News

గోవధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేసిన తమిళనాడు ప్రభుత్వం..

5views

గోమాత సంరక్షణ అంశంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గోవధను నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది.

తమిళనాడు ప్రభుత్వం తన పిటిషన్‌లో, మద్రాస్ హైకోర్టు తీర్పు తమిళనాడు యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్–1958 నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. రాష్ట్ర చట్టం ప్రకారం పదేళ్లు దాటిన గోవులు, సంతానోత్పత్తికి పనికిరాని లేదా వ్యవసాయ పనులకు ఉపయోగపడని పశువులను సంబంధిత అధికారుల అనుమతితో వధించేందుకు అవకాశం ఉందని సుప్రీంకోర్టుకు వివరించింది.

అదేవిధంగా, కేంద్ర చట్టాల ప్రకారమూ నిర్దిష్ట నిబంధనలకు లోబడి పశువుల వధకు అనుమతి ఉందని, దేశవ్యాప్తంగా సంపూర్ణ గోవధ నిషేధాన్ని అమలు చేసే ప్రత్యేక చట్టం లేదని రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలో పేర్కొంది.

ఈ కేసులో హిందూ మక్కల్ కచ్చి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కే. సూర్య, తమిళనాడు డీజీపీ ప్రతివాదులుగా ఉన్నారు. బక్రీద్ సందర్భంగా రాష్ట్రంలో ఒక్క గోవును కూడా వధించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ కే. సూర్య తరఫున అడ్వకేట్ పీవీ యోగేశ్వరన్ గతంలో సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.

గోమాత హిందూ ధర్మంలో అత్యంత పూజనీయమైనదిగా భావించబడుతుంది. గోవును రక్షించడం సనాతన ధర్మ పరిరక్షణలో కీలక భాగమని హిందూ సంఘాలు చాలా కాలంగా పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో గోవధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు హిందూ వర్గాల్లో స్వాగతం పొందగా, ఆ తీర్పును తమిళనాడు ప్రభుత్వం సవాల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.