
-మన్మోహన్ వైద్య, ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా సమాజంతో విస్తృత సంబంధాలను ఏర్పర్చుకునేందుకు అనేక రకాల కార్యక్రమాలను సంఘ్ రూపకల్పన చేసింది. ఈ సందర్భంగా ‘‘పంచపరివర్తన్’’ అనే విషయాన్ని సమాజం ముందుకు తీసుకొచ్చింది. ఈ ఐదు అంశాల ఆధారంగా సామాజిక పరివర్తనే లక్ష్యంగా, సమాజంలోని వివిధ వర్గాలను చేరుకోవడం. అలాగే సజ్జన శక్తి జాగరణ్ కూడా వుంది. అయితే పంచ పరివర్తన్అంటే కుటుంబ ప్రబోధన్, స్వదేశీ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమరసత, పౌరవిధులు.
అయితే… ‘‘స్వ’’ ఆధారిత జీవన శైలిలో కొన్ని ముఖ్యమైన విషయాలను పరిశీలిస్తే… విదేశీ వస్తువులకు బదులుగా దేశీయంగా తయారైన (స్వదేశీ) వస్తువులనే వాడటం ప్రధానం. అలాగే మాతృ భాషలో మాట్లాడటం, పండగల లాంటి సందర్భాలలో సంప్రదాయ భారతీయ వస్త్రధారణను ధరించడం, భారతీయ ఆహారాన్ని స్వీకరించడం, భజన చేయడం, గృహ అలంకరణలో భారతీయత ఉట్టిపడటం, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేయడం, అలాగే చారిత్రక ప్రదేశాలను సందర్శించడం ఇందులో వున్నాయి.
అయితే స్వదేశీ జీవన విధానం అనేది మరింత లోతైన విస్తృతమైన అర్థాన్ని కలిగి వుంది. ‘‘స్వదేశీ’’ అనే పదంలో అంతర్లీనంగా ‘‘స్వ’’ (self) అనే పదం కూడా వుంది. స్వ అనేది మూడు రకాలైన కోణాలతో వుంది. ఈ మూడే భారత్ కి ఓ విశిష్టమైన గుర్తింపును, వ్యక్తిత్వాన్ని తెచ్చిపెట్టాయి. ఈ మూడు గుణాలు కూడా మన వ్యక్తిగత జీవితంలో, వృత్తిపరమైన, కుటుంబ జీవనంలో, సామాజిక జీవనంలో సహజసిద్ధంగా వ్యక్తమైపోవాలి. అప్పుడే దానిని స్వదేశీ జీవన విధానం అని అనగలుగుతాం.
అయితే మన దేశ మొట్ట మొదటి ‘‘స్వ’’ ఆధ్యాత్మికతే. ఇది అత్యంత ప్రాథమికమైంది కూడా. భారతీయ దృక్పథం ఆధ్యాత్మికతతో గాఢంగా అల్లుకుపోయింది. ఈ కారణం చేత ఇది సర్వాంగీణమైంది. భారత దేశం సమస్తం దీనితోనే నిబిడీకృతమైంది. సమస్త సృష్టి కూడా దీనితో ముడిపడి వుంది. వసుధైవ కుటుంబం అన్న ఆదర్శం దీని నుంచే ఉద్భవించింది.
భారతీయ దృక్పథం ప్రకారం ఉన్నది ఒకే చైతన్యం. అదే అసంఖ్యాకమైన రూపాల్లో వ్యక్తమవుతోంది. దానినే మనం వేదాంత పరిభాషలో ‘‘ఏకం సత్ విప్రా బహుధా వదంతి’’ అని పిలుస్తాం. వైవిధ్యం అనేది భేదమే కాదు. అది సమగ్రమైన బహుళమైన వ్యక్తీకరణగా చూస్తాం. ప్రతి ఆత్మలోనూ దైవత్వం అంతర్లీనంగా వుంటుంది. అంతర్గతమైన, బాహ్యంగా వున్న ప్రకృతిని నియంత్రించడం ద్వారా మనలో నిగూఢమై వున్న దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడమే మనిషి అంతిమ లక్ష్యం. దీనిని భక్తియోగం, ధ్యాన యోగం, లేదా జ్ఞాన యోగం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చు.ఇవే మోక్షానికి మార్గాలు. అంటే వ్యక్తిగత అహాన్ని పూర్తిగా అధిగమించి, విశ్వమంతా వ్యాపించి వున్న ఆ చైతన్యంలో విలీనం కావడం ద్వారా తానూ విశ్వవ్యాపక చైతన్యమే అవుతున్నాడు.
