News

ఢాకాలో హిందువుల ఆగ్రహం.. కాగడాల ప్రదర్శనతో భారీ నిరసన

30views

శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని అవమానించిన ఘటనపై బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హిందూ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 19 రాత్రి హిందూ విద్యార్థులు, వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ కాగడాల ప్రదర్శన నిర్వహిస్తూ నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నిరసనకు నాయకత్వం వహించిన హిందూ విద్యార్థులు మాట్లాడుతూ, కొద్ది రోజుల క్రితం మత తీవ్రవాదులు శ్రీరాముడి విగ్రహంపై చెప్పు ఉంచి అవమానించారని ఆరోపించారు. ఈ ఘటన హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. 72 గంటల్లోగా నిందితులను అరెస్టు చేయాలని, లేనిపక్షంలో మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు వినతిపత్రం సమర్పించడంతో పాటు మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఢాకాలో జరిగిన కాగడాల ప్రదర్శన షాబాగ్ కూడలి వద్ద ప్రారంభమై, షాబాగ్ స్క్వేర్, మోతీజీల్ మార్గం గుండా నేషనల్ ప్రెస్ క్లబ్ వరకు కొనసాగింది. భారీ సంఖ్యలో పాల్గొన్న హిందూ యువత, భక్తులు “జై శ్రీరామ్”, “హిందూ ఐక్యత జిందాబాద్” వంటి నినాదాలతో నిరసన తెలిపారు.అదే రోజు ఉదయం కూడా ఢాకాలోని వివిధ ప్రాంతాల్లో హిందూ సంఘాలు వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. “హిందూ మహాజోట్”కు చెందిన రెండు వర్గాలు నేషనల్ ప్రెస్ క్లబ్ వద్ద ధర్నా నిర్వహించగా, మరో వర్గం ఢాకా రిపోర్టర్స్ యూనిటీలో విలేకరుల సమావేశం నిర్వహించి ఘటనను ఖండించింది.

దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు
నేషనల్ ప్రెస్ క్లబ్ ఎదుట మానవహారం ఏర్పాటు చేసిన హిందూ సంఘాల ప్రతినిధులు, శ్రీరాముడి విగ్రహాన్ని అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “నేషనల్ కమిటీ ఫర్ పూజా సెలబ్రేషన్స్” ఈ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

ఢాకాలోని నిరసనలకు ముందే ఉత్తర బంగ్లాదేశ్‌లోని గైబందా జిల్లా పలాష్‌బారిలో కూడా హిందూ సమాజం పెద్దఎత్తున ఆందోళన చేపట్టింది. శ్రీరాముడి విగ్రహాన్ని అవమానించిన ఘటనపై నిందితులను వెంటనే అరెస్టు చేసి, హిందూ దేవాలయాలు, ఆరాధ్య దైవాల రక్షణకు ప్రభుత్వం సమర్థమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.