
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని పెద్దబ్రాహ్మణవీధిలో వెలసిన శ్రీ జగన్నాథస్వామి ఆలయంలో నేత్రోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం 14 రోజుల పాటు అనవాసర (ఏకాంత) సేవలో ఉన్న శ్రీ జగన్నాథస్వామి భక్తులకు నేత్ర దర్శనం కల్పించడంతో ఆలయం భక్తజన సందోహంతో నిండిపోయింది.
ఈ సందర్భంగా శ్రీ జగన్నాథస్వామి, శ్రీ లక్ష్మీదేవి కల్యాణ మహోత్సవాన్ని వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ ఘనంగా నిర్వహించారు. దేవదాయ శాఖ ఈవో టి. మనస్విని ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దివ్య దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను భక్తిశ్రద్ధలతో స్వీకరించారు.
రథయాత్ర ఏర్పాట్లపై అధికారుల సమీక్ష
ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న శ్రీ జగన్నాథస్వామి వార్షిక రథయాత్రను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు మంగళవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
దేవదాయ శాఖ ఈవో టి. మనస్విని, సీఐ ఎ. విజయ్‌కుమార్, ఎస్‌ఐ రాము, ఆలయ సిబ్బంది, స్థానిక ప్రముఖులు సమావేశంలో పాల్గొన్నారు. ఆలయం నుంచి శ్రీ జగన్నాథస్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి ఉత్సవ విగ్రహాలను రథంపై గుండిచా మందిరానికి తీసుకెళ్లే ఏర్పాట్లు, రథాన్ని భక్తులు లాగే సమయంలో పాటించాల్సిన భద్రతా చర్యలు, భక్తులకు అవసరమైన సౌకర్యాలపై అధికారులు విస్తృతంగా చర్చించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులు సంబంధిత శాఖలకు సూచనలు జారీ చేశారు.




