
సృష్టిలో తొలుత జన్మించింది జలమని చెబుతారు. బ్రహ్మదేవుడు మొదట సృష్టించింది నీరే (శాకున్తలం). ‘ఎప్పుడు ఎడతెగక పారే ఏరు’ ఉన్నచోటనే కాపురం పెట్టమన్నాడు సుమతీ శతక కర్త బద్దెన. నది ఉన్న చోటే నాగరికత ఉంటుంది. పురాణాల ప్రకారం నదీనదాలు దేవతా స్వరూపాలు. జలాశయ పరిసరాలే జనవాసానికి యోగ్యాలు. నీరు దాహం తీర్చడానికే కాదు మనిషి నిత్య నైమిత్తి కాలన్నిటికీ ఆధార•ం. ఆ నీటిని వడి•సి పట్టు కోవడానికి అపర భగీరథులు చోళరాజు కరికాలుడు, సర్ ఆర్ధర్ కాటన్, రాయన్ హెన్రీజాక్, మరెందరో ప్రయత్నించారు.
భగీరధుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. కపిల మహర్షి శాపం వలన బూడిదైన తన పూర్వికుల (సగర పుత్రుల) సద్గతులకు కల్పించడానికి వేల సంవత్సరాల తపస్సుతో స్వర్గంలోని గంగానదిని భూమికి రప్పించి, పాతాళానికి ప్రవహింప చేసిన మహోన్నతుడు.
సగర చక్రవర్తి అశ్వమేధయాగం చేస్తూండగా, ఇంద్రుడు ఆయన గుర్రాన్ని దొంగిలించి కపిల మహర్షి ఆశ్రమంలో దాచిపెడతాడు. సగరుడి 60 వేలమంది కుమారులు గుర్రం కోసం వెతుకు తూండగా, కపిల మహర్షి ఆశ్రమంలో అది కనిపించింది. ఆయనే దానిని బంధించాడన్న అపోహతో ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించి, .ఆ మహర్షి శాపంతో భస్మమైపోతారు. తమ పూర్వికులకు ఉత్తమగతులు కలగాలంటే గంగానదీ జలాలు వారి బూడిదై పడాలి. భగీరథుడు రాజ్యాన్ని వదిలి గంగను భూమికి తీసుకురావడానికి కఠోర తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన గంగ భువికి రావడానికి ఒప్పుకుంటుంది. అయితే, తన వేగాన్ని భూమి తట్టుకోలేదు కనుక శివుడిని ప్రసన్నం చేసుకోవాలని చెబుతుంది. భగీరథుడు తపస్సుతో శివుని మెప్పిస్తాడు. శివుడు గంగను తన జటాజూటంలో బంధించి చిన్నపాయగా భూమిపైకి వదులు తాడు.అలా జాలువారిన గంగ భగీరధుని వెనుక పరుగులు తీస్తూ దారిలో జాహ్న మహర్షి ఆశ్రమాన్ని ముంచేస్తుంది. కోపించిన ఆయన గంగను తాగేస్తాడు. భగీరథుడు మళ్లీ తపస్సు చేసి వేడుకోగా మహర్షి గంగను చెవిలోంచి వదులుతాడు. అందుకే గంగకు ‘జాహ్నవి’ అనే పేరు వచ్చింది. అసాధ్యమైన పనిని పట్టుదలతో సాధించడాన్ని ‘భగీరథ ప్రయత్నం’ అంటారు. సమాజంలో అటువంటి భగీరథలు ఎందరో తారసపడతారు.
‘నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు, ధార్మికుని దానాలు, కవిరాజు కావ్యాలూ క•ర్షకా! నీ కర్రు కదిలినన్నాళ్లే’ (కాళోజీ). మన సమాజంలో వ్యవసాయమొక అంతర్భాగం. అందువలన పూర్వకవులు తమ కావ్యాలలో కృషి ప్రపంచాన్ని కొంత ప్రదర్శించారు. ఆనాడు మెరక ప్రాంతంలోని వ్యవసాయం బావులపై ఆధారపడి ఉండేది. దిగుడు బావుల నుండి నీటిని ఏతాములతోను, మోటల తోనూ తోడేవారు. సింహాసన ద్వాత్రింశికలో గోపరాజు ‘‘ఈ యెడ గర్మభూమి’’ (6-70) అనే పద్యంలో ఇలా ప్రస్తావించాడు. ఆ రోజులలో చెంచులు కొండజాతులవారు, సంచార జాతులవారు అడవులలోని చెట్లను నరికి, ఆ ప్రాంతాన్ని చదునుచేసి, వ్యవసాయం చేసేవారు. దానినే పోడు వ్యవసాయమని అంటారు. ఈ విషయం భోజరాజీయంలో కూడా ఉంది.

