఆలయానికి ఆరు పుట్ల భూమిని (సుమారు ఆరు ఎకరాలు) దానం చేసినట్లు తెలుస్తోంది.

విజయనగర కాలం నాటి నంది స్తంభ శాసనం
పాలుట్ల సమీపంలోని పోలేరమ్మ ఆలయం వద్ద లభించిన నంది స్తంభ శాసనం అత్యంత ప్రాధాన్యమైనదిగా పురావస్తు నిపుణులు పేర్కొన్నారు. ఇది క్రీ.శ. 1358లో రెండో దేవరాయల పాలన కాలానికి చెందినదిగా గుర్తించారు.

శాసనంలోని వివరాల ప్రకారం, శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయానికి చెందిన భిక్షవృత్తి అయ్యగారికి ఉదయగిరి రాజ్యంలోని రెండు గ్రామాలతో పాటు పాలుట్ల గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ దానంలో మెట్ట భూములపై పన్ను, అటవీ ఉత్పత్తుల ఆదాయం, నువ్వులు, చింతపండు వంటి వస్తువుల కొనుగోలు, అమ్మకాలపై పన్ను వసూలు చేసే హక్కులు కూడా ఉన్నట్లు శాసనం వివరిస్తోంది. ఈ ఆధారాలు విజయనగర సామ్రాజ్య కాలంలో పాలుట్ల ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్నట్లు సూచిస్తున్నాయి.

మీథోటలో పురాతన శివాలయం
నల్లమలలోని మీథోట గ్రామం వెలుపల మైసమ్మగుట్ట సమీపంలో మరో శాసనం లభించింది. శక 1360 (క్రీ.శ. 1438 అక్టోబర్ 5) నాటిదిగా గుర్తించిన ఈ శాసనం ప్రకారం, శ్రీపర్వతంలోని మల్లికార్జునస్వామి ఆలయ పీఠాధిపతి భిక్షవృత్తి అయ్యగారు మీథోట గ్రామంలోని భూములను కండేశ్వర ఆలయంలో నిత్య పూజలు, నైవేద్యాలు, దీపారాధన కోసం దానం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో పురాతన శివాలయ శిథిలాలను కూడా నిపుణులు గుర్తించారు.

యాత్రికుల విశ్రాంతి కేంద్రం ‘మసమ్మ సరాయి’
శ్రీశైలం వెళ్లే యాత్రికులు అడవి మార్గంలో విశ్రాంతి తీసుకునే ప్రాంతాన్ని ‘మసమ్మ సరాయి’గా పిలిచేవారని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ ఆలయం శిథిలావస్థలో ఉండగా, శివలింగం, నంది విగ్రహం, ఇతర రాతి శిల్పాలు చెల్లాచెదురుగా కనిపిస్తున్నాయి. ఆలయం సమీపంలోని నీటిగుంట ఒకప్పుడు యాత్రికులు, పూజారుల అవసరాలకు ఉపయోగపడినట్లు భావిస్తున్నారు.

ఎకో టూరిజానికి కొత్త అవకాశాలు
ఇటీవల ఏర్పడిన మార్కాపురం జిల్లా అభివృద్ధికి నల్లమలలో వెలుగుచూస్తున్న ఈ చారిత్రక సంపద దోహదపడే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. సహజ సిద్ధమైన అటవీ అందాలతో పాటు చారిత్రక వారసత్వాన్ని అనుసంధానించి ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకులను ఆకర్షించడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ మునిరత్నంరెడ్డి మాట్లాడుతూ, నల్లమలలో గుర్తించిన చారిత్రక ఆనవాళ్లు అత్యంత విలువైనవని, వాటిని ప్రజలకు పరిచయం చేయడంలో ఎకో టూరిజం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆ దిశగా చర్యలు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.