
ప్రపంచమంతటా సృష్టి గాథలు ఒక్కలాగానే ఉంటాయి. ఆదిలో అంతా జలమయమే. ఎందుకని? బ్రహ్మాండమంత కుండతో ఎత్తిపోసినట్టు నిరంతరం ధారాపాతాలు. ఆ తర్వాత ఎప్పుడో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు పుట్టాయి. భూమిపైకి తేలింది. జీవి పుట్టింది. మనిషి సహా రకరకాల రూపాల్లోకి పరిణామం చెందింది. వర్షం పడుతూనే ఉంది కానీ, నిర్విరామం నుండి విరామానికి మారింది.
ప్రపంచ సాహిత్యంలో వర్షానుభవాన్ని చిత్రించని కథ, కావ్యం, నవలా దాదాపు ఉండవు. తెలుగులో పాలగుమ్మి పద్మరాజు ‘‘గాలివాన’’ (ప్రపంచ కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ). కథలో కథానాయకుడు రావుగారు. చీదరించుకున్న బిచ్చగత్తెను ఒకచోటకు చేర్చి వారి మధ్య కథ•ను నడిపాడు. గాలివానలో బిచ్చగత్తె ఆలింగనం వెచ్చదనం అందించి, అతనిలోని అరవై ఏళ్ల అజ్ఞానాంధకారాలను ఒక్క గాలివాన కూకటివేళ్లతో కూల్చి అతని బతుకు పలకను స్వచ్ఛ జలంతో ప్రక్షాళించింది. మానవత్వపు కొత్త ఓనమాలు దిద్దించింది.
దాశరథి• రంగాచార్యుల ‘‘తామరపూలు’’లో చిట్టిపంతులకు తామరలే లోకం. రుతుభ్రమణం గురించిన జ్ఞానంలేని ఆ అబ్బాయి ఎండాకాలంలో అవి కనిపించక కలవర పడిపోయాడు. వానలు పడి తిరిగి కనిపించే వరకూ వాటికోసం నిరీక్షణ. మహేంద్ర రచించిన ‘‘హోగినేకల్’’. ఓ కుటుంబం కావేరి జలపాతాన్ని చూడటానికి చిన్నపాపను తీసుకుని, వానను వెంటబెట్టుకొని వెళ్లింది. కావేరి వరదెత్తడంతో అందులో పాప కొట్టుకుపోయింది. జీర్ణించుకోవడం కష్టమే కానీ ఇదే ప్రకృతి, ఇదే దాని ధర్మం. ఇది మంచి, ఇది చెడు అని కాదు…దాని దృష్టిలో అన్నీ సమానమే. సృష్టిని అంగీకరించే మనిషి లయను కూడా అంగీకరించాల్సిందే. కుప్పిలి పద్మ ‘గోడకథ’’, ‘తూర్పు సముద్ర కెరటాల నురగల మీద వాన, యారాడ కొండ గరికల మీద వాన, రుషికొండ ఎగుడు దిగుడుల మీద వాన’ అని మొదలవుతుంది. స్వతంత్ర భావాలు కల అబ్బాయిని ఓ అమ్మాయి ప్రేమిస్తుంది, అనుకోకుండా ఓ వర్షపురాత్రి అబ్బాయి గదిలో గడపాల్సి వస్తుంది. అతనిలోని మగాడు నిద్రలేచి హద్దుమీరబోతే ఆ అమ్మాయి గట్టిగా బుద్ధి చెబుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం. ఇవన్నీ ఆధునికం, కాని దోనయామాత్యుడు 11వ శతాబ్దంలోనే ‘‘సస్యానందం’’ అనే వర్షశాస్త్రాన్ని రాశాడు. అది భారతీయ సాహిత్యంలోనే తొలి శాస్త్రీయ గ్రంథ•ం.
