ArticlesNews

రిజిస్ట్రేషన్ లేకుంటే చట్టబద్ధత లేదా? – ఆర్ఎస్ఎస్ పై ప్రచారం, చట్టపరమైన వాస్తవాలు

36views

ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో, రాజకీయ వేదికలపై ఒకే ప్రశ్నను పదేపదే లేవనెత్తుతున్నారు. “రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)కు రిజిస్ట్రేషన్ లేదు. మరి అలాంటి సంస్థ ఎలా పనిచేస్తోంది?” అని ప్రశ్నిస్తూ, సంఘం చట్టబద్ధతనే సందేహాస్పదంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే అ నిజమవుతుందనే ప్రచార పద్ధతిలో ఈ అంశాన్ని సమాజంలోకి వదులుతున్నారు.

కానీ ఈ మొత్తం వివాదంలో ఒక ప్రాథమికమైన ప్రశ్నను మాత్రం విస్మరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ లేకపోతే ఒక సంస్థ చట్టబద్ధమైనది కాదా? భారతదేశ చట్టాలు నిజంగా అదే చెబుతున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే భావోద్వేగాల కంటే చట్టాన్ని, ప్రచారం కంటే న్యాయస్థానాల తీర్పులను, ఊహాగానాల కంటే చారిత్రక వాస్తవాలను పరిశీలించాల్సి ఉంటుంది.

శతాబ్ద కాలపు చరిత్ర – ప్రభుత్వాల వైఖరి

1925లో స్థాపించబడిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దాదాపు శతాబ్దకాలంగా దేశవ్యాప్తంగా పనిచేస్తోంది. స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ పాలనలో ప్రారంభమైన ఈ సంస్థ, స్వాతంత్ర్యం తర్వాత కూడా తన కార్యకలాపాలను కొనసాగించింది. ఈ సుదీర్ఘ కాలంలో సంఘంపై మూడు సార్లు నిషేధం విధించారు. ఆదాయపు పన్ను శాఖ విచారణలు జరిపింది. ఆయా నిషేధాలపై చట్టపరమైన న్యాయపోరాటాలు జరిగాయి. పార్లమెంటులో అనేకసార్లు సుదీర్ఘ చర్చలు జరిగాయి. అయినప్పటికీ, ఏ ప్రభుత్వంగానీ, ఏ ఉన్నత న్యాయస్థానంగానీ “RSS ముందు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, అప్పుడే అది చట్టబద్ధమైన సంస్థ అవుతుంది” అని ఒక్కసారి కూడా చెప్పలేదు. ఈ ఒక్క చారిత్రక వాస్తవమే ప్రస్తుతం జరుగుతున్న దుష్ప్రచారానికి గట్టి సమాధానం చెబుతుంది.

ఇటీవల ఈ అంశంపై సర్ సంఘ్ చాలక్  చాలక్ డా. మోహన్ భాగవత్ స్పందిస్తూ ఒక తార్కికమైన విషయాన్ని గుర్తుచేశారు. “1925లో బ్రిటిష్ పాలనలో ప్రారంభమైన సంస్థ బ్రిటిష్ ప్రభుత్వానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆశించడం హాస్యాస్పదం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా భారతదేశ చట్టాలు ప్రతి సామాజిక సంస్థకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయలేదు” అని స్పష్టం చేశారు. అంతేకాదు, చట్టప్రకారం ‘Body of Individuals’ (వ్యక్తుల సమూహం) అనే హోదా పూర్తిగా చట్టబద్ధమైనదని, RSS అదే పరిధిలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. “హిందూ ధర్మానికి ఎక్కడైనా రిజిస్ట్రేషన్ ఉందా? లేనంత మాత్రాన దానికి ఉనికి లేదా?” అన్న ఆయన ప్రశ్న కేవలం భావోద్వేగంతో అన్నది కాదు, భారత చట్టవ్యవస్థలో ఉన్న వాస్తవాన్ని ప్రతిబింబించింది.

రాజ్యాంగ ప్రాతిపదిక – చట్టపరమైన హోదా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(c) ప్రతి పౌరుడికి సంఘాలు, సమాజాలు ఏర్పాటు చేసుకునే ప్రాథమిక హక్కును కల్పించింది. అయితే సమాజ హితం కోసం పనిచేసే ప్రతి సంస్థ కూడా తప్పనిసరిగా సొసైటీగా, ట్రస్ట్ గా  లేదా   ఎన్జీవోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రాజ్యాంగం గానీ, దేశంలోని సాధారణ చట్టాలు గానీ ఎక్కడా నిబంధన విధించలేదు.

