
కుటుంబ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే గృహిణుల సేవలను దేశ నిర్మాణంలో కీలక భాగంగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక వ్యాఖ్యలు చేసింది. మోటారు వాహన ప్రమాదాల్లో గృహిణి మరణించిన సందర్భాల్లో, ఆమె అందించే గృహ నిర్వహణ మరియు సంరక్షణ సేవల నష్టాన్ని ప్రత్యేకంగా పరిగణించి అదనపు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
జస్టిస్ సంజయ్ కరోల్ మరియు జస్టిస్ ఎన్.కె. సింగ్ల ధర్మాసనం, రోడ్డు ప్రమాదంలో భార్యను కోల్పోయిన భర్తకు అదనపు పరిహారం మంజూరు చేస్తూ ఈ తీర్పును వెలువరించింది. గృహిణుల సేవలు కేవలం ఇంటి పనులకు పరిమితం కావని, వారు కుటుంబం, సమాజం, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే “దేశ నిర్మాతలు” అని కోర్టు స్పష్టం చేసింది.
తీర్పులో ధర్మాసనం పేర్కొంటూ, “వ్యక్తి మరియు దేశ అభివృద్ధిలో గృహిణుల పాత్ర అపారమైనది. పిల్లలకు తొలి గురువులుగా, కుటుంబ విలువలను తదుపరి తరాలకు అందించే వారిగా వారు సమాజ నిర్మాణంలో కీలక బాధ్యత నిర్వహిస్తున్నారు” అని వ్యాఖ్యానించింది.గృహిణులు చేసే సేవలకు ఆర్థిక విలువ కట్టడం కష్టమైనప్పటికీ, వాటి ప్రాముఖ్యతను గుర్తిస్తూ “గృహ సంరక్షణ నష్టం” (Loss of Homemaker Services) పేరుతో ప్రత్యేక పరిహారానికి మార్గం సుగమం చేసింది. ఇందుకోసం నెలకు ₹30,000 విలువను ప్రామాణికంగా పరిగణించాలని కోర్టు పేర్కొంది.
సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం, మహిళల సేవలు కేవలం సంతానోత్పత్తికి మాత్రమే పరిమితం కావు. భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే మానవ వనరుల సృష్టిలో వారు ప్రధాన పాత్ర పోషిస్తారు. దేశ ఆర్థికాభివృద్ధి, సామాజిక స్థిరత్వం వంటి అంశాలు కూడా ఈ మానవ వనరులపైనే ఆధారపడి ఉంటాయని కోర్టు పేర్కొంది.
అంతేకాక, మహిళలు చేసే వేతనం లేని గృహ మరియు సంరక్షణ పనులు భారత జీడీపీకి 15–17 శాతం వరకు దోహదపడుతున్నాయని వివిధ అధ్యయనాలను ప్రస్తావించింది. అయినప్పటికీ ఆ సేవలకు తగిన గుర్తింపు లేదా పారితోషికం లభించడం లేదని విచారం వ్యక్తం చేసింది.
‘ఆధారపడిన వ్యక్తులు’ అనే భావనను తిరస్కరించిన కోర్టు
గృహిణులు సంపాదించే సభ్యులపై ఆధారపడినవారనే సాంప్రదాయ భావనను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. కుటుంబ వ్యవస్థ మొత్తం గృహిణి నిర్వహణపైనే ఆధారపడి ఉంటే, ఆమెను ‘ఆధారపడిన వ్యక్తి’గా పేర్కొనడం తగదని స్పష్టం చేసింది.
గృహ సంరక్షణ నష్టానికి నిర్ణయించే పరిహారం, ఇప్పటికే అమల్లో ఉన్న ఇతర పరిహారాలకన్నా అదనంగా ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఈ మొత్తాన్ని ప్రతి మూడు సంవత్సరాలకు 10 శాతం చొప్పున పెంచాలని సూచించింది.
హిందూ కుటుంబ వ్యవస్థ విలువలకు న్యాయ గుర్తింపు
ఈ తీర్పు కుటుంబ వ్యవస్థలో మహిళల, ముఖ్యంగా గృహిణుల పాత్రకు న్యాయపరమైన గుర్తింపుగా భావిస్తున్నారు. కుటుంబ సంరక్షణ, పిల్లల పెంపకం, విలువల బోధన వంటి బాధ్యతలు దేశ భవిష్యత్తును నిర్మించే మహత్తర సేవలని సుప్రీంకోర్టు గుర్తించడం విశేషంగా చర్చనీయాంశమైంది.
“గృహిణులు కేవలం ఇంటిని నడిపేవారు కాదు; వారు కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని నిర్మించే శక్తి”అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మహిళల సేవలకు లభించిన అరుదైన గౌరవంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.





