News

ఈసీ ఒకలా… సీఎం మరోలా…

804views

రోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసింది. ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ప్రకటించారు. విజయవాడలో ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా ఊహించని మార్పులు వచ్చాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పేపర్‌ బ్యాలెట్‌వల్ల కరోనా విస్తరించే ప్రమాదం ఉంది. విధిలేని పరిస్థితుల్లోనే స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నాం. పార్టీలు, ఉద్యోగులు, అన్ని వర్గాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆరు వారాల తర్వాత సమీక్ష చేపడతాం. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే ఎన్నికలు నిర్వహిస్తాం. ఆరు వారాల తర్వాత ఎన్నికల ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతుంది. ఆరు వారాల తర్వాత కొత్త షెడ్యూల్‌ విడుదల చేస్తాం’ అని ఆయన ప్రకటించారు.

తీవ్రంగా పరిగణిస్తున్నాం..

స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. కొన్ని చోట్ల బెదిరింపులకు దిగడం దారుణమని అన్నారు. కొందరు అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుపతి, మాచర్ల, పుంగనూరు ఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను తప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ వేరే అధికారులను నియమించాలని ఆదేశించామన్నారు. మాచర్ల సీఐపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు వెల్లడించారు.

కోడ్‌ కొనసాగుతుంది..

ఎన్నికల ప్రక్రియ వాయిదా పడినప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల నియమావళి కొనసాగుతుందని రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు కొనసాగుతారని తెలిపారు.

పూర్తి పక్షపాతంగా వ్యవహరించడం బాధాకరం

‘స్థానిక ఎన్నికల ప్రక్రియలో అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లలో జరిగిన పరిణామాలు బాధాకరం. బెదిరింపులు, అడ్డుకున్న దృశ్యాలు మాధ్యమాల్లో వచ్చాయి. కొందరు అధికారులపై చర్యలు తీసుకోవడం అనివార్యంగా భావిస్తున్నాం. అధికార యంత్రాంగం పూర్తి పక్షపాతంగా వ్యవహరించడం బాధాకరం. మాచర్ల దాడిలో పాల్గొన్న నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు. స్థానిక పోలీసుల వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉంది’ అని రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు.

ఎన్నికల వాయిదాపై సీఎం ఆగ్రహం

స్థానిక ఎన్నికల వాయిదాపై సీఎం జగన్‌ స్పందిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌పై విమర్శలు చేశారు. ఆయన తన విచక్షణ కోల్పోయి మాట్లాడారన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే రమేశ్‌కుమార్‌ నియమితులయ్యారని చెప్పారు. ”రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను మేం నియమించలేదు. ఎస్‌ఈసీకి కుల, మతం, ప్రాంతం అనే స్వార్థాలు ఉండకూడదు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎస్‌ఈసీ పదవిలోకి తీసుకున్నారు. ఎవరో ఆర్డర్లు రాసి పంపిస్తే ఎస్‌ఈసీ చదివి వినిపిస్తున్నారు. విచక్షణాధికారం పేరుతో ఏకపక్షంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. కలెక్టర్లు, ఎస్పీలను ఎస్‌ఈసీ ఏకపక్షంగా ఎలా తప్పిస్తారు? రాష్ట్రంలో పది రోజుల్లో స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలి. ప్రజల చేత ఎన్నికైన సీఎం కంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఎక్కువ అధికారాలు ఉంటాయా? రాష్ట్రాన్ని కూడా ఎన్నికల కమిషనరే పాలించవచ్చు కదా?” అని తీవ్రస్థాయిలో జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానిక ఎన్నికల వాయిదాపై కనీసం సీఎస్‌, వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శులతోనూ చర్చించలేదని జగన్‌ ఆరోపించారు. ఎన్నికల వాయిదాపై జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం వారిని సంప్రదించినట్లు పేర్కొన్నారని ఆక్షేపించారు. స్థానిక ఎన్నికల్లో వైకాపా జోరు చూసి తెదేపాకు భయం పట్టుకుందన్నారు. 10,243 చోట్ల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుంటే కేవలం 43 చోట్లే చెదురుమదురు ఘటనలు జరిగాయన్నారు. 2794 వార్డుల్లో 15185 నామినేషన్లు దాఖలైతే వీటిలో 14 చోట్లే చెదురుమదురు ఘటనలు జరిగాయని చెప్పారు. ఏ స్థానిక ఎన్నికల్లో అయినా ఇంతకంటే తక్కువ ఘటనలు జరిగాయా? అని జగన్‌ ప్రశ్నించారు. ఎక్కడా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించలేదని నిబద్ధతతో వ్యవహరించారని సీఎం కొనియాడారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.