
నెల్లూరులో ఒక యువకుడికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. అయితే జిల్లా కలెక్టర్ సహా వైద్యాధికారులు ఎవరు కూడా ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోతుండడంతో జిల్లావాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోనే తొలి కరోనా కేసు నెల్లూరులో నమోదైందనే సమాచారం బుధవారం ఉదయం నుండి ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు జిల్లా వాసులకు నిద్రపట్టనివ్వడం లేదు. అధికారులెవరూ స్పష్టతనివ్వనప్పటికీ బుధవారం ఉదయం నుండి నగరంలో చోటుచేసుకున్న వరుస పరిణామాలు కరోనా వైరస్ పాజిటివ్‌గా నివేదిక వచ్చిందనే భావన ప్రజల్లో కలిగిస్తోంది. తొలుత తిరుపతి స్విమ్స్‌లో ప్రాథమిక నివేదిక వచ్చిందని, అందులో ప్రాథమికంగా వ్యాధి లక్షణాలు కనిపించినట్లు సమాచారం. దీంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. మంగళవారం అర్ధరాత్రి జిల్లా కలెక్టర్ అందుబాటులో ఉన్న వైద్యాధికారులు, సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఆదేశాల మేరకు వైరస్ బారిన పడిన యువకుడు నగరంలో నివసించే 42,47 డివిజన్ల పరిధిలోని చిన్నబజార్, సంతపేట, గిడ్డంగి వీధి, మండపాల వీధి, కామాటివీధి తదితర ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుండి ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఇతర వైద్య సిబ్బందితో ఉన్న బృందాలు ఇంటింటికి వెళ్లి సర్వేలు చేస్తూ, ఇంట్లోని వారి అనారోగ్యం గురించి వాకబు చేస్తున్నారు. బాధిత యువకుడి కుటుంబసభ్యులను కూడా ప్రత్యేక వార్డుకు తరలించినట్లు సమాచారం. అయితే కరోనా వ్యాప్తిపై జిల్లా అధికారులు ఎవరూ నోరు మెదపడం లేదు. రాష్టస్థ్రాయి అధికారులే ఈ విషయంలో ప్రకటన చేయాల్సి ఉంటుందనే ముక్తసరి సమాధానాన్ని కొందరు అధికారులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





