News

న్యూయార్క్ సెనెట్‌లో భారత స్వాతంత్య్ర దినోత్సవానికి గౌరవం

8views

అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర శాసనసభలో భారత స్వాతంత్య్ర దినోత్సవం ప్రాముఖ్యత మరోసారి ప్రతిధ్వనించింది. రాబోయే ఆగస్టు 15ను రాష్ట్రంలో భారత స్వాతంత్య్ర దినోత్సవంగా అధికారికంగా గుర్తించాలని గవర్నర్  కోరుతూ న్యూయార్క్ సెనెట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

తీర్మానంపై జరిగిన చర్చలో సభ్యులు భారత స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన  మహాత్మా గాంధీ ఘనమైన వారసత్వాన్ని స్మరించుకున్నారు. అలాగే అమెరికా అభివృద్ధి, ఆర్థిక ప్రగతి, సాంకేతిక రంగాల్లో ఇండో-అమెరికన్ సమాజం అందిస్తున్న విశిష్ట సేవలను ప్రశంసించారు.

తీర్మానానికి మద్దతు తెలుపుతూ సెనేటర్ జెరెమీ కూనీ మాట్లాడుతూ, న్యూయార్క్ పౌరుల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన దినోత్సవాలను గుర్తించడం రాష్ట్ర శాసనసభ బాధ్యత అని పేర్కొన్నారు. భారతీయ అమెరికన్ సమాజం రాష్ట్ర సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలకు అందిస్తున్న విశేష కృషిని ఆయన కొనియాడారు.

ఇతర పలువురు సెనేటర్లు కూడా ఈ తీర్మానానికి మద్దతు ప్రకటిస్తూ, భారతీయ సమాజం అమెరికా బహుళ సాంస్కృతిక సంప్రదాయాలను మరింత బలోపేతం చేస్తోందని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా, భారత కాన్సులేట్ జనరల్, న్యూయార్క్   సెనెట్ చర్యను స్వాగతించింది. ఈ నిర్ణయం భారత్–అమెరికా మధ్య ఉన్న స్నేహపూర్వక బంధం, ప్రజల మధ్య పెరుగుతున్న అనుబంధానికి ప్రతిబింబమని కాన్సులేట్ పేర్కొంది.

భారత స్వాతంత్య్ర దినోత్సవానికి అంతర్జాతీయ వేదికలపై లభిస్తున్న గుర్తింపు, ప్రపంచవ్యాప్తంగా భారతీయుల పెరుగుతున్న ప్రభావాన్ని ఈ పరిణామం మరోసారి చాటిచెబుతోందని భారతీయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.