
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది కేవలం సంబరాలు జరుపుకునే సందర్భం కాదని, నూతన సంకల్పాన్ని తీసుకోవడానికి, దేశ నిర్మాణ కార్యం మరింత వేగిరం చేయడానికి ఉద్దేశించిన సంవత్సరం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ ఉద్బోధించారు.బిహార్ లోని ముంగేర్ లో ‘‘కార్యకర్త వికాస వర్గ’’ లో స్వయంసేవకులను ఉద్దేశించి, మోహన్ భాగవత్ మార్గనిర్దేశనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ప్రయోజనాలకే అంకితమైన, వ్యవస్థీకృతమైన, చైతన్యవంతమైన, దేశహితం పట్ల నిబద్ధత కలిగిన సమాజాన్ని నిర్మించడమే సంఘ్ లక్ష్యమని వివరించారు. ‘‘భారత్ మాతా కీ జై’’ అన్నది కేవలం నినాదం మాత్రమే కాదని, అది దేశం పట్ల అంకితభావానికి మరియు కర్తవ్యానికి ప్రతీక అని ఆయన అన్నారు.
1925 లో సంఘ్ స్థాపన జరిగిందని, అప్పటి నుంచి దేశ నిర్మాణానికి, వ్యక్తిత్వ నిర్మాణమే మూలాధారంగా నడుస్తోందని ప్రకటించారు. అయితే సంఘ శాఖ కేవలం శారీరక శిక్షణకే పరిమితం కాదని, అది క్రమ శిక్షణ, దేశభక్తి, సామాజిక సామరస్యం మరియు సేవా భావాలను పెంపొందించే ఒక మాధ్యమమని తెలిపారు.సంఘ్ గత 100 ఏళ్లుగా ఈ దిశగా నిరంతరం కృషి చేస్తోందని అన్నారు.