అయితే.. మోక్షం పొందే మార్గాలు అనేకంగా వుంటాయి. వారి వారి స్వభావాలు, ప్రవృత్తులు, జీవితం ద్వారా ఏర్పడిన అనుభవాల సారాంశాన్ని అలుముకొని విభిన్నంగా వుంటుంది. అందుకే ఇది పూర్తిగా వ్యక్తిగత ప్రయాణమే. దీనిని సాధారణ భాషలో ‘‘ఉపాసన’’ అని పిలుస్తాం.ఈ నమ్మకం కారణంగా, భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య సంప్రదాయం ఎల్లప్పుడూ ఉంది. మతం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరడానికి సహాయపడుతుంది, తద్వారా ధర్మాన్ని ఆచరించడానికి వీలు కల్పిస్తుంది; మతం ధర్మానికి పర్యాయపదం మాత్రం కాదు.
పాశ్చాత్య దేశాలలో జాతీయ భావన అనేది రాజ్యం ఆధారితంగా వుంటుంది. దీనికి భిన్నంగా మన దేశంలో రాజ్యం కాకుండా, సమాజమే జాతీయతకు సజీవ రూపంగా నిలుస్తుంది. ఈ కారణంగానే రాజ్యాంగ పీఠికలో ‘‘”మేము, భారతదేశ ప్రజలం…” అనే పదాలతో ప్రారంభమవుతుంది. నిజానికి పరిపాలన, పరస్పర సహజీవనానికి మూలం సమాజమే తప్ప, రాజ్యం కాదు. కాబట్టే సంక్షేమ రాజ్యం అనే భావన భారతీయమైంది కాదు.
తన ప్రఖ్యాత వ్యాసం ‘స్వదేశీ సమాజ్’లో, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇలా రాశారు: సంప్రదాయ భారతదేశంలో న్యాయం, అంతర్గత మరియు బాహ్య భద్రత, విదేశీ వ్యవహారాలు వంటి అంశాలు మాత్రమే రాజ్యం యొక్క అధికార పరిధిలోకి వచ్చేవి.విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపార వ్యవహారాలు, కళలు, సంగీతం, నాటకరంగం, ప్రయాణాలు, తీర్థయాత్రలు మరియు వాటి నిర్వహణ..ఇలా జీవనానికి ఆధారభూతమైన వ్యవస్థలన్నింటినీ సమాజమే స్వయంగా నిర్వహించేది. వీటికి సంబంధించిన నిధులు రాజ్యం నుండి వచ్చేవి కావు; ఆ బాధ్యతలన్నింటినీ సమాజమే స్వయంగా భరించేది.రవీంద్రనాథ్ ఠాగూర్ మాటల్లో: తన అవసరాల కోసం రాజ్యంపై అత్యంత తక్కువగా ఆధారపడే సమాజమే స్వదేశీ సమాజం.
భారతీయ తత్వశాస్త్రంలో, భౌతిక సంపదను, ఆధ్యాత్మిక ఉన్నతిని రెండింటినీ ఏకకాలంలో సాధించడమే జీవిత పరిపూర్ణతగా పరిగణించబడుతుంది. కేవలం భౌతిక సుఖాలను లేదా కేవలం త్యాగాన్ని మాత్రమే అనుసరించడం అసంపూర్ణతగా పరిగణించరు.ఈ భావమే వైశేషిక సూత్రంలో ఇలా వ్యక్తం చేయబడింది: “యతో అభ్యుదయ నిఃశ్రేయస సిద్ధిః స ధర్మః (1.1.2)” ఏది భౌతిక శ్రేయస్సును మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని ఈ రెండింటినీ సిద్ధింపజేస్తుందో, అదే ధర్మం.
ఇక… ఈ ‘‘స్వ’’ ను అర్థం చేసుకోవడంలో మరో ముఖ్యమైన అంశం. సమాజం కోసం వివిధ పనులు చేసే ప్రతి ఒక్కరూ ముఖ్యమైనవారే. సమానులే. ఈ సమానత్వాన్ని ఆచరించడమే సామరస్యం. (సమరసత). ఒకే చైతన్యం సృష్టి అంతటా వ్యాపించి వుందని భారతీయ ఆధ్యాత్మికత చెబుతోంది. కాబట్టి, సమాజంలో ఏ రకమైన పనిలో నిమగ్నమై ఉన్న సోదరుడైనా లేదా సోదరి అయినా సరే.. నాలో ఏ చైనత్యం అయితే వుందో, అదే చైతన్యం వారిలోనూ వుంది. ఏ పనీ తక్కువ కాదు, ఈ ప్రపంచంలో ప్రతి పనికీ ఓ స్థానం వుంది. అందుకే నిమ్న, ఉన్నత కులాలు అన్న భావన ‘‘స్వ’’ తత్వానికి పూర్తిగా విరుద్ధమైంది.
