
జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి (జూన్ 27) హిందూ సామ్రాజ్య దినోత్సవం
సింహాల్లా గర్జించడంకాదు, గర్జించే సింహాలను, గడగడ లాడించిన చరిత్ర మనది. భారతచరిత్రలో క్రీ.శ.712లో దాహిర్ రాజు నుండి ప్రారంభించి నిన్న మొన్నటి సుభాష్ చంద్రబోస్ వరకు ఇదే చరిత్ర. కాని విదేశీ పాలకులు మన చరిత్రను వక్రీకరించారు. ఇవాళ చరిత్రను వికృత రూపంలో బోధిస్తున్నారు. మన వైభవ చరిత్రను 50 పేజీలతో సరిపెట్టారు. సుమారు 900 సంవత్సరాల ముస్లింల పాలన గురించి 200 పేజీలు, 200 ఏళ్ల బ్రిటిష్ పాలన గురించి 200 పేజీలలో రాశారు. హిందూ దేశ చరిత్ర అంటే మనలను ఆక్రమించిన విదేశీ యుల చరిత్ర అన్నమాట. విదేశీయులు ఈ భూమి మీద అడుగుపెట్టిన నాటి నుండి వారిని ప్రతిఘటిస్తూ జరిగిన స్వాతంత్య్ర సంగ్రామం అఖండంగా జరిగింది. ఆ సంగ్రామాన్ని అవిచ్ఛిన్నంగా సాగించిన వీరుల వరుసలో జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి రోజున స్మరించుకోదగిన అద్భుతవీరుడు, గర్జించే సింహాలనే గడగడలాడించిన ధీరుడు శివాజీ ప్రభువు.
హిందూ సామ్రాజ్య పునఃస్థాపన కోసం శివాజీ ఛత్రపతిగా పట్టాభిషిక్తుడైన దినాన్ని ఉత్సవాన్ని జరుపుకొంటున్నాం. చరిత్రలో ఎందరో రాజులు పుట్టారు. కాని, శూన్యం నుండి సామ్రా జ్యాన్ని సృష్టించి, ప్రజల హృదయాలలో దేవునిలా శాశ్వత స్థానం సంపాదించిన ఆ హిందూ వీరుడే శివాజీ. అతి తక్కువ సైన్యంతో అజేయమైన కోటలను అలవోకగా జయించడమే గాక, అదనుచూచి అఫ్జల్‌ఖాన్‌ను వధించి, షయి స్థాఖాన్‌ను పరిగెత్తించిన పరాక్రమ శాలి. సంకల్పం అనే గొప్ప ఆయుధాన్ని ధరించిన శివాజీ పర్వతాలనే ఆయుధాలుగా మలచుకొని గెరిల్లా పద్ధతిలో వ్యూహాలు అల్లి ప్రపంచానికి ఆదర్శ యుద్ధ వ్యూహ నిపుణు డయ్యాడు. ధర్మబద్ధ పాలనను అందించిన రాజర్షిగా మనముందు నిలిచాడు.
ప్రపంచ దేశాలలోని అలెగ్జాండర్, జూలియస్ సీజర్, నెపోలియన్ వంటి శ్రేష్ఠ పురుషులతో పోల్చినపుడు శివాజీ మహాసేనాపతి, పరిపాలనా దక్షుడు. గొప్ప వ్యక్తిత్వం కలిగినవాడిగా కీర్తిని అందుకుంటున్నాడు. అలెగ్జాండర్ దగ్గర గొప్ప సాధన సంపత్తి ఉంది. చాలా దేశాలను జయించాడు. గొప్ప సేనాపతి అతని దగ్గర ఉన్నాడు. అయినప్పటికీ భారత దేశంపై దండెత్తిన తరువాత అతని దురవస్థ వర్ణనాతీతం. ఓటమి చవిచూశాడు. శివాజీకి కూడా కష్టకాలం వచ్చింది. అపుడు అతనికి తోడుగా ఉన్న సైనికులు ఎంత సుదీర్ఘకాలమైనా సరే పోరాటానికి సిద్ధపడ్డారు. శివాజీని తలవంచనీయలేదు. అలాంటి మనఃస్థితిని అలెగ్జాండర్ తన సైన్యంలో నిర్మాణం చేయలేక పోయాడు. అతని మనసులో జగజ్జేతగా పిలిపించుకోవాలనే