News

ఆదివాసీ ప్రాంతాల్లో వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మిక చైతన్యం.. అర్చక వృత్తివైపు గిరిజన యువత అడుగులు

13views

అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక చైతన్యం రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు వ్యవసాయం, కూలి పనులు లేదా సాధారణ ఉద్యోగాలకే పరిమితమైన గిరిజన యువత, ఇప్పుడు అర్చక వృత్తి, పూజా కైంకర్యాలు, దైవ సేవల పట్ల ఆసక్తి చూపుతూ కొత్త దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రామాల్లో శుభకార్యాలు, వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర వైదిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు.

ఆదివాసీ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వికాసానికి ప్రాధాన్యం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో కొత్త ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో పాటు, స్థానికుల అభీష్టం మేరకు శ్రీరామాలయాలు, ఆంజనేయస్వామి ఆలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నారు.

గత రెండేళ్లలో జిల్లాలో 200కు పైగా దేవాలయాల నిర్మాణానికి రూ.6 కోట్ల నిధులు మంజూరు చేయగా, వందకు పైగా గ్రామాల్లో ఆలయాల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. భవిష్యత్తులో ప్రతి గ్రామంలో ఒక ఆలయం ఉండేలా కార్యాచరణ కొనసాగుతోంది.

ఆలయాల్లో నిత్య పూజలు, కైంకర్యాలు, ఇతర నిర్వహణ బాధ్యతలను స్థానికంగా శిక్షణ పొందిన గిరిజన యువతకే అప్పగించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం యువతకు వేదమంత్రాలు, పూజా విధానాలు, శాస్త్రోక్త కర్మలు, వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.

ప్రస్తుతం జిల్లాలో 110 మంది గిరిజన యువకులు అర్చక శిక్షణ పూర్తి చేసుకోగా, వారికి ప్రభుత్వం నెలకు రూ.10 వేల ప్రోత్సాహకాన్ని అందిస్తోంది.

ఈ మార్పుపై అర్చక సమాఖ్య అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ పరమహంస హర్షం వ్యక్తం చేశారు. “ఎక్కడి నుంచో అర్చకులను తీసుకురావడం కంటే స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి ఆలయాల బాధ్యతలు అప్పగించడం వల్ల ఉపాధితో పాటు సనాతన ధర్మంపై అవగాహన కూడా పెరుగుతుంది. గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం బలపడుతుంది” అని ఆయన పేర్కొన్నారు.

ఆదివాసీ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం, స్థానిక యువతకు అర్చక శిక్షణ వంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు సామాజిక, సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదపడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.