
చదువు వ్యాపారంగా మారిపోయిన ఈ రోజుల్లో విద్యను సేవగా భావిస్తూ గిరిజన పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు అనన్య పాల్ డోడ్మానీ. చిన్ననాటి అనుభవాలే ఆమెను ఈ దిశగా నడిపించాయి. ‘ట్రైబల్ కనెక్ట్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వేలాది గిరిజన కుటుంబాలకు విద్య, ఉపాధి, ఆరోగ్య అవగాహన అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
అసోంలో జన్మించి పెరిగిన అనన్యకు చిన్నప్పటి నుంచే గిరిజన ప్రాంతాల జీవన విధానం దగ్గరగా తెలిసింది. ఎనిమిదో తరగతిలో చదువుతున్న సమయంలో ఓ దుకాణదారుడు డబ్బు విషయంలో నిరక్షరాస్య మహిళను మోసం చేయడం ఆమెను తీవ్రంగా కలచివేసింది. విద్య లేకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి, భవిష్యత్తులో వారికి చదువు అందించాలని అప్పుడే నిర్ణయించుకున్నారు.
ఆ నిర్ణయాన్ని మరింత బలపరిచిన మరో సంఘటన ఆమె జీవితంలో చోటుచేసుకుంది. కొందరు యువకులు ఆమె తండ్రిని కిడ్నాప్ చేసి వారం రోజుల పాటు బంధించారు. తర్వాత వారు పేదరికం, నిరుద్యోగం కారణంగానే ఆ మార్గంలోకి వెళ్లారని తెలుసుకున్న అనన్య, వారిపై కోపం కంటే బాధనే ఎక్కువగా అనుభవించారు. చదువు, ఉపాధి లేకపోవడమే ఇలాంటి పరిస్థితులకు కారణమని గుర్తించి, అదే గ్రామంలోని పిల్లలకు విద్యాబోధన ప్రారంభించారు.
ఈ ప్రయత్నానికే ‘ట్రైబల్ కనెక్ట్’ అనే పేరు పెట్టారు. మొదట వారాంతాల్లో స్నేహితులతో కలిసి గ్రామాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి నిధులు సేకరించేవారు. ఆ నిధులతో గిరిజన పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తూ సేవా కార్యక్రమాలను విస్తరించారు.కాలక్రమేణా ఈ ఉద్యమం పెద్దదై, ప్రస్తుతం అసోం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లోని 160కిపైగా గిరిజన తెగల ప్రాంతాలకు విస్తరించింది.
విద్యతో పాటు ఉపాధి, ఆరోగ్యంపై దృష్టి
ట్రైబల్ కనెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లర్నింగ్ సెంటర్లలో పిల్లలకు ఉచిత విద్యతో పాటు భోజన వసతి కూడా కల్పిస్తున్నారు. ఉపాధి కోల్పోయిన వారికి వ్యవసాయ శిక్షణ ఇస్తున్నారు. గృహహింసకు గురైన మహిళలకు, ఒంటరి వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ప్రతి కేంద్రం నిర్వహణ బాధ్యతలను స్థానిక యువతకే అప్పగించడం ద్వారా భాషా, సాంస్కృతిక సమస్యలు తలెత్తకుండా చూస్తున్నారు.అంతేకాదు, గిరిజన మహిళల్లో రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ పర్యావరణహిత శానిటరీ ప్యాడ్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు.
సవాళ్ల మధ్య సేవా ప్రయాణం
గిరిజన ప్రాంతాల్లో పనిచేయడం అంత సులభం కాదని అనన్య చెబుతున్నారు. వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, అడవి ఏనుగుల దాడులతో లర్నింగ్ సెంటర్లు దెబ్బతిన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని పేర్కొంటున్నారు. అయినప్పటికీ సేవా కార్యక్రమాలను ఎప్పుడూ ఆపాలనే ఆలోచన చేయలేదని ఆమె అంటున్నారు.
“ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, గాయాలు ఉంటాయి. వాటితో బాధితుల్లా మిగిలిపోతామా, లేక వాటినే సమాజానికి ఉపయోగపడే శక్తిగా మార్చుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది” అని అనన్య చెప్పే మాటలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాయి.
సేవకు దక్కిన గుర్తింపు
గిరిజన ప్రాంతాల్లో విద్య, మహిళా సాధికారత, సామాజిక అభివృద్ధి కోసం చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా అనన్య పాల్ డోడ్మానీకి ప్రతిష్ఠాత్మక **’కర్మవీర్ చక్ర’** అవార్డు లభించింది. విద్య ద్వారా సమాజంలో శాశ్వత మార్పు తీసుకురావచ్చని ఆమె నిరూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.





