
ముజఫరాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ప్రజా అసంతృప్తి మరోసారి ఉధృతమైంది. ప్రభుత్వం తమ 38 డిమాండ్ల చార్టర్ అమలుకు ఇచ్చిన గడువు ముగియడంతో ది జమ్ము కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో రావల్‌కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు వేలాది మంది ప్రజలు భారీ లాంగ్ మార్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఏఏసీ నాయకులు మాట్లాడుతూ, పీవోకేలో పాకిస్థాన్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను విస్మరించి నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం తీవ్ర ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్న జేఏఏసీ, నిత్యావసర వస్తువులపై సబ్సిడీలు కల్పించడం, విద్యుత్ ఛార్జీలను తగ్గించడం, స్థానిక జలవిద్యుత్ ప్రాజెక్టులకు తగిన గుర్తింపు, ప్రజా సంక్షేమ చర్యలు సహా మొత్తం 38 డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏఏసీ హెచ్చరించింది. దీంతో పీవోకేలో రాజకీయ, సామాజిక పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.