వ్యక్తిగతమైన కోరిక బలపడినందువల్ల ఓటమి సమయంలో సైన్యం సహకరించ లేదు. అలెగ్జాండర్ చనిపోయాక ఐదారు సంవత్సరాలలోనే అతను నిర్మాణం చేసిన సామ్రాజ్యం కకావికలమైంది. అతని జీవనకార్యం మట్టిలో కలిసి పోయింది. కానీ… శివాజీ విషయంలో ఆయన అస్తమయం తరువాత ఆయన స్ఫూర్తితో చాలా కాలం పాటు శత్రువులను ఎదుర్కోవడం ప్రపంచంలోనే ఒక అద్భుత ఘట్టం. ఎందుకంటే.. ఆ సమయంలో సరైన నేతృత్వం లేదు. కావలసినంత సైన్యం లేదు, సేనాపతి లేడు. కానీ ప్రజలే గుంపులు, గుంపులుగా తయారై ప్రబలమైన శత్రు సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్నారు. ప్రజలంతా స్వప్రేరణతో, ఆదర్శవాదంతో పోరాడారు. మరోవైపు యావత్తు ఉత్తర భారతదేశానికి ఆధిపత్యం వహిస్తూ, గొప్ప సైన్యంతోపాటు ఆయుధ సంపత్తి కలిగిన చక్రవర్తి ఔరంగ జేబు… శివాజీ నిర్మాణం చేసిన హిందూ సామ్రాజ్యానికి గోరీ కడతానని ఢిల్లీ నుంచి వచ్చి పోరాడి చివరికి దక్షిణాదినే సమాధి అయ్యాడు. ప్రపంచంలోనే అందరిని ఆశ్చర్యపరిచే సంఘటన ఇది. ఎంతో ఐకమత్యంతో ఉన్నదనుకున్న అలెగ్జాండర్ సామ్రాజ్యం తునాతునకలై పోవడం ఒకవైపు కనపడుతుంటే, మరోవైపు శివాజీ మరణించిన తరువాత ప్రజలలోని ప్రబల దేశభక్తి ద్వారా, హిందూ సామ్రాజ్యంలోని భూమి ఆవగింజంతైనా శత్రు వశం కాకుండా కాపాడిన ఘట్టం ప్రపంచ చరిత్రలో సాక్షిగా కనపడుతున్నది. సాఫల్యత అనేది వ్యక్తి మరణానంతరం ప్రతిబింబించడం గొప్ప ఆదర్శం. జీవనకార్యానికి ఇది మూల్యాంకనం. ఇద్దరి జీవన కార్యంలో ఫలశృతి ఇది.
జూలియస్ సీజర్ దగ్గర కూడా సాధన సంపత్తి మెండుగా ఉంది. వీరే స్వయంగా కుశల సేనాపతి కూడా. మంచి రాజు. గొప్ప పాలకుడు. కానీ నమ్మినవారే వీరికి వ్యతిరేకమయ్యారు. నిన్నటి దాకా వీరికి జయజయకారాలు పలికినవారు వీరి రక్తాన్ని కోరారు. రాజు మనసులో ఏర్పడిన వ్యక్తిగత కాంక్షయే దీనికి కారణం. జూలియస్ సీజర్ రాజైన తరువాత రోమ్ సామ్రాజ్యాన్ని గొప్పగా నిర్మించాలని ఆకాంక్షను వ్యక్తం చేశాడు. చివరికి రానురాను ‘రోమ్’ స్థానంలో ‘నేను’ అనేది ఆక్రమించింది. ఫలితంగా ‘నా’ సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తాను, ‘నా’ సామ్రాజ్యానికి పేరు ప్రతిష్ఠలు సంపాదించి పెడతాననే వ్యక్తిగత మహదాకాంక్ష పెరిగింది. ఈ కారణంగా ప్రజలే రాజుకు వ్యతిరేకమయ్యారు. కాని శివాజీ విషయంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. శివాజీ కోసం, రాజ్యం కోసం ఆత్మార్పణ చేయడానికి పోటీ పెరిగింది. ఈ స్పర్ధ వారు జీవించి ఉన్నప్పుడే కాదు, మరణానంతరం కూడా అలాగే కొనసాగడం విశేషం. అలాంటి ఆదర్శాన్ని శివాజీ తన జీవిత కాలంలో నిలబెట్టాడు.