ఏరువాక కర్షకులకు ముఖ్యమైనది. ఏరు అంటే నాగలి, ‘ఏరువాక సాగుట’ అంటే దున్నడం ప్రారంభించడం, జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఎద్దులను కడిగి రంగులతో అలంకరించి, నాగలికి ఎర్రమన్ను సున్నం పట్టెలు వేసి, నూనె రంగులు పూసి చీరలు కట్టించి సొమ్ములు పెట్టి సాయంత్రం మంగళ వాయిద్యము లతో నాగళ్లను, గొర్రులను భుజాన వేసుకొని, ఎద్దులతో ఊరేగుతూ పొలాలకు వెళ్లి దుక్కి ప్రారంభి స్తారు. ఆనాడు భక్ష్యభోజ్యాలతో వాటికి నైవేద్యమి స్తారు. ఇది ఏరువాక పున్నమి పండుగ. ఇది వైదికోత్సవమే.
మనం నడిచే నేల ఒక్కో చోట ఒక్కో రంగులో ఉంటుంది. ప్రకృతిలో ఎన్నో వింతలు దానిలో ఇదొకటి. మట్టిలో రకరకాల రాళ్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవే మట్టికి రంగులనిస్తాయి. నల్లమట్టికి కారణం ఆ నేలలో ఇనుము, అల్యూమినియం, టైటానియం వంటి ఖనిజాలు ఉండడమే. ఈ మట్టి చాలా సార•వంతమైంది. ఇనుము ఎక్కువగా ఉండటంవల్ల ఆ మట్టి ఎర్రగా మారుతుంది. ఈ నేలలు చాలా ప్రాంతాలలో కన్పిస్తాయి. విశాఖ జిల్లా భీమిలి ఎర్రమట్టిదిబ్బలు ఒక ప్రత్యేక ఆకర్షణ (ఇప్పుడు లేవు). గోధుమ రంగు మట్టికి కారణం రకరకాల ఖనిజాలు, మొక్కలు కుళ్లిపోయి మట్టికి గోధుమరంగు నిస్తాయి.
మట్టి ఒక్కో రంగులో ఉంటుంది. ఒక్కొక్క రకం మట్టిలో ఒక్కొక్క రకం మొక్క పెరుగుతుంది. అయితే వీటికి ప్రధానంగా కావల్సింది వర్షం (నీరు). అయితే వర్షం ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో ఎలా చెప్పగలం? విధులను శాసించటం, విషయాలను ప్రకటించడం వంటి పనులు చేసే వాటిని శాస్త్రాలు అంటారు. శాస్త్రం మనకున్న అన్ని సందేహాలను తీరుస్తుంది. ప్రపంచాన్ని చూపించే కన్నులాంటిది శాస్త్రం. శాస్త్రజ్ఞానం లేనివాడే గుడ్డివాడని హితోపదేశకర్త నిర్వచించాడు.
వేద భగవానునికి ఛందస్సు కాళ్లు అని, కల్పసూత్రాలు చేతులని, జ్యోతిష్యం కళ్లని, నిరుక్తం చెవులని, శిక్ష ముక్కు అని, వ్యాకరణం నోరు అని పాణిని పండితుడు పేర్కొన్నాడు. గర్గ మహర్షి, పరాశరుడు, జైమిని, భృగువు, వశిష్ఠుడు, మొదలైన మహర్షులు జ్యోతిష్యంపై అధ్యయనం చేశారు, గర్గ సంహిత, పరాశర సంహిత, బృహత్పరాశరహోర, భృగుసూత్రాలు, వృద్ధ వాసిష్టము (జ్యోతిర్వాసిష్టము) మొదలైన ప్రామాణిక గ్రంథాలూ రాశారు. తరువాత కాలంలో ఆర్యభట్టు, వరాహమిహిరుడు, బ్రహ్మ గుప్తుడు, భాస్కరాచార్యులు మొదలైనవారు జ్యోతిష్య శాస్త్రాభివృద్ధికి కృషి చేశారు. కాళిదాసు పేరుతో జ్యోతిర్విధాభరణము, కాలామృతము అనే గ్రంథాలు వెలిశాయి. వరాహమిహిరుని ‘బృహత్ సంహిత’లోని లఘజాతకాన్ని అల్‌బెరూనీ అనే ఖగోళ శాస్త్రవేత్త పర్షియన్ భాషలోనికి అనువదించాడు.