మన మౌలిక సారం.. ‘‘హిందవ: సోదరా: సర్వే:’’ అంటే హిందువులందరూ సోదరులు. భారతాంబ బిడ్డలే. సమానులే. కాబట్టి ‘స్వదేశీ జీవన విధానం’ అంటే సమాజంలో సమ్మిళితత్వాన్ని మరియు సామరస్యాన్ని ఆచరించడమే. అన్ని కులాలకు, వర్గాలకు, అన్ని రకాల వృత్తులకు చెందిన ప్రజలను ఏకం చేయడం. అలాగే మనం మరో దానిని కూడా తరుచుగా వాడుతుంటాం ‘‘మాతా భూమి: పుత్రోహం పృథివ్యా:’’(12, పృథ్వీ సూక్తం, అధర్వవేదం).ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడను అని అర్ధం.
కానీ నేడు పాశ్చాత్య అభివృద్ధి నమూనాను గుడ్డిగా అనుకరించడం ద్వారా మనం తీవ్రమైన పర్యావరణ అసమతౌల్యాన్ని, సంక్షోభాన్ని మనకి మనమే సృష్టించుకున్నాం. ప్రకృతి (సృష్టి) మనకు తల్లి. కాబట్టి దానిని కేవలం మన అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే వుండాలి తప్పించి, దోపిడీ కోసం మాత్రం కాదు. ఓ సారి ఓ చోట ఎన్నికలు వచ్చాయి. నలుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, భూ కాలుష్యం మరియు ఆహార కాలుష్యం. ఆ నలుగురూ తమ ఎన్నికల గుర్తుగా ‘మానవుడిని’ కోరారు. అప్పుడు ఎన్నికల అధికారి ఇలా అన్నారు:ఈ చిహ్నం కేవలం ఒక్కరికి మాత్రమే దక్కుతుంది. తాము దీనికి ఎందుకు అర్హులమో అత్యంత బలమైన కారణాన్ని ఎవరు వివరిస్తారో, వారికే ఇది లభిస్తుంది.’’ అని చెప్పేశారు. వారందరూ ఒకే మాట అన్నారు: “మాకు జన్మనిచ్చి, మమ్మల్ని పోషించి, పెంచి పెద్ద చేసినది ఆ మానవుడే. ఈనాడు మేము ఇంత బలంగా ఎదగడానికి కారణం, ఇదంతా ఆ మానవుడు మాకు ఇచ్చిన వరమే.” అని చెప్పేశారు.
ఈ కథ మనల్ని ఆలోచింపజేస్తుంది. ఈ సమస్యలను సృష్టించే మానవుడు. అభివృద్ధి చెందాం అని చెప్పుకునే వ్యక్తే. సుమారు 500 ఏళ్లుగా అతను అనుసరించిన అభివృద్ధి నమూనాయే నేడు నీరు, గాలి, భూమి, ఆహారాన్ని సంక్షోభంలోకి నెట్టేసింది. దీనికి భిన్నంగా, ప్రకృతితో సమతుల్యతను పాటిస్తూనే, భారత జాతీయ జీవన విధానం కనీసం ఇరవై వేల సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు నిలిచి ఉంది. కాబట్టి, పర్యావరణాన్ని రక్షించడానికి మరియు దాని సమతుల్యతను కాపాడటానికి ‘స్వదేశీ జీవన విధానం’’మే కీలకం. అయితే దీనికి రోజువారీ సాధన కావాలి. నీటిని అనవసరంగా వృథా చేయకపోవడం, ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ కు (సింగిల్ యూజ్ ప్లాస్టిక్) కు దూరంగా వుండటం, చెట్లను నాటడం, వాటిని పోషించడం, సంరక్షించడం వంటి సాధారణ చర్యలు ఎంతో మేలు చేస్తాయి.