నెపోలియన్ ఇంగ్లండ్‌తో వాటర్లూ యుద్ధంలో ఓడిపోతే, శివాజీ ఆగ్రా కోటలో బందీ అయ్యాడు. రెండు సంఘటనలు ఒకటే. అయితే వాటర్లూ యుద్ధంలో ఓడిన.. నెపోలియన్ ఒక వ్యక్తి కాదు, ఆదర్శవాది అని నమ్మి ఫ్రెంచి ప్రజలు కనుక వారి వెన్నంటి ఉన్నట్లయితే నెపోలియన్ మరల యుద్ధానికి సన్నద్ధమై ఉండేవాడు. కానీ ప్రజలకు నెపోలియన్‌పై ఉన్న శ్రద్ధ సడలిపోయింది. ఆదర్శవాది కాదని తెలిసిపోయింది. అందుకే.. తాము మరల పోరా టానికి సిద్ధంగా లేమని, శత్రువుల ముందు లొంగిపోవాలని ప్రజలు సలహా ఇచ్చారు. వంశపారంపర్య పాలన మొదలైందని, రాజు ఎంత త్వరగా తొలగితే మేము అంతా స్వేచ్ఛను పొందుతా మని ఫ్రెంచి ప్రజలు భావించసాగారు.
ఇటువైపు ఆగ్రాకోటలో బందీగా ఉన్న శివాజీ, ఎలా బయటపడాలని ఉపాయం ఆలోచిస్తున్నాడు. మరోవైపు ప్రజలు జాగరూకతతో శివాజీని ఎలా బయటకు తీసుకురావాలో యోచిస్తున్నారు. దానికొరకు ఎంతటి పోరాటానికైనా శివాజీ రాజ్యంలోని ప్రజలు సన్నద్ధంగా ఉన్నారు. అక్కడ నెపోలియన్ జైలుకు వెళ్లాలని ప్రజలు కోరుకుంటే, ఇక్కడ ఆగ్రా నుండి రాజును ఎలా తప్పిం చాలని, ఏ విధంగా సురక్షితంగా హిందూ సామ్రాజ్యంలోకి తీసుకురావాలి, తిరిగి భగవాధ్వజం ఛాయలో శివాజీ నేతృత్వంలో మొగల్ పాదుషాతో పోరాటానికి ఎలా తయారవ్వాలని ప్రజలు ఉవ్విళ్లూరుతున్న వైనం చూడవచ్చు. రెండుచోట్ల సంఘటన ఒకే విధమైనదే. కాని ఈ రెండు సామ్రాజ్యాలలోని ప్రజల మనసులో పాలకులు ఎలాంటి భావన నిర్మాణం చేశారనేది ముఖ్యం. శివాజీ వ్యక్తి కాదని, తమ కళ్లెదుట ఉన్న ఆదర్శమని ప్రజలు నమ్మారు. ప్రతి విషయంలో వ్యక్తి ఉద్దేశం ఏమిటనేది గొప్పది. రాజకీయా లలో రకారకాల ప్రేరణలు పనిచేస్తుంటాయని అంటారు. శివాజీ విషయంలో ఎలాంటి ప్రేరణలు ఉంటాయి? హిందూ స్వరాజ్యం ఏర్పర్చాలనేది భగవంతుని కోరిక, నా కోరిక కాదు అని ఒక సందర్భంలో ఉత్తరం ద్వారా తెలియజేస్తారు. మా అమ్మ కోరిక అనిగానీ, నా కుటుంబ సభ్యుల కోరిక అనిగానీ, చివరకు భోంస్లే కులస్తుల వారి కోరిక అనిగానీ, నా సమర్ధకుల (పార్టీ) కోరిక అనిగానీ ఎక్కడా అనలేదు. క్షణకాలమైనా మనస్సులోకి రానీయలేదు.