గ్రహాలు, నక్షత్రాలు, భూభ్రమణము మొదలైనవాటి ఆధారంగా ముహూర్తాలనే కాక వాన రాకపోకలను కూడా మన ప్రాచీన రుషులు పరిశోధించి తమ గ్రంథాలలో పొందుపరిచారు. వ్యవసాయశాస్త్రంపై కూడా సంస్కృతంలో మంచి పుస్తకాలు వచ్చాయి. పరాశరమహర్షి ‘‘కృషి సంగ్రహః’’ అన్నది ప్రసిద్ధ వ్యవసాయ గ్రంథం. దీనికే ‘కృషి పరాశర’ అనే పేరు కూడా వుంది. పరాశరుడు క్రీ।।పూ।। 1391 వాడని ప్రముఖ పాశ్చాత్య పండితుడు బిల్‌పోర్ట్ చెప్పగా, పుకనన్ అనే మరో పండితుడు క్రీ।।పూ।।1300 నాటి వాడని నిర్ణ యించారు. ఎద్దులు, వాటి లక్షణాలు, గోమయాన్ని ఎరువుగా మార్చడం, నాగలి సామాగ్రి, ఏరుకట్ట సామాను, దుక్కి దున్నే పద్ధతి, విత్తనాలు చల్లడం, ఎరువులు వేయడం, పైరు కోయడం, ధాన్యం నూర్చి తూర్పారబట్టి కైలు చేయడం, పాతరలలో, గాదెలలో పురుగు పట్టకుండా ధాన్యం నిలవ చేయడం, పంట తెగుళ్ల నివారణ మొదలైన విషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. నారద మహర్షి రాసిన ‘మేఘమాల’ గ్రంథం గ్రహగతులను అధ్యయనం చేసి వర్షాగమనాలను వివరించింది. పాదప వివక్ష, వృక్షదోహద, వృక్షా యుర్వేద-అనేవి మరికొన్ని చెట్లకు సంబంధించిన శాస్త్ర గ్రంథాలు.
‘అనాదిగా భారతీయుల ప్రధానవృత్తి వ్యవసాయం. వానలు పడితే పంటలు బాగా పండుతాయి. పంటలు బాగా పండితే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. ఆ వానల రాకపోకలు తెలియడం అందరికీ అవసరం అంటాడు’ దోనయామాత్యుడు. ప్రజలలో వర్ష విజ్ఞానాన్ని కలిగించడానికి ఆయన ‘సస్యానందం’’ రాశాడు.
