
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఏలూరు జిల్లా మండవల్లి మండలం అల్లీనగరం గ్రామంలో శుక్రవారం బీజామృతంతో విత్తన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనాలు కలిగించే ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించారు.
ఏలూరు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (DPM) బి. వెంకటేష్ ఆదేశాల మేరకు రైతులు బి. మంగయ్య, పి. రామకృష్ణ, ఎం. సూర్యప్రకాశ్, చి. సత్యనారాయణ విత్తనాలకు బీజామృతంతో శుద్ధి చేపట్టారు.
డివిజనల్ ఇన్‌చార్జి డి. మధుబాబు సూచనల మేరకు ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ శ్రీమతి ఎం. నాగవిజయ మాట్లాడుతూ, బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనాలు శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వంటి హానికర సూక్ష్మజీవుల నుంచి రక్షణ పొందుతాయని తెలిపారు. అలాగే మొలక శాతం పెరుగుతుందని, మొక్కలు ప్రారంభ దశ నుంచే ఆరోగ్యంగా, దృఢంగా ఎదుగుతాయని వివరించారు.
ప్రకృతి వ్యవసాయంలో బీజామృతం ఒక సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన విధానమని, రైతులు దీన్ని విస్తృతంగా వినియోగించాలని ఆమె సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న రైతులు బీజామృతం తయారీ విధానం, విత్తన శుద్ధి ప్రక్రియ, దాని ప్రయోజనాలపై ఆసక్తిగా అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, ప్రజలు పాల్గొన్నారు.