దీనినిబట్టి శివాజీ ఈ కార్యాన్ని ఎంత పవిత్రంగా భావించారో అర్థమవుతుంది.‘ఈ రాజ్యం ధర్మానిది, శివాజీది కాదు’ అని మరొక ఉత్తరంలో రాశారు. ఆ సమయంలో మరొక గొప్ప నాయకుడు శివాజీకి సమకాలికుడైన చంద్రరావు మోరేకు ఉత్తరం రాస్తూ, ‘మీరు, నేను భుజంభుజం కలిపి శత్రువుతో పోరాడుదాం రండి’ అని ఆహ్వానించాడు. దానికి చంద్రరావు మోరే ‘శివాజీ! మీ ప్రతిష్ఠ ఎక్కడ? నా ప్రతిష్ఠ ఎక్కడ? నా ప్రతిష్ఠ ఎంత గొప్పదంటే బీజాపూర్ రాజు దయతో రాజా అని బిరుదును నాకు ప్రసాదించాడు’ అని ప్రత్యుత్తరమిచ్చాడు. దానికి శివాజీ సమాధానమిస్తూ, ‘నాకు రాజు అనే ఈ బాధ్యతను శివుడు ప్రసాదిం చాడు’’ అని పేర్కొన్నాడు. కానీ,.. చంద్రరావు మోరెకు ఏదో ఒక ఉత్సవంలో బీజాపూర్ సుల్తాన్ ‘రాజు’ అనే బిరుదును ఇచ్చి ఉంటాడు. అయితే శివుడు ఏ ఉత్సవంలో శివాజీకి రాజు అనే బాధ్యతను ఇచ్చాడు? ఇదంతా శివాజీ విశ్వాసానికి సంబంధించినదిగా మనం భావించాలి. ‘ఇది ఈశ్వరీయకార్యం, నాది కాదు’ అనేది శివాజీ విశ్వాసం. రాజ్య నిర్వహణలో ఏయే పనులున్నాయో అవన్ని భగవంతుని సేవగా భావించి చేయాలి తప్ప, రాజకీయ కోరికలతో కాదు. వ్యక్తిగతంగా తనకు పేరు రావాలని ఎన్నడూ కోరుకోలేదు. ఇది హిందుత్వానికి, ధర్మానికి సంబంధించినది. భగవంతుని కార్యం. అయితే ఈ పనిలో నేను పనిముట్టును మాత్రమేనని భావించాడు శివాజీ. రాజ్యం విషయంలో కొంచెం కూడా, క్షణమాత్రమైన స్వార్థం అతని మనసులో లేదు. ఇలాంటి వైరాగ్యంతో కూడిన మనోప్రవృత్తి ఆయన జీవితంలో అనేకసార్లు తొణికిసలాడింది.
ఒకసారి శివాజీ తండ్రిని బీజాపూర్ సుల్తాన్ బంధించినపుడు ఆయనను విడిపించాలని విశేష ప్రయత్నం చేశాడు. అది సాధ్యం కాక ఒకానొక దశలో తనను తాను ఆత్మార్పణ చేసుకోవాలని అనుకుంటాడు. కానీ సమాజాన్నే భగవంతుడిగా భావించేవాడు ఆ పని చేయగలడా? చివరకు యుక్తితో తండ్రిని బంధ విముక్తుడిని చేశాడు. మరొక సందర్భంలో సంత్ తుకారం కీర్తనలను వినడానికి వెళతాడు. కీర్తనలు విన్న తరువాత ఎంతో ప్రభావితమై రాజ్యాన్ని వదిలిపెట్టి మీతో కూడా వస్తానని తుకారాంతో విన్నవించుకుంటూ, మీ పదిమందిలో చేరి కీర్తన చేసే పదకొండవవాడిగా మీ వెంట ఉంటానంటాడు. ‘ఇలా వస్తే రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు’ అని తుకారాం ప్రశ్నిస్తాడు.
‘ఆ పని ఎవరైనా చేస్తారు, నేనైతే రాజ్యభారం నుండి విముక్తి పొందుతున్నాను’ అని శివాజీ నివేదించుకోగా తుకారాం ఆయనకు రాజధర్మాన్ని బోధించాడు. శివాజీ అంత సామ్రాజ్యానికి అధిపతి అయి ఉండి కూడా అధికార వ్యామోహం లేకుండా తామరాకుపై నీటిబొట్టులా మనసా, వాచా, కర్మణా వ్యవహరించడం గొప్ప విశేషం. ఈ రోజు కనీసం చిన్న కార్పొరేటర్ అయినా ఈ విధంగా తన పదవిని త్యాగం చేయగలడా?
