News

కలెక్టర్ కార్యాలయం ఆవరణలో అక్రమ మసీదు, కూల్చివేయాలని కోర్టు ఆదేశం

36views

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సహరన్‌పూర్‌లో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో చట్టవిరుద్ధంగా ఉన్న మసీదును కూల్చివేయాలని సహరన్‌పూర్ సిటీ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన దోషులకు న్యాయమూర్తి కులదీప్‌ సింగ్ రూ. 6.41 కోట్ల జరిమానా విధించారు.

కేసు వివరాలను పరిశీలిస్తే, సహరన్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ఆవరణలో 70 ఏళ్ళ నుంచీ అక్రమంగా మసీదు నిర్వహిస్తున్నారు. స్థానిక బజరంగ్‌దళ్ సమన్వయకర్త వికాస్ త్యాగి ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. వికాస్ త్యాగి తన ఫిర్యాదులో, జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) కార్యాలయ సముదాయం ఆవరణలో మసీదును అక్రమంగా కట్టారని పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం అనేది ప్రభుత్వ కార్యకలాపాలు జరిగే సున్నితమైన ప్రదేశమని వివరించారు. అలాంటి ప్రదేశంలో మసీదు నిర్మించి, అక్కడ మతపరమైన, వాణిజ్యపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మసీదు భవనంలో నుంచి ఒక పోస్టాఫీసు నిర్వహిస్తున్నారని, మసీదులోని పలు గదులను వాణిజ్య కార్యకలాపాల కోసం అద్దెకు ఇచ్చారనీ వివరించారు. మసీదు కమిటీ కిరాయిదారుల నుంచి నెలనెలా అద్దెలు వసూలు చేస్తోందని వెల్లడించారు.

వికాస్ త్యాగి ఫిర్యాదుతో స్థానిక అధికారులు విచారణ ప్రారంభించారు. అందులో కనుగొన్న వాస్తవాల ఆధారంగా సహరన్‌పూర్ సిటీ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదు చేసారు. సుదీర్ఘకాలం విచారణ జరిగింది. చివరికి కోర్టు ఆ మసీదు అక్రమ నిర్మాణమేనని నిర్ధారించింది. దాన్ని కూల్చివేయాలని ఆదేశించింది. కలెక్టరేట్ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్న ప్రభుత్వ భూమిలో 315 చదరపు మీటర్ల భూమిని ఆక్రమించి మసీదు నిర్మాణం జరిగిందని స్పష్టం చేసింది.

మసీదు చట్టబద్ధతను నిరూపించగల ఎలాంటి ఆధారాన్ని దాని ప్రతినిధులు కోర్టు ముందు చూపించలేకపోయారు. అందుబాటులో ఉన్న రికార్డులు, రెవెన్యూ రికార్డులు, ఇతర సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం, ఆ కట్టడం అక్రమంగా నిర్మించినదేనని నిర్ధారణకు వచ్చింది. దాన్ని ఖాళీ చేయడంతో పాటు కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించినవారు 30 రోజుల్లో ఖాళీ చేయాలని, లేనిపక్షంలో అధికారులు బలప్రయోగం చేసి అయినా సరే వారిని ఖాళీ చేయించాలనీ ఆదేశించింది.