కాళిదాసు మహాకవి రాసిన మేఘ సందేశంలో ‘‘ఆషాఢ•స్య ప్రథ•మ దివాసే’’ అన్న శ్లోకంలో మేఘుడు కావ్యంలో ప్రవేశిస్తాడు. ఏ సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి మృగశిర నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు దట్టంగా మబ్బులు పడతాయో, ఆ యేడు తొలికారు పంటలు బాగా పండుతాయని దోనయామాత్యుడు ‘‘సస్యానందం’’లో ‘‘అమరగురుడు జెప్పే నాషాఢ మాసంబు’’ (2-46) అనే పద్యంలో వివరించాడు. ఆధునిక కాలంలో శాస్త్రవిజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మానవుడు ప్రకృతినే శాసించే స్థాయికి ఎదిగాడు.
పదార్థాన్ని ప్రసాదంగా మార్చాలన్నా, పచనం చేసి ఆహారంగా మార్చాలన్నా నీటితోనే పని. ఆఖరికి తులసి తీర్థం గొంతుదిగాలన్నా నీరే సాయపడు తుంది. మండిపోయే ఎండలకు మనిషి గొంతు ఎండిపోతుంది. బీటలు వారిన నేల తల్లి నీటిచుక్క కోసం ఎదురు చూస్తుంది. ‘‘వర్షమనే ప్రియుడు భూకాంత దేహంపై వేసే తీపి గాయాలే ఆ చినుకులు’’ అన్నారు పోతన. అంటే మనిషి ఆకలి దప్పికలు రెంటికీ నీటి చుక్కే దిక్కు అవుతుంది. నీటి బొట్టును వృథాచేసే ప్రతీ మనిషి ఈ సత్యాన్ని గుర్తుంచుకోవాలి.
భూకాంత భూమాతయ్యే క్రమంలో పురిటి నొప్పుల వేళ మంత్రసానుల్లా వ్యవహరించేది రైతన్నలు. తన స్తన్యంతో జీవుల ఆకలి తీర్చాలన్నది నేలతల్లి ఆరాటం. సేద్యంతో బీడు భూములను సారవంతం చేయాలన్నది రైతన్నల పోరాటం. వారిద్దరిది అన్యోన్య అనుబంధం. వ్యవసాయం రైతులకు ఉద్యోగం కాదు..ఊపిరి. ‘‘పుడమి ఎదురు చూస్తుంది – పదికుల తొక్కుడు కోసం… పొలం ఎదురు చూస్తుంది… దుక్కి దున్నడం కోసం’ అంటారు శేషేంద్ర. నేలతల్లి – రత్నగర్భ. రైతన్న పుణ్యదర్భ..ఆ సేద్యం యజ్ఞ ప్రసాదమే అన్నం. అదిదై••వ స్వరూపం. అందుకే మహాకవి ‘‘పొలాలనన్నీ హలాలదున్ని..విరామ మెరుగక పరిశ్రమించే, బలం ధరిత్రికి బలికావించే, కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మ జలానికి, ధర్మ జలానికి, ఖరీదు లేదోయ్’’ అంటాడు.
తమిళనాడులోని తంజావూరు జిల్లాలో కావేరి నదిపై సా.శ. 1వ శతాబ్దంలో కరికాలచోళుడు ఆనకట్ట (కల్లనైడామ్)నిర్మించాడు.దీని ద్వారా డెల్టా జిల్లాలకు నీటిని మళ్లించడంతో నీటి పారుదల పెరిగి ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యింది. ఈ ఆనకట్టకు తిరిగి 19వ శతాబ్దంలో బ్రిటిష్ రూపకల్పన చేశారు. ప్రపంచంలోని అతి పురాతన నీటి మళ్లింపు లేదా నీటి నియంత్రణ నిర్మాణాల్లో ఒకటిగా దీనిని పరిగణిస్తారు ఈ డ్యామ్ 5.4 మీటర్ల ఎత్తు 1079 మీటర్ల పొడవు, 15.4 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి నిలువ వుంటుంది. కరికాల చోళరాజు సింహళంపై దండెత్తి 12 వేల మంది సింహళీలను బందీలుగా పట్టుకొని వారితో ఆనకట్ట పనులు పూర్తి చేసినట్లు తెలుస్తున్నది. అయితే ఈ ఆనటకట్టను తెలుగు చోళరాజు ఎరికల ముత్తురాజు పుణ్య కుమార, త్రిలోచన పల్లవ సహాయంతో కరికాలుడు నిర్మించాడని 7వ శతాబ్దం నాటి మల్లేపాడు శాసనాల ప్రకారం తెలుస్తోంది.1804లో కాల్డ్‌వెల్ అనే సైనిక ఇంజనీరు 69 సెంటీ మీటర్లు (27 అంగుళాలు)ఎత్తు పెంచారు. సర్ ఆర్థర్ కాటన్ దీనిని నమూనాగా తీసుకుని గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించాడు.