శివాజీ జన్మతః వైరాగ్యం కలిగినవాడు. రాజ్యాధికారం, భౌతిక సంపదపై ఆసక్తి లేనివాడు. ఈ జంజాటంలో పడిన నాకు ఆత్మవికాసం సాధ్యం కాదని ఆలోచిస్తున్న సమయంలో వీరి గురువు సమర్థ రామదాసు ఒకరోజు భిక్షాటనకై శివాజీ దగ్గరికి వచ్చాడు. శివాజీ ఒక చీటి రాసి వారి భిక్షాపాత్రలో వేశాడు. ఆ చీటిలో ‘ఈ సామ్రాజ్యమంతా మీదే. కనుక మీకే అర్పిస్తున్నాను’ అని ఉంది. ఇదొక విచిత్ర స్థితి. స్వయంగా తన కర్తృత్వంతో సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా త్యాగం చేశాడు. ఇదంతా గమనించిన సమర్థ రామదాసు శివాజీకి ఉపదేశిస్తూ ‘పరిపాలన చేయడం నా ధర్మంకాదు, రాజ్యాన్ని తిరిగి తీసుకోమంటాడు’.
‘ఒకసారి దానం చేసిన తరువాత తిరిగి ఎలా స్వీకరించగలను అంటాడు’ శివాజీ. ఇద్దరి మధ్య సంఘర్షణ జరిగింది. ‘ఇది నాది కాదు, నాది కాదు’ అని ఇద్దరు అనుకుంటున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి సంఘటనలను కనీసం మనం ఊహించుకోగలమా? ఇక్కడ శివాజీ, సమర్థ రామదాసు ఇద్దరూ హిందూ ఆదర్శాల స్థాపనయే ఈశ్వరీయ కార్యంగా భావించి తపస్సు చేస్తున్నవారు. చివరకు సమర్థ రామదాసు ఒక రాజీమార్గాన్ని సూచిస్తూ శివాజీతో ‘మీరు ఒకసారి దానం చేశాక, అది నీది కాదు. నేను సన్యాసిని కనుక ఈ రాజ్యం నాది కూడా కాదు. అయితే పరంపరాగతంగా ఈ భగవాధ్వజానిదే ఈ రాజ్యం. ఈ ధ్వజమే రాజు. ఈ ధ్వజానికి ప్రతినిధిగా మీరు రాజ్యాన్ని పరిపాలించండి’అని ఆదేశించారు’. ఇక్కడ మనం గురుశిష్యుల మధ్యలో ఉన్న గొప్ప ఆదర్శాన్ని గమనించవచ్చు. భౌతిక సంపద మీద గాని, రాజ్యం మీద గాని ఎవరికీ ఆసక్తి లేదు. ధార్మిక ప్రవృత్తి వర్ధిల్లడానికి రాజ్యస్థాపన జరగాలని సమర్థ్ధ రామదాసు చెప్పారు. ఈ భావనతోనే శివాజీ నిరంతరం శ్రమించాడు. ఈ కారణంగా ప్రపంచ చరిత్రలోనే ఆయన ఆదర్శవాదం ముందు ఎవరూ నిలబడలేకపోయారు. వ్యక్తివాదం కేంద్రంగా జీవించి, ఆదర్శవాదానికి ఆమడ దూరంలో నిలబడిపోయి నామమాత్రంగా మిగిలిపోయిన ప్రపంచ వీరులతో శివాజీని సరిపోల్చలేము. ఎవరితో పోల్చుకోలేని అద్వితీయ స్థానాన్ని ఆయన సంపాదించాడు. మన దేశ చరిత్రలో శివాజీని విడదీసి చూడలేము.