భారతీయ చింతన విధానమిదీ…
పాశ్చాత్య చింతన వ్యక్తివాదానికి ప్రాధాన్యతనిస్తుంది. దీనికి భిన్నంగా, సమాజంలో అత్యంత సూక్ష్మమైన ప్రమాణం వ్యక్తి కాదని, కుటుంబమేనని భారతీయ చింతన భావిస్తుంది. ఒక కుటుంబం ఏర్పడాలంటే, వ్యక్తిలోని ‘నేను’ భావం ‘మనం’గా పరిణమించి, అందులో విలీనం కావాలి. అయితే ఈ ప్రయాణం కుటుంబంతో ప్రారంభమై, క్రమ క్రమంగా విస్తరిస్తూ, బంధు మిత్రులు, గ్రామం లేదా పట్టణం, రాష్ట్రం, దేశం, సమస్త మానవాళి, చివరగా సృష్టి వరకూ విస్తరిస్తుంది. ఇలా విస్తరించిన ‘‘మనం’’ లో అంతర్లీనంగా వెలుగొందే పరమ చైతన్యంతో కలిసిపోవడమే మానవ జీవితానికి అంతిమ పరమార్థం. దీనినే మనం మోక్షం అని పిలుస్తాం.
ఈ పరిణామ క్రమమే మన భారతీయ తత్వ శాస్త్రంలో నాలుగు దశలుగా విభజించబడింది. వ్యక్తి (వ్యష్టి), సమాజం (సమష్టి), సృష్టి, పరమాత్మ (పరమేష్టి). ఈ సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇవి ఆరోహణ క్రమంలో ఉండే సోపానాలు. ఈ ప్రయాణానికి ప్రారంభ బిందువు కుటుంబమే; అందుకే, జీవితంలోని నాలుగు ఆశ్రమాలలో (దశలలో), గృహస్థాశ్రమానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు.
ప్రపంచం నిరాశలో ఉండవచ్చు, కానీ విభిన్న ఆరాధనా పద్ధతులు, భాషలు, జాతి వైవిధ్యం మరియు పరిమిత వనరులు ఉన్నప్పటికీ, మానవాళి మొత్తం సుసంపన్నమైన, సామరస్యపూర్వకమైన మరియు శాంతియుతమైన జీవితాన్ని గడపడం సాధ్యమే.దీని వెనుక ఉన్న జ్ఞానం భారతదేశం యొక్క ఆధ్యాత్మిక దృక్పథంలోనే ఉంది. అందువల్ల, మానవాళి సంక్షేమం కోసం, భారతదేశం ఒక సంపన్న, సమర్థవంతమైన, ఆత్మవిశ్వాసం గల దేశంగా నిలవడం మరియు తన మౌలిక గుర్తింపును కాపాడుకోవడం అత్యవసరం.
భారతీయ చింతనను ఆచరించే సమాజం గనుక లేకపోతే, ఈ జ్ఞానం కేవలం పుస్తకాలకు, పండిత చర్చలకు మాత్రమే పరిమితమైపోతుంది. ఈ చింతనను ఆచరణలోకి, వ్యవహారంలోకి తీసుకువచ్చే సమాజం కుటుంబ వ్యవస్థ ద్వారానే రూపుదిద్దుకుంటుంది. కుటుంబం అన్న పద్ధతి ద్వారానే సాధ్యమవుతుంది. సంభాషణలు మరియు చర్చల ద్వారా ఈ మేధో, సాంస్కృతిక వారసత్వాన్ని పిల్లలకు అందించడం కుటుంబం యొక్క ప్రాథమిక బాధ్యత. దీని తర్వాతి కోవలో సమాజం, పాఠశాల పాత్ర వస్తుంది. సాధారణంగా, కుటుంబ కొనసాగింపును నిలబెట్టడానికి ప్రతి కుటుంబానికి సుమారుగా 2.1 అంటే ముగ్గురు పిల్లలు ఉండటం అవసరం.
కుటుంబ సభ్యులందరూ వారానికి ఓసారి కలిసి కూర్చోవాలి. మాట్లాడుకోవాలి. భోజనం చేయాలి. ఇలా ఒకరితో ఒకరు కలిసి మెలిసి వుంటే, సామాజిక, బౌద్ధిక మరియు సాంస్కృతిక కొనసాగింపు సహజంగానే నిలబడుతుంది.ఈ ప్రాతిపదికన, తన ప్రపంచ స్థాయి పాత్రను పోషించడానికి భారత్ సమర్థవంతంగా, చురుకుగా మరియు సాధికారతతో కొనసాగుతుంది. ఇది భారత్ ‘స్వ’ కు ఒక ప్రత్యక్ష రూపం; ఇది ‘స్వదేశీ జీవన విధానం’లో అవిభాజ్యమైంది.రాజ్యం అండగా నిలవగలదు, కానీ ప్రాథమిక బాధ్యత మాత్రం సమాజానిదే. అటువంటి సమాజాన్ని తీర్చిదిద్దడంలో కుటుంబం పోషించే పాత్ర అత్యంత మౌలికమైనది మరియు నిర్ణయాత్మకమైనది





