News

ధర్మస్థళ కేసులో సంచలనం.. ప్రకాష్ రాజ్ పేరు చెప్పిన చిన్నయ్య!

21views

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన చిన్నయ్య జూన్‌ 11న కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ పేరును ప్రస్తావించారు.

ధర్మస్థళ కేసులో తాము చెప్పినట్లుగా వాంగ్మూలాలు ఇవ్వాలని పలువురు తనను ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. వారిలో ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్ ఉన్నారని ఆరోపించారు. గిరీష్‌ మట్టన్నవర‌ ద్వారా ప్రకాష్‌ రాజ్‌ తనతో తమిళంలో మాట్లాడి, జూన్‌ 29న కలుస్తానని చెప్పారని చిన్నయ్య పేర్కొన్నారు.

పిటిషన్‌లో ధర్మస్థళపై ప్రచారం కోసం రూ.200 కోట్లు కేటాయించారని ఆరోపించారు. మహేష్‌ శెట్టి తిమరోడి తనకు సహకరిస్తే రూ.50 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని చిన్నయ్య పేర్కొన్నారు. అలాగే, ఈ కుట్రకు కావలసిన నిధులు కేరళ నుంచి వచ్చాయని, చిత్రదుర్గకు చెందిన రామ నాగరాజ్‌ కూడా ఆర్థిక సహాయం అందించారని ఆరోపించారు.

చిన్నయ్య తన భార్య ఖాతాకు జరిగిన బ్యాంకు ట్రాన్సాక్షన్లు, నగదు చెల్లింపుల వివరాలను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఈ కుట్రకు భాగస్వాములైన మహేష్‌ శెట్టి తిమరోడి, గిరీష్‌ మట్టన్నవర‌, విఠల్‌ గౌడ, జయంత్‌ అని ఆయన ఆరోపించారు. వీరి పేర్లు వెల్లడించినప్పటికీ సిట్‌ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని చిన్నయ్య ఫిర్యాదు చేశారు. చిన్నయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు స్వీకరించింది. ధర్మస్థళ కేసు వివరాలు కోరింది. తదుపరి కేసు విచారణను జూన్‌ 29కి వాయిదా వేసింది.