News

ధర్మ పరిరక్షణే దేవాదాయ శాఖ లక్ష్యం : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

39views

దేవాదాయ శాఖ వ్యాపార సంస్థ కాదని, ఆలయాల ద్వారా ఆదాయం ఆర్జించడం ప్రభుత్వ లక్ష్యం కాదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ధర్మ పరిరక్షణ, ఆలయాల అభివృద్ధి, భక్తులకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఈ విషయాలు వెల్లడించారు.

మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిర్ణయించిన రుసుములనే ప్రస్తుతం కొనసాగిస్తున్నామని, భక్తులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం మోపకుండా కోట్లాది రూపాయలతో ఆలయాల్లో సౌకర్యాలను విస్తరిస్తున్నామని చెప్పారు. భక్తులను కేవలం హుండీలు నింపే వారిగా కాకుండా ధర్మ సంరక్షకులుగా ప్రభుత్వం చూస్తోందని పేర్కొన్నారు.

ప్రధాన ఆలయాల్లో ఆదాయం, భక్తుల సంఖ్య పెరుగుదల

కొన్ని గణాంకాలను మాత్రమే చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి విమర్శించారు. వాస్తవానికి విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ, అన్నవరం, శ్రీశైలం, సింహాచలం, ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం తదితర ప్రధాన ఆలయాల్లో మొత్తం ఆదాయం, హుండీ ఆదాయం, భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు వివరించారు.

రాష్ట్రంలోని 22 ప్రధాన దేవాలయాల మొత్తం ఆదాయం 2023–24లో రూ.1,379.19 కోట్లుగా ఉండగా, 2025–26 నాటికి రూ.1,503.90 కోట్లకు చేరిందని తెలిపారు. దీంతో రూ.124.71 కోట్ల అదనపు ఆదాయం నమోదై దాదాపు 9 శాతం వృద్ధి సాధించబడిందన్నారు.

అలాగే 2023–24లో 634.68 లక్షల మంది భక్తులు ప్రధాన దేవాలయాలను దర్శించగా, 2025–26 నాటికి ఆ సంఖ్య 805.04 లక్షలకు చేరుకుందని వెల్లడించారు. అంటే అదనంగా 170.36 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోవడం ద్వారా సుమారు 27 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు.

శ్రీశైలం, వాడపల్లి, కనకదుర్గమ్మ ఆలయాల్లో విశేష పురోగతి

శ్రీశైలం దేవస్థానంలో ఆదాయం రూ.178.82 కోట్ల నుంచి రూ.217.24 కోట్లకు పెరిగిందని, భక్తుల సంఖ్య 82.18 లక్షల నుంచి 119.71 లక్షలకు చేరుకుందని మంత్రి వివరించారు.

కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి ఆలయంలో ఆదాయం రూ.23 కోట్ల నుంచి రూ.56 కోట్లకు పెరిగిందని తెలిపారు.

విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో భక్తుల సంఖ్య 93.40 లక్షల నుంచి 119.34 లక్షలకు, అన్నవరం దేవస్థానంలో 45.50 లక్షల నుంచి 57.87 లక్షలకు పెరిగినట్లు వెల్లడించారు.

ఆదాయం ఒక్కటే ఆలయ అభివృద్ధికి ప్రమాణం కాదు

ఆలయాల పనితీరును కేవలం నికర ఆదాయం ఆధారంగా అంచనా వేయడం సరైన విధానం కాదని మంత్రి స్పష్టం చేశారు. భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం, సేవల విస్తరణ, దాతల విరాళాలు, అన్నప్రసాద కార్యక్రమాలు, డిజిటల్ సేవలు, ఇతర ఆదాయ వనరులు వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించినప్పుడే వాస్తవ పరిస్థితి తెలుస్తుందని పేర్కొన్నారు.

111 ఆలయాల్లో అన్నప్రసాద సేవలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 111 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ జరుగుతోందని మంత్రి తెలిపారు. ప్రతిరోజూ సుమారు 80 వేల మంది, నెలకు 24 లక్షల మంది, సంవత్సరానికి దాదాపు 3 కోట్ల మంది భక్తులకు అన్నదానం అందిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.84 కోట్లు వెచ్చిస్తోందని, త్వరలో మరో 59 ఆలయాలకు ఈ సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించారు.

పారదర్శక హుండీ లెక్కింపు – డిజిటల్ సేవలకు ప్రాధాన్యం

హుండీ లెక్కింపును పూర్తిగా సీసీటీవీ పర్యవేక్షణలో అధికారులు, బ్యాంకు ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఎక్కడైనా ఫిర్యాదులు అందితే వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

దాదాపు 70 శాతం మంది భక్తులు ఆన్‌లైన్, మనమిత్ర తదితర డిజిటల్ సేవలను వినియోగిస్తున్నారని, హెల్ప్‌డెస్కులు, కియోస్కులు, డిజిటల్ వ్యవస్థల ద్వారా సేవలను మరింత సులభతరం చేస్తున్నామని చెప్పారు.

ఆలయాల అభివృద్ధికి భారీ ప్రణాళికలు

గత ప్రభుత్వం 919 దేవాలయాలకు నిధులు మంజూరు చేసినప్పటికీ కేవలం 372 పనులు మాత్రమే పూర్తి చేసిందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెండింగ్ పనులను వేగవంతం చేసి ఇప్పటికే 282 పనులు పూర్తి చేయగా, మరో 236 పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.

అదనంగా 659 దేవాలయాల అభివృద్ధికి రూ.789.92 కోట్లతో పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని 276 దేవాలయాల అభివృద్ధికి రూ.87.03 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సహకారంతో రూ.750 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఆలయం లేదా భజన మందిరం ఏర్పాటు చేసే మహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు.

ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ సలహాదారు సీతారామాంజనేయ ప్రసాద్, కమిషనర్ రామచంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.