విదేశీయులు ఈ భూమి మీద అడుగుపెట్టిన నాటి నుండి వారిని ప్రతిఘటిస్తూ స్వాతంత్య్ర సంగ్రామం అఖండంగా సాగింది. స్థలం, సేనాపతి, ఆయుధాలు మారి ఉండవచ్చు. కానీ యుద్ధం ఒకటే. ఒకసారి దాహిర్‌రాజు, మరొకసారి జయపాల్ అనంగపాల్ నేతృత్వంలో, ఇంకోసారి రాణాసంగా, రాణాప్రతాప్ నేతృత్వంలో, విజయనగర ప్రభువుల నేతృత్వంలో, సిక్కు గురువుల నేతృత్వంలో, ఈ విధంగా యుద్ధభూమి వేర్వేరు కావచ్చు, కాని యుద్ధం ఒకటే. ఒక సేనాపతి యుద్ధం ముగించగానే మరో సేనాపతి కొనసాగించారు. దాహిర్ (సింధ్ ప్రాంతం) తరువాత పంజాబ్‌లో అనంగపాల్ ఆయుధమెత్తాడు. ఆ తరువాత రాజపుత్రులు ముందుకు వచ్చారు. తరువాత విజయనగరం, శివాజీ, ఝాన్సీ లక్ష్మిబాయి… ఎక్కడా యుద్ధం ఆగలేదు. ఒక దీపంతో మరియొక దీపాన్ని ప్రజ్వలింప చేసినట్లుగా అఖండ స్వరాజ్య సంగ్రామం జరిగింది. సింధ్ రాజ్యం పంజాబ్‌ను, పంజాబ్ రాజపుత్రులను (రాజస్థాన్), రాజపుత్రులు విజయనగరాన్ని, విజయనగర సామ్రాజ్యం మహారాష్ట్రులను, మహారాష్ట్ర పంజాబ్‌ను ప్రజ్వలింపచేసింది. ఒక దీపం ఆరిపోక ముందే మరొక దీపం ప్రజ్వలింపబడింది. ఈ విధంగా అఖండ సంగ్రామానికి మన భారత చరిత్ర సాక్షిగా నిలబడింది. విజయనగరం తరువాత స్వరాజ్య కాంక్ష అనే జ్యోతిని ఎత్తుకున్నవాడు శివాజీ. ఆయన ఈ కార్యాన్ని స్వీకరించడానికి పూర్వం మహారాష్ట్రలో తయారైన భూమిక రాజకీయ సంబంధమైనది కాదు. ధర్మసంస్కృతుల పరంపరకు సంబంధించినది. సంత్ తుకారాం, జ్ఞానదేవ్, నామ్‌దేవ్ వంటి సాధువులు జనజాగరణ చేశారు. ధర్మస్థాపనకై మన విషయాల పట్ల స్వాభిమానం, మానబిందువులపై జరిగే ఆక్రమణలను ఎదుర్కొనే సంసిద్ధత కొరకే జన జాగరణ. దీని ఫలితమే శివాజీ రూపంలో గ్రామ గ్రామాన శక్తి ఆవిర్భవించింది. శివాజీ ఉద్దేశ్యం కేవలం రాజ్యనిర్మాణమే (పరిపాలన వ్యవస్థ మాత్రమే) కాదు, ధర్మస్థాపన. దూరదృష్టితో కూడిన హిందూ రాష్ట్ర నిర్మాణమే వారి లక్ష్యం. రాజ్య నిర్మాణం, రాష్ట్ర నిర్మాణం రెండు వేరువేరు. రాజ్యనిర్మాణం చేసి పరిపాలన సాగిస్తున్నప్పటికి రాష్ట్ర నిర్మాణం కోసం వారుచేసిన కార్యాన్ని గమనిస్తే రాష్ట్రపురుషుల చెంతన వారిని నిలబెట్టవచ్చు. రాజ్యనిర్మాణం తరువాత అష్టప్రధానమండలిని ప్రవేశపెట్టాడు. ఇది అనాదిగా హిందూదేశంలో వస్తున్న గొప్ప పరంపర. భూమి శిస్తును వసూలుచేయడంలో అప్పటివరకు అనుస రిస్తున్న పద్ధతిని పక్కనబెట్టి, హిందూపద్ధతిలో వసూలు చేశారు. పార్సీ,ఉర్దూభాషలలో నడుస్తున్న రాజ్యకార్యకలాపాలను భారతీయభాషలో అమలు చేశారు.
