
విజయవాడ: ప్రాచీన ఆయుష్ వైద్య విధానాలకు పునరుజ్జీవం కల్పించడంతో పాటు ఔషధ మొక్కల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్‌ను ఆయుష్ వైద్య హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఔషధ మొక్కల సాగు ద్వారా రైతులకు కొత్త ఆదాయ మార్గాలు కల్పించడంతో పాటు భారతీయ వైద్య సంప్రదాయాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో బుధవారం “ఔషధ మొక్కల స్థిరమైన సాగు, ఆర్థిక వృద్ధి, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు” అంశంపై నిర్వహించిన రాష్ట్ర సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, నేచురోపతి, హోమియోపతి వంటి ఆయుష్ వైద్య విధానాల అభివృద్ధికి రూ.414 కోట్లతో పలు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఔషధ మొక్కలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్
అశ్వగంధ, మునగాకు, ఉసిరి, అలోవెరా వంటి ఔషధ మొక్కలకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లోనూ మంచి డిమాండ్ ఉందని మంత్రి తెలిపారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు విలువ ఆధారిత ఔషధ మొక్కల సాగు వైపు దృష్టి సారిస్తే అధిక ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.
వ్యవసాయ, వైద్య శాఖలు సమన్వయంతో పనిచేసి ఔషధ మొక్కల సాగును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటాయని చెప్పారు. రైతులకు కేవలం అవగాహన కల్పించడం మాత్రమే కాకుండా, మార్కెటింగ్ సౌకర్యాలు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు.
ఆయుష్ మౌలిక వసతుల అభివృద్ధికి భారీ ప్రణాళికలు
ప్రస్తుతం ప్రభుత్వం ఆయుష్ రంగంలో భారీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి తెలిపారు. రూ.280 కోట్లతో నాలుగు కొత్త ఆయుష్ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ధర్మవరం, పిఠాపురంలో ఆయుర్వేద వైద్య కళాశాలలు, ప్రొద్దుటూరులో యునాని కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఒక్కో కళాశాలకు రూ.70 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.
విశాఖపట్నంలో రూ.280 కోట్లతో నిర్మిస్తున్న నేచురోపతి వైద్య కళాశాల పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. తిరుపతి, గిద్దలూరు, నందిగామ, తెనాలి, టెక్కలి, రంపచోడవరంలలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఒక్కో ఆస్పత్రికి రూ.90 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా రూ.44 కోట్లతో చేపట్టిన 1,500కు పైగా ఆయుష్ డిస్పెన్సరీల ఆధునికీకరణ పనులు చివరి దశలో ఉన్నాయని వెల్లడించారు.
శాస్త్రీయ ప్రమాణాలతోనే ఆయుష్‌కు మరింత గుర్తింపు
వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ మాట్లాడుతూ, భారతీయ వైద్య విధానాలు ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే శాస్త్రీయ ప్రమాణాలు, నాణ్యతా పరీక్షలు, సరైన ధ్రువీకరణ అవసరమని అన్నారు.
ఔషధ మొక్కల నుంచి తయారయ్యే ఉత్పత్తులపై వినియోగ విధానం, మోతాదు, జాగ్రత్తలు స్పష్టంగా ఉండేలా లేబులింగ్ విధానాలను పాటించాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 30 వేల నుంచి 35 వేల ఎకరాల్లో మాత్రమే ఔషధ మొక్కల సాగు జరుగుతోందని, దీనిని లక్షల ఎకరాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
రైతులకు మార్కెటింగ్ సదుపాయాలు, ప్రయోగశాలలు, శిక్షణ అందుబాటులోకి తీసుకొస్తే ఔషధ మొక్కల సాగు మరింత ప్రోత్సాహం పొందుతుందని చెప్పారు.
సంప్రదాయ వైద్యం.. ఆధునిక పరిశోధనల సమన్వయం
కేవలం వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స అందించే విధానం నుంచి, వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించే ‘ప్రెడిక్టివ్–ప్రివెంటివ్–వెల్‌నెస్ సెంట్రిక్’ ఆరోగ్య విధానం వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
ఆయుష్ రంగంలో మౌలిక వసతుల అభివృద్ధి, ఔషధ మొక్కల సాగు విస్తరణ, శాస్త్రీయ పరిశోధనలు కలిసొస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కీలక ఆయుష్ కేంద్రంగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.