‘నిత్య గోదావరీ స్నాన పుణ్య దోయా మహామతిః
స్వరామ్యాంగ్ల దేశీయం కాటనుం, తం భగీరథం’
(నిత్యమూ గోదావరి స్నానం చేయుట నుండి వచ్చే పుణ్యమును ప్రసాదించిన వాడున్నూ, మహాజ్ఞాని. అపర భగీరథుడున్నూ ఆంగ్లేయుడున్నూ అయిన కాటన్ దొరను నేను స్మరిస్తున్నాను).
సా.శ .1803 మే 15వ తారీఖున సర్ ఆర్ధర్ కాటన్ జన్మించారు. ఈయన హెన్రీ కావలీ కాటన్ పదవ కుమారుడు. వీరి కుటుంబంలో ఆరుగురు సోదరులు వివిధ యుద్ధ రంగాలలో మంచి గుర్తింపు పొందిన వారే. కాటన్‌కు కూడా యుద్ధ అనుభవం వుంది, అయితే ఆయన నీటి పారుదల రంగంలో ఎక్కువగా కృషి చేసి అపర భగీరథుడుగా కీర్తిపొందాడు.
కాటన్ నర్సరీ క్లాసులో ఉండగా, వర్షం తగ్గాక కూడా ఇంటికి వచ్చేవాడు కాదట. వాళ్ల అమ్మ ‘ఎందుకు ఆలస్యంగా వచ్చావ’ని అడిగితే ‘‘కాలువలు చూస్తున్నాను’’ అన్నాడట. దారిలో వాన నీళ్లు ప్రవాహాన్ని పుల్లలతో తీస్తూ దారులు కలుపుతూ చక్కటి కాలువ ప్రణాళికా వ్యవస్థను తయారు చేసేవాడని ఆయన అన్నలు గుర్తుచేసుకునేవారు.
కాటన్ తన 15వ ఏట భారత్‌కు వచ్చి వెళ్లే సైనిక విద్యార్థిగా ఎడిస్ కొంటితో కలిసి సైనిక కళాశాలలో చేరాడు. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులకు, ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చేది. తరువాత తన 18వ ఏట(1821 మే బయలుదేరి) సెప్టెంబర్‌కు భారత్‌కు చేరాడు. మద్రాసు ప్రెసిడెన్సీ చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి అతన్ని కేటాయించారు.1822 మేలో కెప్టెన్ పుట్లర్జన్ దగ్గర సహాయకునిగా వేసి, ‘పాంటన్ పాస్’’ సర్వే పని కాటన్‌కు అప్పచెప్పారు. అక్కడ చాలా చాకచక్యంగా పనిచేశాడు. కాటన్ 1824లో సైన్యంలో చేరి బర్మా యుద్ధ్దంలో ఇంజనీర్‌గా పనిచేశారు. ‘‘మేరిగ్వే తనాయీ’’ కాకియాస్ కంటే ‘‘రంగూన్‌లను ఆక్రమించాడు.
1830లో కాటన్‌కు పాంటస్ పర్యవేక్షణ బాధ్యతను తిరిగి అప్పగించారు. తరువాత ‘కావేరీ నదీ’ పరీవాహ ప్రాంతం పనులను అప్పగించగా, విజయవంతంగా పూర్తి చేసాడు. గోదావరీ నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించడానికి సంకల్పిం చింది ప్రభుత్వం.
