
బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఢాకాలో ఆలయ పూజారిగా సేవలందిస్తున్న, జగన్నాథ్ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసిస్తున్న హిందూ విద్యార్థి సుభాశ్ దేవూరీ (25)పై గుర్తుతెలియని దుండగులు దారుణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
సుభాశ్‌ను బంధించిన దుండగులు అతడిపై దాడి చేసి, అతని సోదరికి ఫోన్ చేసి రూ.26 వేల బంగ్లాదేశీ టాకాలను తమ ఖాతాకు బదిలీ చేయించుకున్నట్లు సమాచారం. అనంతరం అతని మొబైల్ ఫోన్, పర్సు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
మరుసటి రోజు తెల్లవారుజామున అపస్మారక స్థితిలో ఉన్న సుభాశ్‌ను అతని స్నేహితులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ప్రాథమిక దర్యాప్తులో బాధితుడిని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా హింసించినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటన కేవలం దోపిడీ కోసమే జరిగిందా? లేక హిందూ మతానికి చెందిన వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, ఆలయాలపై విధ్వంసాలు, మైనారిటీల భద్రతపై వస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఈ ఘటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, ఈ దాడి వెనుక మతపరమైన ఉద్దేశం ఉందని ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా నిర్ధారించలేదు.