దోనయ్య కాలం నాటికి గర్గసంహిత, హరిభట్టు మతము, ధన్వుని మతము, శ్రీపతి మతము, మిహరసంహిత, మేఘమాలిక, నారాయణభట్టు మతము మొదలైన జ్యోతిష్య గ్రంథాలు దక్షిణ భారతంలో ప్రాచుర్యంలో ఉండేవి. వీటిని ఆధారంగా చేసుకొని రెట్ట పండితుడు (క్రీ।।శ।। 1300) కన్నడంలో ‘రెట్ట మతశాస్త్రం’ రాశాడు. అందులోని కొన్ని మూఢ నమ్మకాలను విడిచి, దోనయ్య గర్గ, మిహిర, లల్ల సంహితల ఆధారంగా శాస్త్రీయంగా ‘సస్యానందం’ రాశాడు. ఆ గ్రంథం నాలుగు ప్రకరణలతో కూడి ఉంది. వాటిలో మేఘ నిర్ణయము, ధాతు ప్రకారము, గర్భకాలము, ద్రోణ ప్రకారము, ద్రోణ ప్రమాణము, చంద్ర యోగము, ఫలపక్షి యోగము, ఆషాఢ• లక్షణము, వాయు ప్రకారము శ్రావణమాస గర్భము, గ్రహణోత్పాతము, మేఘ లక్షణము, పరివేష లక్షణము, శుక్రోదయాస్త లక్షణము, గ్రహచార లక్షణము, బుధోదయ లక్షణము, గ్రహయుద్ధము, గ్రహాదికార దేశములు, వర్షప్రశ్నోత్తరము, గురు సంచారము వివరంగా ఉన్నాయి. ఈ గ్రంథంపై ఆచార్య నిడదవోలు వెంకట్రావు, ‘భారతి’ మాస పత్రిక(1946 జూన్)లో ‘సస్యానందము-దోనయామాత్యుడు’ అనే వ్యాసం రాశారు. చాగంటి శేషయ్య దీన్ని గురించి ‘ఆంధ్రకవి తరంగణి’లో వివరించారు. ఆరుద్ర ‘సమగ్రాంధ్ర సాహిత్యం’ కొంత విపులంగా రాశారు.
ఆధునిక శాస్త్రవేత్తలు వర్షపాతాన్ని మిల్లీమీటర్లు, సెంటీమీటర్ల ప్రమాణంలో కొలుస్తున్నారు. ప్రాచీన శాస్త్రవేత్తలు ద్రోణ ప్రమాణాలలో కొలిచారు. దానిని కవి ‘కొలువగ నరువది మూడం’ (2-31) పద్యంలో (63 అంగుళాల ముఖవృత్తం గల కలశాన్ని తీసుకుని, దానిని ఆరుబయట వర్షంలో ఉంచాలి. వర్షం వెలిశాక అందులో నీరు 4 తూములుంటే ఒక ద్రోణం వర్షం కురిసిందని, రెండు తూములుంటే అరద్రోణం వర్షం కురిసిందని అర్థ్ధం)చెప్పాడు. రాత్రి కురిసిన మంచును బట్టి రాబోయే సంవత్సరం వర్షపాతాన్ని ముందుగా అంచనావేసే పద్యం (1-42)ఉంది. ‘పుష్యమాసంలో పున్నమినాడు పలిమెడు దూదిని నాగలికి తగిలించి ఆరు బయట పెడతారు. దూదికి ఆకాశం మధ్య ఏ అడ్డం ఉండరాదు. మరునాడు ఉదయం దాకా ఆ దూది అలాగే ఉండాలి. పొద్దున్నే ఆ దూదిని పిండినప్పుడు అందులో నుంచి నీరు ధారగా కారితే వచ్చే సంవత్సరం వానలు పుష్కలంగా ఉంటాయి’ అని ఆ పద్యం భావం. చాగంటి వారు ప్రయోగాత్మకంగా చేసి, దీనిలో నిజముందని ‘ఆంధ్రకవి తరంగిణి’(నాలుగో సంపుటి)లో వివరించారు.
ఆషాఢ శుద్ధ పాడ్యమినాడు సూర్యాస్తమయ కాలంలో పడమటి వైపు మబ్బు పడితే ఆ ఏడాది కరవు ఉండదని బృహస్పతి ఆచార్యుని మతమని కూడా దోనయ్య (2-4)లో చెప్పాడు. కాళిదాసు తన మేఘ సందేశంలో ఇదే విషయాన్ని పేర్కొన్నాడు.