కరవులు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న రోజులవి. 1770లో వచ్చిన బెంగాల్ కరవు విపరీత జన నష్టానికి కారణా లయ్యాయి. మనుష్యులు,పశువుల• పరిశుభ్రమయిన నీళ్లు లేక చనిపోయాయి. ఆనకట్టలు కట్టాల్సిన అవసరం గురించి కాటన్ కంపెనీకి రాశారు. 1847లో ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణ పనులు ప్రారంభించారు.పని చేయించేందుకు తగిన వ్యక్తి కోసం అన్వేషిస్తుండగా, ‘వీణం వీరన్న’ సరైన వాడని నిర్ధారించారు. అలా 1852 ఏప్రిల్ నెలలో ఆనకట్ట పనిని పూర్తి చేయగలిగారు. దానికి అయిన ఖర్చు 23,55,600 రూపాయలు సుమారుగా 7,94,829 ఎకరాలు భూమి సాగులోనికి వచ్చింది.
రయాన్స్ వెల్ ఫౌండేషన్
‘ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది’ నానుడి. ఒక సత్‌పురుషుని మంచిమాట ప్రపంచాన్నే మార్చేస్తుందన్నది నేటి మాట. కెనడాలోని ఒంటారియో నగరంలో ‘‘రాయన్ హెన్రీ జాక్’’ ఆరు సంవత్సరాల బాలుడు. రోజూ క్రమం తప్పకుండా స్కూలుకు వెళ్తూ టీచర్ చెప్పే పాఠాలు శ్రద్దగా వింటున్నాడు. ఒకరోజు తన టీచర్ ఆఫ్రికా ఖండం లోని దేశాలు, వారి సమస్యల గురించి పాఠం చెప్పుతూ, ఆఫ్రికాలో ఉగాండా దేశంలో మీ వయస్సు పిల్లలు తాగునీటిని కొన్ని కిలోమీటర్ల దూరం నుండి తెచ్చుకుంటారనీ, ఆ దొరికే నీరు మురికిదేనని, ఆ నీటిని తాగటం వలన చిన్నారులు జబ్బు పడుతు న్నారని,కొన్ని రోజుల్లోనే మరణిస్తున్నారనీ,70 డాలర్లు పెడితే నుయ్యి తయారవుతుంది కాని వారి దగ్గర ఆ పైకం లేక వారు మురికి నీరు తాగి మరణించారని వివరించారు. ఆ మాట రాయన్ హెన్రీ జాక్‌ను స్పందింపచేసింది.
రాయన్ ఇంటికి వెళ్లి 70 డాలర్లు కావాలని వాళ్ల అమ్మనడిగాడట. అది పెద్ద మొత్తమే అంత డబ్బు నీకెందుకు అని అడిగితే చెప్పలేదట. సరే నీకొక షరతు రోజు ఇంట్లో పనిచేయి నీకు ఆ డబ్బు ఇస్తామన్నదట. అలాగే కష్టపడి 70 డాలర్లు పోగు చేసి తీసుకువచ్చి టీచర్‌కు ఇచ్చి,

‘‘ఉగాండాలో బావి త్రవ్వించమన్నాడట’’, ఆశ్చర్యపోయిన మేడమ్ ఓ స్వచ్ఛంద సంస్థను సంప్రదిస్తే.. నుయ్యి తవ్వాలంటే 2000 డాలర్లు ఖర్చు అవుతుంది అని వారు చెప్పారట. రాయన్ నిరుత్సాహపడకుండా మళ్లీ కష్టపడి పనిచేసి 2000 డాలర్లు కూడబెట్టి టీచర్‌కు ఇచ్చాడు. ఆమె స్వచ్ఛంద సంస్థ ద్వారా అంగోలా ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఓ నుయ్యి తవ్వించారు. ఈ విషయం తెలిసి ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఆ అబ్బాయికి విరాళాలు పంపారు. దానితో 2001లో రాయన్ తన పదవ ఏట ‘‘రాయన్ వెల్ ఫౌండేషన్’’ ప్రారంభించాడు. ఈ ఫౌండేషన్ ఇప్పటివరకు 1200 పైగా బావులను తవ్వించి పదహారు లక్షల మందికి మంచినీరు అందిస్తున్నారు. అలాగే 1834 తాగునీటి ప్రాజెక్టులు 1323 మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చాడు. ఇప్పటికి రాయన్‌కు 36 సంవత్సరాల వయస్సు వచ్చింది. అతడు పలుదేశాలలో పర్యటించి ప్రసంగిస్తూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నాడు. ఇతడు నిజమైన భగీరథుడు.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు





