News

అఫ్గాన్‌లో పాక్‌ దాడులపై ఐరాసలో భారత్‌ నిలదీత

4views

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. ఉగ్రవాద నిరోధక చర్య ముసుగులో అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్‌ చేపట్టిన సైనిక చర్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. వైమానిక దాడులతో భారీగా అమాయక ప్రజలను బలిగొనడాన్ని తప్పుబట్టింది.

అఫ్గానిస్థాన్‌లోని ప్రస్తుత పరిస్థితులపై జరిగిన ఈ సమావేశంలో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ మాట్లాడుతూ.. ‘‘ఒక మారణహోమాన్ని పాక్‌ సైనికచర్యగా చిత్రీకరిస్తోంది. పౌరులను చంపడం, గాయపరచడం.. పసిపిల్లలను అనాథలు చేయడాన్ని ఉగ్రవాద నిరోధక చర్యలు అంటారా? ఇలా చేస్తే దోషి నిర్దోషిగా మారిపోతాడా! ఓవైపు అంతర్జాతీయ చట్టాలను పాటించాలంటూనే పవిత్రమైన రంజాన్‌ మాసంలో అఫ్గాన్‌పై వైమానిక దాడులు చేశారు. ఇది పాక్‌ కపటత్వానికి నిదర్శనం’’ అని దుయ్యబట్టారు. ఈ అమానుష హింసాత్మక చర్యలు అఫ్గాన్‌ సార్వభౌమాధికారంపై బహిరంగ దాడి చేయడమేనని, ప్రాంతీయ శాంతి.. స్థిరత్వాలకు ముప్పని నిలదీశారు.

పాకిస్థాన్‌ ఇటీవల ప్రచారం చేస్తున్న ‘ఫిత్నా అల్‌ హిందుస్థాన్‌’ కథనాన్ని పర్వతనేని హరీశ్‌ తీవ్రంగా ఖండించారు. తమ భూభాగంలో పనిచేస్తున్న కొన్ని ఉగ్రవాద మూకలను భారత్‌ ప్రేరేపిస్తోందంటూ పాకిస్థాన్‌ చేస్తున్న ఈ ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు. పాక్‌లో తలెత్తిన బలోచిస్థాన్‌ అంతర్గత సాయుధ గుంపులను ‘ఫిత్నా అల్‌ హిందుస్థాన్‌’గా పేర్కొంటున్నారు. భారత్‌పై నిరంతరం వ్యతిరేక భావజాలాన్ని పెంపొందించేందుకు పాకిస్థాన్‌లో ఒక వ్యవస్థీకృత ప్రచార యంత్రాంగం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. ద్వేషాన్ని ఉత్పత్తి చేసే కర్మాగారంగా దీనిని అభివర్ణించారు. అంతర్గత వైఫల్యాలకు పొరుగు దేశాలను బాధ్యులుగా చూపించే ధోరణి పాక్‌లో చాలాకాలంగా కొనసాగుతోందని అన్నారు.

అఫ్గాన్‌కు అండగా ఉంటాం
అఫ్గానిస్థాన్‌లో గత అయిదేళ్లుగా రాజకీయ పరిస్థితులు మారాయని, ఐరాస ఆంక్షల విధానం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హరీశ్‌ కోరారు. గత కొన్ని దశాబ్దాలుగా యుద్ధాలు, అస్థిరత, మానవతా సంక్షోభాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అఫ్గాన్‌లో శాంతి, స్థిరత్వం, అభివృద్ధి నెలకొనేందుకు భారత్‌ నిరంతరం మద్దతు ఇస్తుందని చెప్పారు. యునిసెఫ్, అఫ్గాన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ వంటి సంస్థలతో కలిసి అఫ్గాన్‌ ప్రజల అవసరాలను తీర్చేందుకు భారత్‌ కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. పాక్‌ ప్రతినిధి అసీం ఇఫ్తికార్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. ఐరాస ప్రధాన కార్యదర్శి అఫ్గాన్‌ పరిస్థితులపై ఇటీవల వెలువరించిన నివేదిక ఆ దేశం ఎదుర్కొంటున్న బహుళ అంతర్గత సవాళ్ల బాధ్యతను బయటివారిపై నెట్టేస్తున్నట్లుగా ఉందన్నారు.