
ప్రకృతి వ్యవసాయం ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే సమర్థవంతమైన వ్యవసాయ విధానమని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పుల్లూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న పీఎండీఎస్ (PMDS) క్షేత్రాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విత్తన గుళికలతో సాగు చేసిన పంటల్లో అధిక మొలక శాతం నమోదవడంతో పాటు మొక్కలు సమానంగా పెరుగుతున్నాయని, నేలలో తేమ నిల్వ సామర్థ్యం కూడా మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్‌నినో పరిస్థితుల్లో రైతులు పీఎండీఎస్ విధానంతో పాటు అంతర పంటలను సాగు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. వర్షపాతం అనిశ్చితంగా ఉన్నప్పటికీ ప్రకృతి వ్యవసాయం ద్వారా స్థిరమైన దిగుబడులు సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రైతులు తమ పొలాలను బీడుగా ఉంచకుండా ఏడాది పొడవునా ఏదో ఒక పంటను సాగు చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. తద్వారా నేల సారవంతత పెరగడంతో పాటు రైతుల ఆదాయం కూడా మెరుగుపడుతుందని చెప్పారు.
అనంతరం ఎన్‌ఎంఈఓ-ఓఎస్ (NMEO-OS) పథకం కింద రైతులకు వంద శాతం రాయితీపై సోయాబీన్ విత్తనాలు, పీఎండీఎస్ కిట్లు, సాయిల్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు.