చట్టపరంగా సంస్థలు వివిధ రూపాల్లో పనిచేయవచ్చు. భారతీయ పన్ను చట్టాల ప్రకారం సంఘాల మనుగడను రెండు విభాగాలుగా చూడవచ్చు: ఒకటి ‘Association of Persons’ (AOP),  రెండవది ‘Body of Individuals’ (BOI). ఈ రెండింటికీ చట్టంలో స్పష్టమైన గుర్తింపు ఉంది. BOIగా చట్టబద్ధంగా ఉనికిలో ఉండటానికి ఎన్టీఓ వంటి ప్రత్యేక రిజిస్ట్రేషన్ ప్రక్రియలతో నిమిత్తం లేదు. RSS విషయంలోనూ ఇదే చట్టపరమైన స్థితి వర్తిస్తుంది.

చారిత్రాత్మక తీర్పు – ‘గురుదక్షిణ’ వివాదం

RSS చట్టపరమైన ఉనికిని, దాని ఆర్థిక నమూనాను అత్యంత స్పష్టంగా నిర్ధారించిన చారిత్రక ఘట్టం ‘గురుదక్షిణ’పై జరిగిన ఆదాయపు పన్ను వివాదం. 1967– 68 నుండి 1975–76 వరకు స్వయంసేవకులు సమర్పించిన గురుదక్షిణపై ఆదాయపు పన్ను విధించాలని పన్నుల శాఖ ప్రయత్నించింది. విరాళాలు ఇచ్చిన వారి పేర్లు, చిరునామాలు రికార్డులలో నమోదు చేయలేదని పేర్కొంటూ ఆ నిధులను పన్ను పరిధిలోకి తీసుకురావాలని వాదించింది.అదే సమయంలో RSS దీనిని గట్టిగా సవాలు చేసింది.

గురుదక్షిణ అనేది బాహ్య సమాజం నుండి వ్యాపారపరంగా ఆర్జించిన ఆదాయం కాదని, అది సభ్యులు (స్వయంసేవకులు) స్వచ్ఛందంగా తమ సంస్థ కోసం సమర్పించుకున్న నిధి మాత్రమేనని పేర్కొంది. అందువల్ల దీనిపై ‘Principle of Mutuality’ (పరస్పర సూత్రం ) వర్తిస్తుందని సంఘం వాదించింది. ఈ వివాదం చివరకు ‘Commissioner of Income Tax vs Rashtriya Swayamsevak Sangh (1994) కేసుగా పాట్నా  హైకోర్టుకు చేరింది.

అంతకుముందే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) కూడా 1978 డిసెంబర్ 19న జారీ చేసిన సర్క్యులర్ లో  RSSకు సంబంధించిన గురుదక్షిణపై పరస్పర సూత్రం వర్తిస్తుందని అంగీకరించింది. పాట్నా హైకోర్టు కూడా అదే చట్ట సిద్ధాంతాన్ని సమర్థిస్తూ ఆర్ఎస్ఎస్కు అనుకూలంగా తీర్పు చెప్పింది. సభ్యులు సమర్పించే గురుదక్షిణకు పరస్పర సూత్రం వర్తిస్తుందని, అందువల్ల అది ఆదాయపు పన్ను పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.

ఈ తీర్పు ప్రాముఖ్యత కేవలం పన్ను మినహాయింపునకుమాత్రమే పరిమితం కాలేదు. కోర్టు ముందు నిలిచిన సంస్థ యొక్క చట్టపరమైన ఉనికిని న్యాయవ్యవస్థ అంగీకరించిన తర్వాతే.. ఆ సంస్థ ఆదాయం, నిధుల స్వభావం, పరస్పర సూత్రం వంటి అంశాలను పరిశీలించడం సాధ్యమైంది. ఒకవేళ RSS చట్టబద్ధమైన సంస్థ కాకపోయి ఉంటే, ఆ విచారణే చెల్లేది కాదు. కానీ CBDT, ఆదాయపు పన్ను ట్రిబ్యునళ్లు, పాట్నా హైకోర్టు – అన్నీ RSSను ఒక చట్టబద్ధమైన వ్యవస్థగా పరిగణించి తీర్పులు ఇచ్చాయి.

