News

ద్వారకా తిరుమలలో ఘనంగా యోగాంధ్ర–2026 కార్యక్రమం

2views

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని అనివీటి క్రొత్త కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగాంధ్ర-2026 కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మికత మరియు ఆరోగ్య చైతన్యాల సమ్మేళనంగా విజయవంతంగా సాగింది. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ పాల్గొని, 10 మంది మాస్టర్ ట్రైనర్లు మరియు సుమారు 650 మంది యోగా సాధకులతో కలిసి యోగా ఆసనాలు అభ్యసించారు.

కార్యక్రమానికి ముందు జ్యోతి ప్రజ్వలన నిర్వహించగా, వేదపండితులు వేద మంత్రోచ్ఛారణలు, ప్రార్థనా గీతాలతో కార్యక్రమానికి ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆశీస్సులతో యోగాంధ్ర కార్యక్రమం ప్రశాంతంగా, భక్తి భావంతో విజయవంతంగా నిర్వహించబడిందని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాల నిర్వహణ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో పాటు ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు.

ఏలూరు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారతీయ సంస్కృతికి ప్రతీక అయిన యోగాను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు.

యోగం కేవలం ఒకరోజు చేసే కార్యక్రమం కాదని, అది జీవిత విధానంగా మారాలని సూచించారు. ప్రతిరోజూ కనీసం అరగంట సమయం కేటాయించి యోగా సాధన చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఒత్తిడి నియంత్రణలో ఉండి వృత్తి జీవితంలోనూ మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్పారు.

జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణలో భాగంగా నేడు ద్వారకాతిరుమలలో కార్యక్రమం నిర్వహించామని, ఈ నెల 19న పట్టిసీమలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన యోగాన్ని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. యోగా కేవలం ఒకరోజు కార్యక్రమం కాదని, దానిని నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ కనీసం అరగంట సమయం యోగాభ్యాసానికి కేటాయిస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఒత్తిడి నియంత్రణ, ఏకాగ్రత, జీవన నాణ్యత పెరుగుతాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో ద్వారకాతిరుమల దేవస్థానం అధికారులు, ఉద్యోగులు, వేదపాఠశాల విద్యార్థులు, స్థానిక పాఠశాలల విద్యార్థులు, భక్తులు, యాత్రికులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.