News

Fact Check : RSS ఆఫీస్‌లో మారణాయుధాలంటూ వస్తున్న వార్తలు అవాస్తవం

35views

సోషల్ మీడియా విస్తృతి పెరిగిన నేటి కాలంలో ఒక వార్త లేదా సంఘటనకు సంబంధించిన దృశ్యాలను మార్చడం (Manipulate) లేదా తప్పుడు సందర్భాన్ని జోడించి వైరల్ చేయడం సర్వసాధారణంగా మారింది. తాజాగా, నాగ్‌పూర్‌లో ఒక పోలీస్ అధికారి మీడియాకు ఇచ్చిన బైట్‌ను వాడుకుంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యాలయంపై తప్పుడు ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన అసలు నిజాలను ఇక్కడ పరిశీలిద్దాం.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం
ఎడమ వైపు చిత్రంలో చూసినట్లయితే, “Bsp Huzurabad” అనే ఫేస్‌బుక్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో నాగ్‌పూర్‌కు చెందిన ఒక పోలీస్ అధికారి మాట్లాడుతున్న వీడియో స్క్రీన్‌షాట్‌ను జోడించి, దానిపై తెలుగులో “RSS కార్యాలయంలో మారణాయుధాలు, దేశవ్యాప్తంగా అల్లర్లకు కుట్ర!” అని రాశారు. ఆ పోస్ట్ వివరణలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో మారణాయుధాలు దొరికాయని, దేశాన్ని అల్లర్ల పాలు చేయడానికి ఈ సంస్థ సిద్ధమవుతోందని, దీనిని బ్యాన్ చేయాలని పోలీసులు కూడా కోరుకుంటున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
​అసలు నిజం ఏమిటి? (వాస్తవ విశ్లేషణ)

ఈ వైరల్ పోస్ట్‌లో ఉన్న పోలీస్ అధికారి వీడియో మరియు ఆ సంఘటనకు సంబంధించిన అసలు నిజం కుడి పైపు ఉన్న చిత్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రముఖ వార్తా సంస్థ IANS (@ians_india) అధికారికంగా ట్విట్టర్ (X) లో పోస్ట్ చేసిన అసలు వీడియో స్క్రీన్‌షాట్ పైన ఉంది. ఆయన ఏం చెప్పారో ఆ వీడియో కూడా ఇక్కడ చూడవచ్చు…

​నిజమైన సంఘటన వివరాలు..

ఎక్కడ జరిగింది?
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో గల ‘CA రోడ్, దోసర్ భవన్ చౌక్’ (Dosar Bhavan Chowk) పరిసర ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

పోలీసులు ఏం చెప్పారు?
అక్కడ నివసించే ‘లంజేవార్’ (Lanjewar) అనే కుటుంబం రోడ్డుపై కొన్ని తూటాలు (Cartridges) పడి ఉండటాన్ని గమనించి ఉదయం 9:30 – 9:45 ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందించింది.

లభ్యమైనవి ఏమిటి?
నాగ్‌పూర్ డిసిపి (DCP) రాహుల్ మద్నే తెలిపిన వివరాల ప్రకారం, పోలీసు బృందం ఆ ప్రాంతంలో వెతకగా వారికి దాదాపు 15 లైవ్ బుల్లెట్లు (15 Cartridges) లభ్యమయ్యాయి.

RSSతో సంబంధం ఉందా?
ఈ సంఘటనకు, ఆర్ఎస్ఎస్ (RSS) కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఒక బహిరంగ రహదారి (CA Road) సమీపంలో దొరికిన అనుమానాస్పద వస్తువుల గురించిన సమాచారం మాత్రమే.

​నాగ్‌పూర్‌లోని ఒక సాధారణ రోడ్డు పక్కన కొన్ని బుల్లెట్లు దొరికిన సంఘటనను, పోలీసులు మీడియాకు వివరించిన వీడియోను తీసుకుని… కొందరు కావాలనే ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో మారణాయుధాలు దొరికాయంటూ తప్పుడు రంగు పులిమారు. కాబట్టి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ పూర్తిగా అబద్ధం మరియు తప్పుదారి పట్టించేదిగా నిర్ధారించబడింది.