News

గుప్తనిధుల వేట పేరుతో నిషేధిత పేలుడు పదార్థాల వినియోగం.. 9 మంది అరెస్ట్

6views

అన్నమయ్య జిల్లాలో గుప్తనిధుల కోసం నిషేధిత పేలుడు పదార్థాలను ఉపయోగించి అక్రమంగా తవ్వకాలు నిర్వహిస్తున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి వాహనాలు, తవ్వకాలకు ఉపయోగించిన యంత్రాలు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు.

స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. తెల్లవారుజామున గుర్రంకొండ మండలంలోని అమిలేపల్లె పంచాయతీ శ్రీనివాసపురం గ్రామ సమీపంలో ఉన్న దండుమారెమ్మ ఆలయం వద్ద, సోమేపల్లి గోవిందుకు చెందిన వ్యవసాయ భూమిలో గుప్తనిధుల కోసం పేలుడు పదార్థాలతో తవ్వకాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో వాల్మీకీపురం సీఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుంది. అరెస్టయిన వారిలో అమిలేపల్లెకు చెందిన సోమేపల్లి గోవిందు (75), గుర్రంకొండ మండలంలోని ఖండ్రిగ గ్రామానికి చెందిన షేక్ ముస్తాక్ అహ్మద్ (43), గుర్రంకొండకు చెందిన పఠాన్ మురాద్ షావలీ (50), శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి చెందిన షేక్ మహమ్మద్ అఫ్సర్ (53), వెంగళశెట్టి సురేంద్ర (45), దాడిశెట్టి మహేష్ (29), సోరకుంట్ల వెంకటేష్ (55), అలాగే శ్రీ సత్యసాయి జిల్లా ఎన్‌పీకుంట మండలానికి చెందిన మూలి దేవేంద్ర (24) ఉన్నారు.

నిందితులపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా పేలుడు పదార్థాలను వినియోగించడం, గుప్తనిధుల పేరుతో తవ్వకాలు చేపట్టడం చట్టవిరుద్ధమని, ఇలాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.