News

మత విద్వేష వ్యాఖ్యల వీడియో వైరల్ దంపతుల అరెస్ట్!

28views
ఆవు మాంసానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఉత్తర ప్రదేశ్ పోలీసులు దంపతులను అరెస్ట్ చేశారు. నిందితులను జావేద్, అతని భార్య వషీమాగా గుర్తించారు.

ఈ వీడియో వెలుగులోకి రాగానే బాగ్పత్ పోలీసులు తక్షణమే విచారణ చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించి వషీమాను మహిళా పోలీసుల సహాయంతో అదుపులోకి తీసుకున్నారు.

అయితే, పోలీసులను చూసి తప్పించుకునే క్రమంలో జావేద్ కాల్పులు జరిపాడు. పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురుకాల్పుల్లో (ఎన్‌కౌంటర్) జావేద్ కాలికి గాయమైంది. వెంటనే అతడిని పట్టుకున్న పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఉత్తర ప్రదేశ్ పశుసంరక్షణ చట్టం, అలాగే మతపరమైన భావాలను దెబ్బతీయడం, విద్వేషాలను రెచ్చగొట్టడం, అక్రమ ఆయుధాల వినియోగం వంటి పలు తీవ్రమైన సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేశారు. మత సామరస్యానికి భంగం కలిగించేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం నిందితులిద్దరినీ న్యాయస్థానం రిమాండ్‌కు తరలించింది.