News

పాకిస్థాన్‌ మతపెద్దల వీడియోలు బలవంతంగా చూపించారు

7views

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న టీసీఎస్‌ కార్యాలయంలో బలవంతపు మత మార్పిడులు, లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో దాఖలు చేసిన ఛార్జిషీటుతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాసిక్‌ కోర్టులో గతవారం దాఖలైన ఛార్జిషీటుతో బాధితులే లక్ష్యంగా నిందితులు పన్నాగం పన్నినట్లు వెల్లడైంది. పాకిస్థానీ ఇస్లామిక్‌ మత గురువు, బోధకుడు తారీఖ్‌ జమీల్, భారత వివాదాస్పద మత బోధకుడు జాకీర్‌ నాయిక్‌ వీడియోలను తనకు బలవంతంగా చూపించారని బాధితుల్లో ఒకరు తెలిపారు. ఇస్లాం మతం గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఆ వీడియోలను చూపించినట్లు బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తామనే నెపంతో తన బలహీనతలను నిందితులు ఆసరా చేసుకొని మత మార్పిడికి యత్నించినట్లు తెలిపింది. ఇస్లాంను స్వీకరిస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుందని నమ్మించడంతో ఆ విషయాలను తాను నమ్మడం ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. భగవంతుడిని పాటలు వినడం, గుడికి వెళ్లడం మానేస్తే భవిష్యత్తు బాగుంటుందని నమ్మబలికారని పేర్కొంది. దానిశ్‌ షేక్, తౌసీఫ్‌ అత్తార్‌లతో పాటు నిదాఖాన్, పరారీలో ఉన్నప్పుడు ఆమెకు ఆశ్రయం కల్పించిన ఏఐఎంఐఎం కార్పొరేటర్‌ మతిన్‌ పటేల్‌లను నిందితులుగా ఛార్జీషీటులో చేర్చారు.