
ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంగా సాగుతోందని, సేంద్రీయ ఉత్పత్తులతో మానవాళి ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. ప్రస్తుతం సేంద్రీయ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉందని, రైతులకు అధిక లాభాలు కూడా వస్తున్నాయని అన్నారు. తాడేపల్లిలోని ఎఎస్సార్ సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్నిమంత్రి సవిత సందర్శించారు.
ఈ సందర్బంగా ఆమె విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. ప్రకృతి సాగుతో పర్యావరణానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. రసాయన ఎరువుల వాడకంతో వ్యవసాయ దిగుబడి పెరగొచ్చునేమో కాని, వాటి వినియోగంతో క్యాన్సర్, ఇతర వ్యాధులు ప్రబలే ప్రమాదముందన్నారు. సేంద్రీయ ఉత్పత్తుల వినియోగంపై ప్రజల్లోనూ చైతన్య పెరుగుతోందన్నారు. సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్ లో అధిక డిమాండ్ ఉందని, వాటి వల్ల రైతులకు అధిక లాభాలు ఆర్జిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సేంద్రీయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంగా సాగుతోందని, రసాయన ఎరువులు, పురుగుల మందులు లేని సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. సేంద్రీయ సాగు చేస్తున్న ఎఎస్సార్ సేంద్రీయ వ్యవసాయ క్షేత్ర నిర్వాహకులను, రైతులను మంత్రి సవిత అభినందించారు.
అంతకుముందు .15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రంలో కలియ తిరిగారు. సేంద్రీయ పద్ధతులతో సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. సేంద్రీయ ఎరువుల తయారీని కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ క్షేత్రంలో సాగవుతున్న ఉత్పత్తులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి రైతులు తీసుకొస్తున్న సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ శాలను కూడా మంత్రి సందర్శించారు. ఆయా ఉత్పత్తులు ధరలు అడిగి తెలుసుకుని, మంత్రి సవిత కూడా కొనుగోలు చేశారు.





