
33views
దేశమంతా సంఘ కార్యం విస్తరిస్తోంది. అయితే సంఘ కార్యానికి పునాది కార్యకర్తే. అయితే.. సంఘ విస్తరణకు, సైద్ధాంతిక పునాది పటిష్టతకు ఓ ప్రచారక్ (పూర్తి సమయం దేశం కోసం పనిచేసే వ్యక్తి) ఎంత అవసరమో, గృహస్థు కూడా అంతే అవసరం. ఇద్దరూ ఒకరికి ఒకరు ప్రేరణగా నిలుస్తుంటారు.
అయితే… సంఘ విస్తరిస్తున్నా కొద్దీ.. అన్ని చోట్లా సంఘ కార్యం నిర్వహింపబడే తీరుతెన్నులు ఒకేవిధంగా వుండాలనే ఆలోచన కూడా నడిచింది. ప్రచారకుల గురించి కల్పన ముందుకు వచ్చింది. దీని వెనక కూడా ఓ సుదీర్ఘమైన భూమిక వుంది.
నిత్య శాఖ నిర్వహణలో పాటించాల్సిన ఆచార పద్ధతిని, ఇతర కార్యక్రమాలనూ వివరించేందుకు ఇప్పుడు చాలా సాహిత్యం వచ్చింది. సంఘ ప్రారంభం రోజుల్లో అవన్నీ వుండేవి కావు. దేశమంతటా వున్న శాఖలలో, సంఘకార్యంలో ఒకే విధమైన పద్ధతిని అనుసరించాలంటే, ఒకే తీరున అంతటా జరగాలంటే, దీనిపట్ల శ్రద్ధవహించే ఓ వ్యవస్థ ఉన్నప్పుడే అది సాధ్యపడుతుందన్న ఆలోచన వచ్చేసింది. తదనుగుణంగా శారీరిక శిక్షణ ఇవ్వడం కోసం ప్రాథమిక శిక్షావర్గలు, సంఘ శిక్షావర్గలు నిర్వహించడం ప్రారంభమైంది.
వేర్వేరు శాఖల నుంచి స్వయంసేవకులు ఈ వర్గలకు వస్తుండేవారు. వారందరికీ ఒకే విధమైన శిక్షణ ఇచ్చేవారు.వారు తమ స్వస్థలాలకు వెళ్లి శాఖలు నడిపించేవారు. అయితే కాలక్రమాన సంఘకార్యం విస్తరిస్తోంది. తమ వద్ద కార్యకర్తలు అవసరమని, కాబట్టి కార్యకర్తలను పంపించడని కోరడం ప్రారంభమైంది. నెలా, రెండు నెలలు వుండి శాఖ నడిపేవారిని మీరు మా నగరానికి పంపించినట్లయితే, శాఖ బాగా నడుస్తుందని చెప్పేవారు. నాలుగు పక్కల నుంచి ఇలాంటి అభ్యర్థనలు వచ్చాయి.
దీంతో డాక్టర్జీ కొందరిని అక్కడక్కడ గ్రామాలకు, నగరాలకు పంపేవారు. అలా బయటి గ్రామాలకు వెళ్తూ వుండిన కార్యకర్తలకు అక్కడి వారు భోజనం, వసతి సంబంధమైన ఏర్పాట్లు చేస్తుండేవారు. ఆ పద్ధతిలో కార్యకర్తలను ఓ చోట నుంచి మరో చోటకు పంపడం ప్రారంభమైంది.
నాగపూర్ చుట్టుపక్కల చిన్నవి, పెద్దవి అయిన కొన్ని శాఖలు వుండేవి. సంఘ కార్య నిమిత్తం తమ గ్రామం విడచిపెట్టి, వేరుచోటికి పోయే కార్యకర్తలకు ప్రచారకులని గానీ, విస్తారలకులని గానీ పేరు పెట్టలేదు. మహారాష్ట్రలో అప్పటికి కొంత కాలం గా సంఘకార్యం జరుగుతూ వచ్చినందున దీర్ఘకాల ప్రాతిపదికన వచ్చి పనిచేసే వారిని పంపించాలని కోరుతూ వుండేవారు. నెలా, రెండు నెలలు వుంటే సరిపోదని, ఇంకా ఎక్కువ కాలం వుండేవారు కావాలని కోరుతూ వుండేవారు.
దానిలో నుంచి తమ చదువు సంధ్యలు ముగించుకున్న ఏదో ఒక ఉద్యోగంలో చేరడానికి బదులుగా సంఘ కార్యం నిర్వహణకు సమయమిచ్చే విధంగా యువకులుముందుకు రావాలన్న కల్పన చేశారు. అలా వస్తున్న వారి సంఖ్య పెరుగుతూ రాగా, నెమ్మది నెమ్మదిగా ప్రచారకుల పేరుతో పనిచేస్తున్నస్వయంసేవకుల వర్గం రూపుదిద్దుకొంది. తమ చదువు పూర్తి చేసుకొన్న స్వయంసేవకులలో వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు. ఇలా బయటి ప్రాంతాలకు వెళ్లి, పనిచేసే పద్ధతి ప్రారంభమైంది.
ఈ పద్ధతిలో పని ప్రారంభమైంది. దీని వల్ల ఫలితం కూడా కనిపిస్తోంది. దీంతో సంఘ కార్యాన్ని మరింత విస్తరింపజేయాలని నిర్ణయించారు. పూర్తి సమయమిచ్చి, పనిచేసే ప్రశిక్షిత కార్యకర్తలు ఎవరినైతే ఆ తర్వాత ప్రచారకులుగా అన్నారో, పెద్ద సంఖ్యలో వుండాలని ఆలోచన వచ్చింది.సంఘకార్యం ఏ విధంగా విస్తరిస్తూ వచ్చిందో, దాంతో పాటు సంఘంలో లభించిన సంస్కారాలు, ప్రేరణా కారణంగా సంఘ కార్యం చేయడానికి స్వచ్ఛందంగా తమ పూర్తి కాలాన్ని వెచ్చించడానికి సిద్ధపడే వారి సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. వారు తమ చదువు పూర్తి చేసుకొని వేర్వేరు క్షేత్రాలకు వెళ్లడం కూడా ప్రారంభించారు. అలాంటి కార్యకర్తలు అన్ని ప్రాంతాలకూ వెళ్లారు.




