
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పాఠశాల పాఠ్యపుస్తకాల విషయంలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి కీలక ప్రతిపాదన చేశారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, జాతీయవాది నాయకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితం, దేశానికి ఆయన చేసిన సేవలు పాఠశాల సిలబస్‌లో భాగం కావాలని సూచించారు. అదే సమయంలో సింగూర్ ఉద్యమానికి సంబంధించిన పాఠాలను సిలబస్ నుంచి తొలగించాలని అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా కోల్‌కతాలో నిర్వహించిన కార్యక్రమంలో సువేందు అధికారి మాట్లాడుతూ, “సిలబస్‌ను రాజకీయ నాయకులు నిర్ణయించరు. కానీ ప్రజాప్రతినిధిగా నేను ఒక ప్రతిపాదన చేయగలను. పశ్చిమ బెంగాల్ ఏర్పాటులో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోషించిన పాత్ర, ఆయన దేశభక్తి, అవిభాజ్య భారతదేశంపై ఉన్న దృక్పథం, పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాలు, కేంద్ర మంత్రిగా, కలకత్తా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా అందించిన సేవలను విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలి” అని పేర్కొన్నారు.
అదే సమయంలో 2008లో టాటా మోటార్స్ నానో కారు ప్రాజెక్టు సింగూర్ నుంచి వెళ్లిపోవడానికి దారితీసిన ఉద్యమానికి సంబంధించిన అంశాలు పాఠ్యపుస్తకాల్లో కొనసాగాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై తుది నిర్ణయం సిలబస్ కమిటీదేనని, తాను కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే చేస్తున్నానని స్పష్టం చేశారు.





