News

భారతీయతలో ఆధునిక సవాళ్లకు పరిష్కారాలు : భాగవత్

34views
సనాతన ధర్మం భారత దేశ ఆత్మ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అభివర్ణించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లకు భారతీయ నాగరికతా దృక్పథమే ప్రపంచానికి శాశ్వతమైన పరిష్కారాలను అందిస్తుందని పునరుద్ఘాటించారు. ఆరెస్సెస్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని, తిరువనంతపురంలో మేధావుల సమావేశంలో మోహన్ భాగవత్ ప్రసంగించారు.
భారత దేశపు స్వాతంత్ర పటిమను తన ప్రసంగంలో ఉటంకిస్తూ.. సుభాష్ చంద్రబోస్, వీర సావర్కర్ లాంటి వారిని స్మరించుకుంటూ, ఆరెస్సెస్ వ్యవస్థాపకులు హెడ్గేవార్ దార్శనికతను ప్రముఖంగా ప్రస్తావించారు.డాక్టర్ హెడ్గేవార్ చిన్న వయస్సు నుంచే దేశం పట్ల అసాధారణమైన నిబద్ధతను ప్రదర్శించారని, వ్యక్తిగత కష్టాలను అధిగమించి, సామాజిక సేవకు, జాతీయ చైతన్యానికి తనను తాను అంకితం చేసుకున్నారని తెలిపారు.
సనాతన ధర్మం మరియు భారతీయ అస్తిత్వం గురించి ప్రస్తావిస్తూ, పూజా విధానాలలో భిన్నతలు ఉన్నప్పటికీ, ఉమ్మడి నాగరికతా విలువల ద్వారా భారతదేశం చారిత్రకంగా ఐక్యంగా నిలుస్తోందన్నారు. గురునానక్ దేవ్ వివరించిన ‘‘హిందుస్తాన్’’ భావనను ఈ సందర్భంగా మోహన్ భాగవత్ ప్రస్తావించారు. మాజాన్ని ఏకం చేసే ఐక్యతను గుర్తిస్తూనే, వైవిధ్యాన్ని గౌరవించాలని సనాతన ధర్మం బోధిస్తుందని ఆయన నొక్కి చెప్పారు.
హిందుత్వం అనేది సామాజిక ఐక్యతకు సంబంధించిన ఒక శక్తి అని, అది ‘వసుధైవ కుటుంబకం’ (ప్రపంచమే ఒక కుటుంబం) అనే ఆదర్శాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.సమకాలీన ప్రపంచ సవాళ్లను ప్రస్తావిస్తూ, ప్రస్తుత అభివృద్ధి నమూనాలు అంతకంతకూ పరిమితులను ఎదుర్కొంటున్నాయని ఆయన గమనించారు. భారతీయ ఆలోచనా విధానం, అభివృద్ధిని ప్రకృతితో సమన్వయం చేసే సమతుల్య మార్గాన్ని అందిస్తుందని, ఓ ప్రత్యామ్నాయాన్ని కూడా అందిస్తుందన్నారు. ప్రస్తుతం ప్రపంచం నాగరికతాపరమైన ఇబ్బందులను ఎదుర్కుంటోందని, అయితే ప్రపంచానికి దిశానిర్దేశం చేసేందుకు భారత్ సిద్ధం కావాలని సూచించారు.
ప్రస్తుతం ప్రపంచంలో భౌతికవాదం మితిమీరిపోయిందని, అదుపులేని ఆశలు, దురాశలు… ఇలా ఆధునికంగా సవాళ్లు వస్తున్నాయని, దీనికి పరిష్కారాలు భారతీయ ఆలోచనా విధానంలోనే వున్నాయన్నారు. ఈ బాధ్యతను నెరవేర్చడానికి, దేశం మరియు మానవాళి సంక్షేమానికి అంకితమైన, సంఘటితమైన, చైతన్యవంతమైన హిందూ సమాజం అవసరమని ఆయన పిలుపునిచ్చారు.