
కెనడాలోని టొరంటో నగరంలో వందలాది మంది భారతీయులు సంప్రదాయ మరియు బాలీవుడ్ సంగీతానికి నృత్యం చేస్తున్న వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాస్తవానికి ఈ వీడియో 2024 నాటిదైనా, రెండేళ్ల తర్వాత మళ్లీ విస్తృతంగా షేర్ అవుతూ అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.
విదేశాల్లో భారతీయ సంస్కృతికి మరో నిదర్శనం !
టొరంటో నగరంలోని రద్దీ వీధుల్లో భారతీయ మూలాలున్న ప్రజలు ఉత్సాహంగా నృత్యం చేస్తూ నిర్వహించిన ఈ వేడుకను అనేక మంది భారతీయులు మరియు ప్రవాస భారతీయులు భారతీయ సంస్కృతి, ఐక్యతకు ప్రతీకగా అభివర్ణిస్తున్నారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తమ మూలాలను, సంప్రదాయాలను మరచిపోకుండా భారతీయులు కొనసాగిస్తున్నారని వారు పేర్కొంటున్నారు.
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
వీడియో వైరల్ అయిన తర్వాత కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కెనడాలో పెరుగుతున్న వలసలపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మరికొందరు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, భారతీయ వలసదారులు కెనడా ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ రంగానికి, పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయానికి గణనీయంగా దోహదపడుతున్నారని గుర్తు చేశారు.
ఒక యూజర్ వివాదాస్పదమైన క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేయడంతో వివాదం మొదలైంది. కెనడా ఇప్పుడు భారతీయ వలసరాజ్యంగా మారిపోయింది. టొరంటోలో కెనడియన్లే ఇప్పుడు మైనారిటీలుగా మారిపోతున్నారు. వలసవచ్చిన వారి సంఖ్య గతంలో కంటే మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోయింది. దీనిని మనం ఇలాగే వదిలేయ కూడదు. కెనడియన్లారా, ఇప్పటికైనా మేల్కోండి అంటూ ఎక్స్‌లో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అంతేకాదు రాబోయే కొద్ది సంవత్సరాల్లో కెనడాలోని ‘బ్రాంప్టన్’ నగరం పూర్తిగా భారతీయ మూలాలున్న వారితో నిండిపోయి, వారే మెజారిటీగా మారే నగరంగా రూపాంతరం చెందుతుంది. ఇది కెనడాపై జరుగుతున్న థర్డ్ వరల్డ్ (మూడో ప్రపంచ దేశాల) ఆక్రమణ అంటూ జాతి విద్వేష ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
“వేడుకలు జరుపుకోవడం తప్పా?” అని ప్రశ్నించిన నెటిజన్లు
భారతీయులకు మద్దతుగా స్పందించిన పలువురు, ప్రజలు శాంతియుతంగా తమ సంస్కృతిని ప్రదర్శించడం ప్రజాస్వామ్య దేశాల్లో సహజమని పేర్కొన్నారు. “ఈ కార్యక్రమం వల్ల ఎవరికి నష్టం జరిగింది?”, “ప్రజలు ఆనందంగా గడపడం కూడా తప్పేనా?” అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తారు.
విదేశాల్లో భారతీయుల విజయగాథ
ఇటీవలి సంవత్సరాల్లో కెనడా సహా పలు పాశ్చాత్య దేశాల్లో భారతీయులు విద్య, సాంకేతికత, వైద్యం, వ్యాపారం మరియు ప్రభుత్వ రంగాల్లో విశేష విజయాలు సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ సమాజం పెరుగుతున్న ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.
జాతి విద్వేష వ్యాఖ్యలపై ఆందోళన
ఈ పాత వీడియో మళ్లీ వైరల్ కావడంతో కొన్ని సోషల్ మీడియా వేదికలలో జాతి వివక్షాపూరిత వ్యాఖ్యలు కూడా కనిపించాయి. సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీసే ఇటువంటి వ్యాఖ్యలను పలువురు ఖండిస్తూ, పరస్పర గౌరవం మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.