భూమి సరిహద్దులను ఎలాగూ కాపాడుకుంటాం, సముద్ర సరిహద్దుల రక్షణ ఎవరికైనా గొప్ప సవాలుగా మారుతుంది. కనుక ఎంతో దూరదృష్టితో ఆలోచించి బలమైన నావికా శక్తిని నిర్మాణం చేశాడు. 15వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశానికి గొప్ప నావికా శక్తి ఉండేది. ఆ తరువాత అది కనుమరు గైంది. అయితే రాబోయే కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తీరప్రాంతాల్లో కొన్ని దుర్గాలను, బలమైన నావికా శక్తిని ఏర్పాటు చేశాడు. ఆర్‌ఎస్‌ఎస్ ద్వితీయ సర్‌సంఘచాలక్ పరమపూజనీయ శ్రీ గురూజీ శివాజీ విషయంలో ‘‘శివాజీ అనగానే ఎప్పుడూ గుర్రంపై యుద్ధానికి సన్నద్ధమై ఉన్నట్లుగా మన మనస్సులలో ముద్రాంకింతమై ఉంది. దానికి కారణం ఆయన విగ్రహాలను అలాగే ఏర్పాటు చేసు కున్నాం. భూతల యుద్ధాలలో గొప్ప విజయాలు సాధించి ఉండవచ్చు. కాని సముద్రపు సరిహద్దులలో అనగా జలమార్గాలలో రక్షణ వ్యవస్థను పటిష్టపరిచే విధంగా పునాదులు వేసిన దూరదృష్టి కలిగిన శివాజీని ఎలా దర్శించాలంటే యుద్ధ నౌకపై వేలు చూపుతూ నిలబడిన శివాజీని జలశక్తి నిర్మాతగా మన హృదయాలలో మెదిలేటట్లు చేసుకోవాలి’’ అని కోరుకునేవారు. ఈ విషయం తలచుకుంటే శరీరం రోమాంచితమవుతుంది. ఎందుకంటే ఆ దినాలలోనే డచ్చివారు, ఫ్రెంచివారు,మొగలాయిలు, ఆంగ్లేయులు అందరూ హిందూమహాసముద్రంగుండా మన దేశం లోకి ప్రవేశించినవారే. హిందూ నావికా శక్తి అనుమతిలేకుండా ఏ విదేశీయుడు హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించడానికి సాహసం చేయ లేనంత బలంగా ‘జలశక్తి’ని శివాజీ తయారుచేశాడు.
శివాజీ కేవలం పాలకుడే కాదు, సామాజిక కార్యకర్త కూడా. సమాజం గురించి ఆలోచించేవాడు. హిందువు ఇతర మతాలలోకి మారడానికి అనేక కారణాలు ఉండవచ్చు. పొరపాటుగా గాని, మోహవశంతో గాని, బలవంతాన గాని లేదా ఆశకు గురై గాని స్వధర్మాన్ని వీడి ఉండవచ్చు. ఈ విధంగా వెళ్లిన వారిని తిరిగి వెనకకు తెచ్చే ప్రయత్నం ఆ రోజులలో లేదు. వెళ్లినవాడు అటువైపే. 350 సం.ల క్రితం శివాజీ శుద్ధీకరణ గురించి ఆలోచించి స్వధర్మంలో జరుగుతున్న నష్టాన్ని ఆపాలని సంకల్పించి హిందూధర్మం వదలివెళ్లిన వారిని వెనక్కి రప్పించారు. ఔరంగజేబ్ సైన్యంలో ఉన్న నేతాజీ పాల్కర్‌ను పశ్చాత్తాప పడేటట్లు చేసి స్వధర్మంలోకి రప్పించాడు. నింబాల్కర్ కూడా స్త్రీ వ్యామోహంలో ఇస్లాంను స్వీకరిస్తే అతనిని కూడా వెనుకకు తెచ్చాడు. నింబాల్కర్ ఎంతో పశ్చాత్తాపంతో స్వధర్మంలోకి రాగా ఆయనను హిందూ సమాజం సగర్వంగా స్వీకరించా లని తన బంధువర్గం నుండి అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపించారు. ఈ విధంగా సమాజంలో జరిగిన నష్టాన్ని దూరదృష్టితో గమనించి నివారణో పాయాన్ని చేపట్టి, సామాజానికి ఒక దృష్టిని ఇచ్చిన గొప్ప ద్రష్ట ఛత్రపతి శివాజీ.
ప్రపంచం గుర్తించిన ఛత్రపతి శివాజీ మహా రాజ్‌కు నివాళిగా 2022లో భారత ప్రభుత్వం ఐఎన్‌ఎస్ విక్రాంత్ నేవీకి కొత్త పతాకాన్ని ‘నిషాన్’ పేరుతో ఏర్పాటుచేయడం మనందరికి గర్వకారణం.
(భారతీయ మజ్దూర్ సంఘ్ సంస్థాపకులు దత్తోపంత్ ఠేంగ్డీ ఉపన్యాసాల నుండి)




