
విశాఖపట్నం జిల్లా పాండ్రంగి గ్రామంలో భారతమాత దేవాలయ ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావుతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు.
పూజ్య శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ వారి పుణ్యహస్తాలతో గ్రామ పెద్దలు, జాతీయవాద మిత్రులు, భక్తులు, స్థానిక ప్రజల సమక్షంలో భారతమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వేదమంత్రోచ్చారణలు, ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య జరిగిన ఈ మహోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, భారతమాత ఆలయం ప్రతి భారతీయుడిలో దేశభక్తి, సంస్కృతి, సేవాభావాన్ని పెంపొందించే స్ఫూర్తి కేంద్రంగా నిలుస్తుందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జన్మభూమి అయిన పాండ్రంగిలో భారతమాత ఆలయం ఆవిర్భవించడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో ఆలయ ప్రాంగణంలో “విప్లవ వీరుల స్మృతివనం” ఏర్పాటు చేసి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల చరిత్రను భావితరాలకు పరిచయం చేసే ప్రయత్నం జరగాలని ఆకాంక్షించారు. దేశభక్తి, త్యాగం, ధర్మరక్షణ వంటి విలువలను యువతలో బలోపేతం చేసే కేంద్రంగా ఈ ఆలయం అభివృద్ధి చెందాలని ఆయన అభిలషించారు.
కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్థులు, జాతీయవాద సంస్థల ప్రతినిధులు పాల్గొని భారతమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. “వందే మాతరం”, “భారత్ మాతా కీ జై” నినాదాలతో ఆలయ ప్రాంగణం దేశభక్తి భావోద్వేగాలతో మార్మోగింది.





