News

సీలేరు అటవీ ప్రాంతంలో 10 వేల విత్తన బంతుల వెదజల్లింపు

55views

అడవులను సంరక్షించడం, అటవీ విస్తీర్ణాన్ని పెంచడం ద్వారానే భవిష్యత్తు తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించవచ్చని అల్లూరి సీతారామరాజు జల్లా  సీలేరు అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ సతీష్ పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీలేరు అటవీ రేంజ్ పరిధిలోని ధారకొండ, దుప్పులవాడ బీట్లలో  భారీ స్థాయిలో విత్తన బంతుల (సీడ్ బాల్స్) వెదజల్లింపు కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దుప్పులవాడ పంచాయతీ పరిధిలోని దెబ్బకోట గ్రామంలో 4 వేల, గొందిపోలం ప్రాంతంలో 2 వేల, అలాగే అమ్మవారి ధారకొండ బీట్ పరిధిలోని ఏనుగుబైలు ప్రాంతంలో మరో 4 వేల విత్తన బంతులను వెదజల్లారు. మొత్తం 10 వేల విత్తన బంతులను అటవీ ప్రాంతాల్లో విస్తరించి పచ్చదనాన్ని పెంపొందించే ప్రయత్నం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక గిరిజన యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొని అటవీ సంరక్షణపై తమ బాధ్యతను చాటిచెప్పారు.

ఈ సందర్భంగా సెక్షన్ ఆఫీసర్ సతీష్ మాట్లాడుతూ, అడవుల విధ్వంసం వల్ల వాతావరణ మార్పులు, జీవ వైవిధ్యానికి ముప్పు వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా, విత్తన బంతులను తయారు చేసి అటవీ ప్రాంతాల్లో వెదజల్లడం వంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.