నిషేధాల వెనుక ఉన్న నిజం మరోసారి సంఘంపై విధించిన మూడు నిషేధాలను (1948, 1975, 1992) మనం గుర్తు చేసుకోవాలి. ప్రభుత్వం ఒక చట్టబద్ధమైన ఉనికి లేని శూన్య సంస్థపై అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా నిషేధం విధించడం సాధ్యమేనా? ఆ నిషేధాలు న్యాయస్థానాల ముందుకు వెళ్లినప్పుడు కూడా కోర్టులు సంఘం ఉనికిని ఎన్నడూ తప్పుబట్టలేదు. 1949లో ప్రభుత్వం సూచించిన ఒకే ఒక్క అంశం – సంఘం -తనకంటూ ఒక లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలనేది. సంఘం ఆ సూచనను గౌరవించి రాజ్యాంగాన్ని సమర్పించింది. అంతే తప్ప “ముందు రిజిస్ట్రేషన్ చేయించుకోండి” అనే మాట ఎక్కడా రాలేదు.

ఇక్కడ మరో కీలకమైన తేడాని గమనించాలి. సంఘం ప్రేరణతో నడిచే విద్యా సంస్థలు, ఆసుపత్రులు, సేవా విభాగాలు, గ్రామాభివృద్ధి సంస్థలు వంటివన్నీ ఆయా చట్టాల ప్రకారం ట్రస్టులుగా, సొసైటీలుగా రిజిస్టర్ అయి పారదర్శకంగా పనిచేస్తున్నాయి. అయితే సంఘం యొక్క మూల కార్యకలాపమైన దైనందిన ‘శాఖ’ వ్యవస్థ మాత్రం స్వయంసేవకుల స్వచ్ఛంద గురుదక్షిణ ఆధారంగానే కొనసాగుతోంది. కాబట్టి అనుబంధ సేవా సంస్థల రిజిస్ట్రేషన్ ను మాతృ సంస్థ చట్టపరమైన హోదాను కలిపి గందరగోళం సృష్టించడం సరికాదు.

పరిపాలనా ప్రక్రియ వేరు… చట్టబద్ధత వేరు!

వాస్తవానికి ఈ మొత్తం వివాదం ‘రిజిస్ట్రేషన్’ అనే పదానికి, ‘చట్టబద్ధత’ అనే పదానికి మధ్య ఉన్న ప్రాథమిక తేడాను అర్థం చేసుకోకపోవడం వల్లే వస్తోంది. రిజిస్ట్రేషన్ అనేది కొన్ని చట్టాల కింద ఏర్పడే సంస్థలకు అవసరమయ్యే ఒక పరిపాలనా ప్రక్రియ (Administrative Process) మాత్రమే. కానీ చట్టబద్ధత (Legality) అనేది రాజ్యాంగం దేశ చట్టాలు, న్యాయస్థానాల గుర్తింపు ద్వారా నిర్ణయించబడుతుంది. ఈ రెండింటినీ ఒకటిగా చూడటం చట్టశాస్త్రం ప్రకారం ముమ్మాటికీ తప్పే అవుతుంది.

అందుకే నేడు “RSSకు రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి అది చట్టబద్ధమైన సంస్థ కాదు” అని ప్రచారం చేసేవారు, గత వందేళ్ల చట్టపరమైన చరిత్రను, ప్రభుత్వాల అధికారిక వైఖరిని, ఉన్నత న్యాయస్థానాల తీర్పులను విస్మరిస్తున్నారు. వాస్తవాలు చెబుతున్నది ఒక్కటే – ఎన్జీవోగా రిజిస్ట్రేషన్ లేనంత మాత్రాన ఒక సంస్థ చట్టవిరుద్ధం అవదు. భారత చట్టవ్యవస్థ గుర్తించిన “Body of Individuals” రూపంలో ఒక సంస్థ పూర్తిగా చట్టబద్దంగా  ఉనికిలో ఉండవచ్చు, పనిచేయవచ్చు. RSS విషయంలో ఇదే పరమసత్యాన్ని ప్రభుత్వాల చర్యలు, న్యాయస్థానాల తీర్పులు పదేపదే ధృవీకరించాయి.

రాజకీయ ప్రచారం కంటే చట్టం గొప్పది. తాత్కాలిక అపోహల కంటే చారిత్రక వాస్తవాలు బలమైనవి.

-ఛావా