దోనయామాత్యుని కాలం క్రీ.శ. 1360గా ఆచార్య నిడదవోలు వెంకట్రావు, నిర్ధారించారు. కళింగ దేశంలో ఎలమంచిలి సర్వసిద్ధి మండలంలో రాజ్యపాలన చేసిన 3వ ఉపేంద్రునికి సమకాలికునిగా నిర్ధారించారు. దోనయ్య కవి శివభక్తుడు కాబట్టి తన కావ్యాన్ని శ్రీశైల మల్లికార్జునుని సంబోధిస్తూ చెప్పాడు. అయితే అవతారికలోని రెండవ పద్యం ‘సింహ శైలమున తద్దయు వేడ్క..’లో ‘సింహాచల’ ప్రస్తావన ఉంది’. ‘పాపాలు అనే పెద్ద పెద్ద కొరువు లను అణచి, దుఃఖమనే కారుచిచ్చును చల్లార్చి, చక్రపుకాంతులు అనే మెరుపులు మెరుస్తూంటే నిత్యం సింహాచలంలో ప్రేమతో పూజలందుకొంటున్న సుందరేశ్వరుడు అనే మేఘము ఈ భూమికి తన కృపామృతాన్ని వర్షించు గాక’ అని ఈ పద్యం భావం. రాస్తున్నది వానల శాస్త్రం గనుక స్వామిని మబ్బులతో పోల్చాడు.
ఆనాడు మెరక వ్యవసాయం బావులపై ఆధారపడేది. దిగుడు బావుల నుండి నీటిని యాతాముతోనూ, మోటలతోనూ తోడేవారు. సింహాసన ద్వాత్రింశికలో గోపరాజు ‘ఈ యెడ గర్మభూమి’ (6-70) పద్య భావాన్ని బట్టి-ఆ రోజులలో చెంచులు కొండజాతివారు, సంచార జాతులవారు అడవులలోని చెట్లను నరికి పోడు వ్యవసాయం చేసేవారు. భోజరాజీయంలో, మెరకపంటలు, పొట్టి కందులు, అనుములను అనంతుడు ప్రస్తావించాడు. పంటలకు దృష్టి దోషం తగలకుండా దిష్ఠి పిడతలు, ఎద్దుతలలు, ఏనుగు తలలను దంతాలతో పాటు నిలిపే వారని ధూర్జటి కాళహస్తీశ్వర మహత్మ్యం వలన తెలుస్తున్నది.
పొలాలను కొలవడానికి కేసరిపాటి కర్రను వాడేవారని ప్రత్తిపాటి శాసనంలో ఉంది. క్షేత్ర గణితంలో కూడా ఈ కర్ర ప్రస్తావన వుంది. వ్యవసాయదారులు చెల్లించే పన్నును ‘కృషి ప్రపంచం’ (‘గనులు కృషి ప్రపంచ’1-99) అంటారని మడికి సింగన ‘సకలనీతి సమ్మతం’ వలన తెలుస్తున్నది.14వ శతాబ్దంలో రైతులు సేద్యానికి, పశువులకు, బండ్లకు కూడా పన్నులు చెల్లించేవారని తెలుస్తున్నది.
అభివృద్ధి ముసుగులో వాతావరణ కాలుష్యం అధికం కావడంతో ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోయి ధ్రువ ప్రాంతాలలోని మంచుకరిగి, సముద్రమట్టాలు పెరిగి, తీర ప్రాంతాల ఊళ్లు మునిగిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా మనిషికి చీమకుట్టినట్లయినా లేదు. శాస్త్ర పరిజ్ఞానాన్ని విచ్చలవిడిగా ఉపయోగిస్తూ భూమిమీద ఇతర జీవుల ఉనికికి, ప్రకృతి సమతౌల్యానికి ఇబ్బందికరంగా మారాడు. పచ్చని చెట్లను పెంచి ప్రకృతి సమతౌ ల్యాన్ని కాపాడినప్పుడే -రుతుపవనాలు కరి మబ్బులై రైతుకు ఆనంద వర్షాన్ని ప్రసాదిస్తాయి. భూమిని సస్యశ్యామలం చేస్తాయి. అందుకు ప్రతివారు తమ పరిసరాలను అందమైన అరణ్యాలను చేయాలి.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు





